న్యూజిలాండ్‌ బెంగ లేదు..!

7 Jul, 2019 17:54 IST|Sakshi

మాంచెస్టర్‌:  ప్రస్తుత వన్డే వరల్డ్‌కప్‌ నాకౌట్‌ సమరంలో భాగంగా న్యూజిలాండ్‌తో భారత జట్టు అమీతుమీ తేల్చుకోనుంది. మంగళవారం మాంచెస్టర్‌ వేదికగా ఇరు జట్ల మధ్య తొలి సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ జరుగనుంది. అయితే న్యూజిలాండ్‌ బెంగ లేదని అంటున్నాడు భారత బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్‌ బంగర్‌. ‘ మాకు న్యూజిలాండ్‌ సామర్థ్యం ఏమిటో తెలుసు. వారి బలాలు, బలహీనతలు భారత్‌కు బాగా తెలుసు. కివీస్‌తో సిరీస్‌ ఆడి ఎంతో కాలం కాకపోవడంతో ఆ జట్టు ఆటగాళ్లపై మాకు ఒక అంచనా ఉంది. కివీస్‌పై మ్యాచ్‌లో గెలుపు కోసం కసరత్తు చేస్తున్నాం’ అని బంగర్‌ తెలిపాడు. ఇక టీమిండియా బ్యాటింగ్‌ ఆర్డర్‌ గురించి ఎక్కువగా ఆలోచించడం లేదన్నాడు. ఏ స్థానంలో ఎవరు అనే దాని కోసం చర్చ అనవసరమన్నాడు. ఆటగాళ్లంతా ఫామ్‌లో ఉన్న కారణంగా బ్యాటింగ్‌ ఆర్డర్‌ గురించి చింతించాల్సిన పని లేదన్నాడు.

మరొకవైపు శ్రీలంకతో మ్యాచ్‌లో సెంచరీ చేసి ఒకే వరల్డ్‌కప్‌లో ఐదు సెంచరీలు చేసిన తొలి క్రికెటర్‌గా నిలిచిన రోహిత్‌ శర్మపై బంగర్‌ ప్రశంసలు కురిపించాడు. వన్డే ఫార్మాట్‌లో రోహిత్‌ శర్మ విశేషంగా రాణించడానికి అతను గేమ్‌ను పూర్తిగా అర్థం చేసుకోవడమే కారణమన్నాడు. బేసిక్స్‌ను ఫాలో కావడమే రోహిత్‌ శర్మ సెంచరీలు కారణమని బంగర్‌ తెలిపాడు. ఒ‍క మెగా టోర్నీలో నిలకడగా రాణించడం వెనుక క్రెడిట్‌ అంతా అతనిదే అని పేర్కొన్నాడు.

>
మరిన్ని వార్తలు