‘డెవిల్‌’ పొట్రో...

20 Mar, 2018 00:27 IST|Sakshi
ఫెడరర్‌,డెల్‌ పొట్రో

ఇండియన్‌ వెల్స్‌లో సంచలన ప్రదర్శన

తొలి మాస్టర్స్‌ 1000 టైటిల్‌ సాధించిన అర్జెంటీనా స్టార్‌

ఫైనల్లో ఫెడరర్‌ అనూహ్య పరాజయం

3 మ్యాచ్‌ పాయింట్లు చేజార్చుకున్న స్విస్‌ దిగ్గజం  

కాలిఫోర్నియా: ఈ ఏడాది వరుసగా 17 విజయాలతో ఊపు మీదున్న నంబర్‌వన్‌ రోజర్‌ ఫెడరర్‌కు షాక్‌. గతంలో ఐదు సార్లు ఇదే టైటిల్‌ సాధించి డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన ఈ స్విస్‌ స్టార్‌కు ఇండియన్‌ వెల్స్‌ మాస్టర్స్‌ సిరీస్‌ టోర్నీ ఫైనల్లో ఊహించని పరాజయం. అర్జెంటీనా ఆటగాడు డెల్‌పొట్రో సంచలన ప్రదర్శన ముందు ఫెడెక్స్‌ తలవంచాల్సి వచ్చింది. ఫైనల్లో డెల్‌పొట్రో 2 గంటల 42 నిమిషాల్లో 6–4, 6–7 (8/10), 7–6 (7/2)తో ఫెడరర్‌ను ఓడించి తొలిసారి మాస్టర్స్‌–1000 స్థాయి టైటిల్‌ను గెలుచుకున్నాడు. మూడో సెట్‌లో 5–4తో ఆధిక్యంలో ఉండి తన సర్వీస్‌లో ఫెడరర్‌ 40–15తో విజయం అంచుల్లో నిలిచాడు. అయితే ఇదే గేమ్‌లో అతను మూడు సార్లు మ్యాచ్‌ పాయింట్లను కోల్పోవడం అనూహ్యం! ఫెడరర్‌ సర్వీస్‌ చేసిన పదో గేమ్‌లో డెల్‌పొట్రో బ్రేక్‌ సాధించడం... ఆ తర్వాత ఇద్దరు తమ సర్వీస్‌లు నిలబెట్టుకోవడంతో ఆట టైబ్రేక్‌కు చేరింది. ఈ దశలో చెలరేగిన డెల్‌పొట్రో మరో అవకాశం ఇవ్వలేదు. తాజా ప్రదర్శనతో డెల్‌పొట్రో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానానికి చేరుకున్నాడు. రెండేళ్ల పాటు గాయాలతో ఆటకు దూరమై ఒక దశలో 1,045 ర్యాంక్‌కు పడిపోయిన అతను 2016లో పునరాగమనం చేసి ఇటీవలే టాప్‌–10లోకి అడుగు పెట్టాడు.  ఫెడరర్, డెల్‌పొట్రో మధ్య ఈ ఫైనల్‌కు ముందు 24 మ్యాచ్‌లు జరగ్గా... 18 సార్లు విజయం రోజర్‌నే వరించింది. విజేతగా నిలిచిన డెల్‌పొట్రోకు 13,40,860 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 8 కోట్ల 74 లక్షలు) దక్కగా... ఫెడరర్‌ ఖాతాలో  6,54,380 డాలర్లు (రూ. 4 కోట్ల 26 లక్షలు) చేరాయి.  

ఇది నిజంగా చాలా పెద్ద విజయం. ఫైనల్లో ఫెడరర్‌ను ఓడించి నేను ఈ టైటిల్‌ను గెలిచానంటే నమ్మలేకపోతున్నాను. నా ఎడమ చేతి మణికట్టుకు మూడో శస్త్రచికిత్స తర్వాత ఆటను మానేయాల్సిన స్థితిలో నిలిచిన నేను ఈ క్షణాన్ని అసలు ఊహించలేదు. పునరాగమనం కోసం నేను చాలా కష్టపడ్డాను. ప్రస్తుతం నేను చాలా అద్భుతంగా ఆడుతున్నాననేది వాస్తవం. ఇక ముందు కూడా ఇదే జోరు కొనసాగిస్తా.  
  – డెల్‌ పొట్రో 

4 ఫైనల్స్‌లో ఫెడరర్‌పై డెల్‌ పొట్రో సాధించిన విజయాల సంఖ్య. 2009 యూఎస్‌ ఓపెన్, 2012, 2013 బాసెల్‌ ఓపెన్‌ ఫైనల్స్‌లో ఫెడరర్‌ను  ఓడించాడు.

వారెవ్వా...ఒసాకా 
ఇండియన్‌ వెల్స్‌ డబ్ల్యూటీఏ ప్రీమియర్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగిన 20 ఏళ్ల జపాన్‌ క్రీడాకారిణి నయోమి ఒసాకా విజేతగా అవతరించింది. ఫైనల్లో ఒసాకా 6–3, 6–2తో 20వ సీడ్‌ దరియా కసత్‌కినా (రష్యా)ను ఓడించింది. తద్వారా సెరెనా విలియమ్స్‌ (అమెరికా–1999లో), కిమ్‌ క్లియ్‌స్టర్స్‌ (బెల్జియం–2005లో) తర్వాత అన్‌సీడెడ్‌ హోదాలో ఈ టోర్నీ టైటిల్‌ నెగ్గిన మూడో క్రీడాకారిణిగా ఆమె గుర్తింపు పొందింది. విజేతగా నిలిచిన ఒసాకాకు 13,40,860 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 8 కోట్ల 74 లక్షలు), రన్నరప్‌ కసత్‌కినాకు  6,54,380 డాలర్లు (రూ. 4 కోట్ల 26 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.    

మరిన్ని వార్తలు