యాహూ.. ఆర్సీబీ మళ్లీ గెలిచిందోచ్‌

20 Apr, 2019 00:14 IST|Sakshi

పరుగుల వర్షం అంటే ఇదేనేమో.. 40 ఓవర్లు, 416 పరుగులు.. 26 సిక్సర్లు, 35 ఫోర్లు. బ్యాట్స్‌మెన్‌ ధాటికి బౌండరీలు చిన్న బోయాయి. బౌలర్లు బంతులెక్కడ వేయాలో అర్థంకాలేదు. తాజా ఐపీఎల్‌ సీజన్‌లో తొలి సారి ప్రేక్షకులకు కావల్సిన విందు, టీ20 మజాను ఆర్సీబీ, కేకేఆర్‌ జట్టు అందించాయి. తొలుత విరాట్‌ శతకంతో అదరగొట్టగా.. అనంతరం రసెల్‌, రాణా విధ్వంసం సృష్టించడంతో కోల్‌కతా ఈడెన్‌ గార్డెన్స్‌ మైదానం పరుగుల వర్షంతో తడిసిముద్దైయింది. విజయం ఎవరిని వరించినా అభిమానులు మాత్రం పరుగుల పండగ చేసుకున్నారు. 

కోల్‌కతా: రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు మరో విజయం సాధించింది. అవును ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 పరుగుల తేడాతో ఆర్సీబీ రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. దీంతో ప్లేఆఫ్‌ ఆశలను కోహ్లి సేన ఇంకా సజీవంగానే ఉంచుకుంది. ఆర్సీబీ నిర్దేశించిన 214 పరుగుల భారీ​ లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 203 పరుగులకే పరిమితమైంది. ఛేదనలో కేకేఆర్‌ టాపార్డర్‌ పూర్తిగా విఫలమైంది.
క్రిస్‌ లిన్‌(1), నరైన్‌(18), గిల్‌(9), ఊతప్ప(9)లు నిరాశ పరిచారు. దీంతో 79 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో నితీష్‌ రాణా(85 నాటౌట్‌; 46 బంతుల్లో 9ఫోర్లు, 5 సిక్సర్లు), రసెల్‌(65; 25 బంతుల్లో 2 ఫోర్లు, 9 సిక్సర్లు)లు పెను విధ్వంసం సృష్టించడంతో కేకేఆర్‌ విజయం అంచునకు చేరింది. అయితే వీరిద్దరు శక్తిమేర ప్రయత్నించినప్పటికీ భారీ​ స్కోర్‌ కావడంతో కేకేఆర్‌కు ఓటమి తప్పలేదు. 

అంతకుముందు  టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన ఆర్సీబీ ఆదిలోనే పార్ధివ్‌ పటేల్‌(11) వికెట్‌ను నష్టపోయింది. ఆపై అక్షదీప్‌ నాథ్‌(13)కూడా నిరాశపరచడంతో ఆర్సీబీ 59 పరుగులకే రెండో వికెట్‌ను నష్టపోయింది. ఆ తరుణంలో కోహ్లి-మొయిన్‌ అలీల జోడి తొలుత బాధ్యతాయుతంగా బ్యాటింగ్‌ చేసింది. అయితే ఓ దశలో మొయిన్‌ అలీ రెచ్చిపోయి ఆడటంతో స్కోరు బోర్డు పరుగులు తీసింది. అతనికి కోహ్లి నుంచి చక్కటి సహకారం లభించింది. ఈ క్రమంలోనే కోహ్లి ముందుగా హాఫ్‌ సెంచరీ సాధించగా, కాసేపటికి అలీ కూడా అర్థ శతకం నమోదు చేశాడు.
ప్రధానంగా కుల్దీప్‌ వేసిన 16 ఓవర్‌లో 27 పరుగులు సాధించిన మొయిన్‌ అలీ(66; 28 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లు).. అదే ఓవర్‌ ఆఖరి బంతికి ఔటయ్యాడు. అటు తర్వాత ఇక కోహ్లి విజృంభించి ఆడాడు. బౌలర్‌ ఎవరన్నది చూడకుండా సొగసైన షాట్లతో అలరించాడు. ఆఖరి ఓవర్‌లో సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లి(58 బంతుల్లో 9 ఫోర్లు 4 సిక్సర్లతో 100 పరుగులు).. చివరి బంతికి పెవిలియన్‌ చేరాడు. ఆర్సీబీ తొలి పది ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 70 పరుగులు చేస్తే, చివరి 10 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేయడం విశేషం. దీంతో ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది.

మరిన్ని వార్తలు