సూపర్‌ షఫాలీ 

12 Nov, 2019 04:11 IST|Sakshi

మళ్లీ అర్ధ సెంచరీతో అదరగొట్టిన ఓపెనర్‌ ∙స్పిన్నర్‌ దీప్తి శర్మకు నాలుగు వికెట్లు

రెండో టి20లో విండీస్‌పై 10 వికెట్లతో భారత మహిళల జట్టు ఘనవిజయం

గ్రాస్‌ ఐలెట్‌ (సెయింట్‌ లూసియా): టీనేజ్‌ క్రికెటర్‌ షఫాలీ వర్మ (35 బంతుల్లో 69 నాటౌట్‌; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) మళ్లీ మెరిసింది. వరుసగా రెండో టి20 మ్యాచ్‌లోనూ వెస్టిండీస్‌ బౌలర్ల భరతం పట్టింది. ఫలితంగా ప్రపంచ చాంపియన్‌ వెస్టిండీస్‌పై భారత మహిళల జట్టు 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన రెండో టి20 మ్యాచ్‌లో భారత మహిళలు ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చేశారు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న వెస్టిండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 103 పరుగులు చేసింది. షెడీన్‌ నేషన్‌ (32; 3 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలువగా... భారత స్పిన్నర్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ దీప్తి శర్మ 4 ఓవర్లు వేసి కేవలం 10 పరుగులిచ్చి 4 వికెట్లు తీసింది. శిఖా పాండే, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్‌లు ఒక్కో వికెట్‌ పడగొట్టారు. 104 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు ఆడుతూ పాడుతూ ఛేదించింది. ఓపెనర్లు షఫాలీ వర్మ, స్మృతి మంధాన (28 బంతుల్లో 30 నాటౌట్‌; 4 ఫోర్లు) దూకుడైన ఆటకు భారత్‌ 10.3 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 104 పరుగులు చేసి విజయాన్ని ఖాయం చేసుకుంది. విండీస్‌పై తొలి టి20లోనూ షఫాలీ వర్మ (49 బంతుల్లో 73; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీ చేసిన సంగతి విదితమే. మూడో టి20 మ్యాచ్‌ ఈనెల 14న గయానాలో జరుగుతుంది.

మరిన్ని వార్తలు