IND VS SA 3rd T20: కోహ్లిని వెనక్కునెట్టిన సూర్యకుమార్‌

14 Dec, 2023 23:03 IST|Sakshi

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టీ20లో మెరుపు శతకంతో (56 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 100 పరుగులు) విరుచుకుపడిన సూర్యకుమార్‌.. భారత్‌ తరఫున అత్యధిక సిక్సర్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిని వెనక్కునెట్టి రెండో స్థానానికి ఎగబాకాడు.

విరాట్‌ 107 ఇన్నింగ్స్‌ల్లో 117 సిక్సర్లు బాదగా.. స్కై కేవలం 57 ఇన్నింగ్స్‌ల్లోనే విరాట్‌ రికార్డును అధిగమించాడు (123 సిక్సర్లు). ఈ విభాగంలో టీమిండియా రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (140 ఇన్నింగ్స్‌ల్లో 182 సిక్సర్లు) స్కై, విరాట్‌ల కంటే ముందున్నాడు. వీరి తర్వాతి స్థానాల్లో కేఎల్‌ రాహుల్‌ (68 ఇన్నింగ్స్‌ల్లో 99), యువరాజ్‌ సింగ్‌ (51 ఇన్నింగ్స్‌ల్లో 74) ఉన్నారు.

ఇదే మ్యాచ్‌లో స్కై మరిన్ని రికార్డులు కూడా సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సెంచరీల రికార్డు (4).. రోహిత్‌ తర్వాత సెంచరీ చేసిన రెండో టీమిండియా కెప్టెన్‌గా.. నాలుగు అంతకంటే కింది స్థానాల్లో వచ్చి అత్యధిక 50 ప్లస్‌ స్కోర్లు (15) చేసిన ఆటగాడిగా పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. 

కాగా, సూర్యకుమార్‌సుడిగాలి శతకంతో విరుచుకుపడటంతో ఈ మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోర్‌ చేసింది. స్కైకు యశస్వి జైస్వాల్‌ (60) అర్ధసెంచరీ తోడవ్వడంతో భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు స్కోర్‌ చేసింది. వీరిద్దరు మినహా టీమిండియా ఆటగాళ్లంతా తక్కువ స్కోర్లకే పరిమితమయ్యారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన సౌతాఫ్రికా ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

>
మరిన్ని వార్తలు