పసిడితో ముగించారు

29 Mar, 2018 04:58 IST|Sakshi

భారత్‌ ఖాతాలో తొమ్మిది స్వర్ణాలు

జూనియర్‌ ప్రపంచకప్‌ షూటింగ్‌

సిడ్నీ: ఈ నెలారంభంలో సీనియర్‌ ప్రపంచకప్‌ టోర్నమెంట్‌లో భారత షూటర్లు ఓవరాల్‌ టీమ్‌ టైటిల్‌ నెగ్గగా... అదే జోరును జూనియర్‌ ప్రపంచకప్‌లోనూ కొనసాగించారు. సిడ్నీలో బుధవారం ముగిసిన ఈ టోర్నీలో భారత్‌ తొమ్మిది స్వర్ణాలతో రెండో ర్యాంక్‌లో నిలిచింది. చివరి రోజు భారత్‌కు నాలుగు పతకాలు లభించాయి. జూనియర్‌ మహిళల 25 మీటర్ల పిస్టల్‌ ఈవెంట్‌లో 16 ఏళ్ల ముస్కాన్‌ గురికి భారత్‌ ఖాతాలో తొమ్మిదో స్వర్ణం చేరింది. ఫైనల్లో ముస్కాన్‌ 35 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచింది.

భారత్‌కే చెందిన మను భాకర్‌ (18 పాయింట్లు) నాలుగో స్థానంలో నిలిచింది. ఇదే ఈవెంట్‌ టీమ్‌ విభాగంలో ముస్కాన్, మను భాకర్, దేవాన్షి రాణా బృందానికి పసిడి పతకం లభించగా... అరుణిమా, మహిమా, తనూ రావల్‌ జట్టుకు రజతం దక్కింది. జూనియర్‌ పురుషుల స్కీట్‌ టీమ్‌ ఈవెంట్‌లో అనంత్‌జీత్‌ సింగ్, ఆయూష్‌ రుద్రరాజు, గుర్నీలాల్‌ జట్టు 348 పాయింట్లు సాధించి రజతం గెల్చుకుంది. ఓవరాల్‌గా భారత్‌ 9 స్వర్ణాలు, 5 రజతాలు, 8 కాంస్యాలతో కలిపి 22 పతకాలు గెలిచింది. చైనా తొమ్మిది స్వర్ణాలు, ఎనిమిది రజతాలు, ఎనిమిది కాంస్యాలతో కలిపి 25 పతకాలు సొంతం చేసుకుంది.  

మరిన్ని వార్తలు