టోక్యో ఒలింపిక్స్‌కు వినేశ్‌ ఫొగాట్‌

18 Sep, 2019 15:41 IST|Sakshi

అర్హత సాధించిన భారత స్టార్‌ రెజ్లర్‌

నూర్‌-సుల్తాన్‌ (కజకిస్తాన్‌): భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ బుధవారం 2020 టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లోని సెకండ్‌ రేప్‌చేజ్‌ రౌండ్‌లో ఆమె సరా అన్‌ హిల్డర్‌బ్రాండ్ట్‌ (అమెరికా)ను సునాయసంగా ఓడించి.. 53కేజీల విభాగంలో ఒలింపిక్స్‌ బెర్త్‌ను సొంతం చేసుకున్నారు. 8-2 తేడాతో సరాను ఓడించిన ఫొగాట్‌.. గ్రీస్‌కు చెందిన టాప్‌ రెజ్లర్‌ మరియా ప్రెవోలరాకితో తలపడనున్నారు. మరియాపై గెలుపొందితే ఆమె కాంస్య పతకం సొంతం చేసుకుంటారు. 

మంగళవారం జరిగిన 53 కేజీల ప్రిక్వార్టర్‌ ఫైనల్లో డిఫెండింగ్‌ చాంపియన్‌ మయు ముకయిద (జపాన్‌) 7-0 తేడాతో ఫొగాట్‌ను చిత్తు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఈ జపాన్‌ రెజ్లర్‌ తన జైత్రయాత్ర కొనసాగించి గెలిచి ఫైనల్‌ చేరింది. దీంతో వినేశ్‌కు ‘రెపిచేజ్‌’లో పాల్గొనే అవకాశం దక్కింది. ఈ క్రమంలో యులియా బ్లహిన్యా (ఉక్రెయిన్‌), సరాలను ఓడించిన వినేశ్‌.. మరియాపై కూడా విజయం సాధిస్తే.. ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లోని కాంస్య పతకాన్ని తన ఖాతాలో వేసుకుంటారు. 

మరిన్ని వార్తలు