ఆర్సీబీపై మాల్యా వ్యంగ్యాస్త్రాలు

7 May, 2019 18:55 IST|Sakshi

హైదరాబాద్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) తాజా సీజన్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ప్రదర్శనపై ఆ జట్టు మాజీ యజమాని విజయ్‌ మాల్యా స్పందించారు. ఆర్సీబీ జట్టు ఎప్పుడూ బలంగానే ఉంటుందని కానీ అది పేపర్‌పై మాత్రమే అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆర్సీబీ మాజీ సహయజమాని అయిన మాల్యా బ్యాంకులకు కుచ్చు టోపీ పెట్టి విదేశాలకు పారిపోయిన విషయం తెలిసిందే. 2008లో బెంగళూరు సిటీలో నిర్వహించిన వేలంలో విజయ్ మాల్యా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో ఐపీఎల్ కమిటీ ముందుకొచ్చాడు. అయితే, ఆరంభ సీజన్‌లో ఆర్సీబీ పెద్దగా ఆకట్టుకునే ప్రదర్శన చేయలేదు. ఇప్పటివరకు జరిగిన 12 సీజన్లలో ఆ జట్టు కేవలం రెండు సార్లు ఫైనల్‌కు చేరుకున్నప్పటికీ... ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయింది.

తాజా ఐపీఎల్‌ సీజన్‌లోనూ కోహ్లి సేన చెత్త ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచి టోర్నీ నుంచి వైదొలిగింది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ యాజమాన్యం తన ట్విట్టర్‌లో ‘మాపై చూపించిన ప్రేమ, మద్దతకు ధన్యవాదాలు. మొత్తం జట్టుతో పాటు అభిమానులు, గ్రౌండ్ స్టాఫ్, సపోర్టింగ్ స్టాఫ్‌కు ధన్యవాదాలు. వచ్చే ఏడాది మరింత స్ట్రాంగ్‌గా వస్తాం’ అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ఈ పోస్ట్‌పై విజయ్ మాల్యా తనదైన శైలిలో స్పందించాడు. ‘ఆర్సీబీ ఎప్పుడూ గ్రేట్ లైనప్‌ని కలిగి ఉంది. ఇక్కడ చింతించాల్సిన విషయం ఏంటంటే అది పేపర్‌పైనే’ అంటూ ఆర్సీబీ జట్టుకు చురకలు అంటించారు.


 

మరిన్ని వార్తలు