CWC 2023: నేడు భారత్‌తో న్యూజిలాండ్‌ సెమీస్‌ సమయం 

15 Nov, 2023 03:28 IST|Sakshi

నేడు ప్రపంచకప్‌ తొలి సెమీఫైనల్‌  

న్యూజిలాండ్‌తో భారత్‌ ఢీ 

అద్భుత ఫామ్‌లో టీమిండియా

ఆత్మవిశ్వాసంతో కివీస్‌ బృందం

మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, హాట్‌ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం  

9 మంది ప్రత్యర్థులు... 9 విజయాలు... అదిరిపోయే బ్యాటింగ్‌ బలగం... పేసర్ల అద్భుత ప్రదర్శన... స్పిన్నర్ల జోరు... ఫీల్డింగ్‌ మెరుపులు... వెరసి ఇప్పటివరకు టీమిండియా అజేయ యాత్ర సాగిపోయింది.  ఏమాత్రం పోటీ, ఎదురన్నదే లేకుండా దూసుకుపోయి ప్రపంచకప్‌ లీగ్‌ దశను అజేయంగా ముగించిన భారత్‌ జట్టు అసలైన సమరానికి సిద్ధమైంది.

లీగ్‌ దశలో చూపించిన జోరును మరో రెండు మ్యాచ్‌లలో కొనసాగిస్తే చాలు... భారత్‌ మూడోసారి వరల్డ్‌ కప్‌ సగర్వంగా గెలిచి కోట్లాది అభిమానుల కోరిక నెరవేరడం ఖాయం. అయితే ఇప్పుడు గత 9 మ్యాచ్‌ల ఫలితాలతో సంబంధం లేదు. మళ్లీ కొత్తగా మొదలు పెట్టాల్సిందే. తీవ్ర ఒత్తిడి, ఒక్క క్షణం కూడా అలసత్వం ప్రదర్శించినా కోలుకునే అవకాశం ఉండని నాకౌట్‌ మ్యాచ్‌లో పూర్తి స్థాయిలో సత్తా చాటాల్సిందే.

ఎదురుగా ఉన్నది అణువణువూ పోరాటతత్వం నింపుకున్న న్యూజిలాండ్‌ జట్టు. ప్రత్యర్థి ఎవరైనా ఆఖరి బంతి వరకు పట్టు వీడని కివీస్‌తో పోరు అంత సులువు కాదు. నాలుగేళ్ల క్రితం సెమీఫైనల్లోనే కివీస్‌ కొట్టిన దెబ్బను సగటు భారత క్రికెట్‌ అభిమాని మరచిపోలేదు... ప్రత్యరి్థతో పోలిస్తే మన జట్టుదే అన్ని రకాలుగా పైచేయిగా కనిపిస్తున్నా కీలక సమయంలో పట్టుదలగా నిలవడమే ప్రధానం.

ఈ నేపథ్యంలో ప్రపంచకప్‌ తొలి సెమీఫైనల్‌కు రంగం సిద్ధమైంది. వరుసగా గత రెండు ప్రపంచకప్‌లలో సెమీఫైనల్‌కే పరిమితమైన భారత్‌ ఈసారి ఈ అడ్డంకి దాటి ఫైనల్‌ చేరుతుందా లేక గత రెండు టోరీ్నల్లో ఫైనల్లోనే ఓడిన న్యూజిలాండ్‌ మరోసారి తుది పోరుకు అర్హత సాధిస్తుందా అనేది ఆసక్తికరం.   

ముంబై: ప్రపంచకప్‌లో భారత్‌ గెలిచిన 9 మ్యాచ్‌లలో కాస్త ఇబ్బంది పడిన, తడబాటుకు గురైన మ్యాచ్‌ ఏదైనా ఉందంటే అది న్యూజిలాండ్‌తోనే. 274 పరుగుల లక్ష్యఛేదనలో చివరికి 4 వికెట్ల తేడాతో మ్యాచ్‌ గెలిచి టీమిండియా గట్టెక్కింది. ఇప్పుడు అదే న్యూజిలాండ్‌తోనే రోహిత్‌ బృందం సెమీఫైనల్లో అమీతుమీకి సై అంటోంది. వాంఖెడే మైదానంలో నేడు జరిగే తొలి సెమీస్‌ పోరులో కివీస్‌తో భారత్‌ తలపడుతుంది.

లీగ్‌ దశ ఆరంభంలో అద్భుతంగా ఆడి ఆ తర్వాత వెనుకబడినా చివర్లో రాణించి టాప్‌–4లో చోటు దక్కించుకున్న న్యూజిలాండ్‌ మరోసారి సెమీస్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. టీమిండియా ఫేవరెట్‌గా కనిపిస్తున్నా నాకౌట్‌ మ్యాచ్‌ కావడంతో అంచనాలకు భిన్నంగానూ సాగే అవకాశం ఉంది.  

మార్పుల్లేకుండా... 
వరల్డ్‌కప్‌లో తొలి నాలుగు మ్యాచ్‌ల తర్వాత ధర్మశాలలో న్యూజిలాండ్‌ జరిగిన ఐదో మ్యాచ్‌ కోసం టీమిండియా స్వల్ప మార్పులు చేసింది. ఆ తర్వాతి నుంచి ఎలాంటి మార్పు లేకుండా అదే తుది జట్టును కొనసాగిస్తోంది. జట్టు ఫామ్‌ను బట్టి చూస్తే ఇప్పుడూ అదే కొనసాగించడం ఖాయం. టీమ్‌ మొత్తం తమదైన రీతిలో సత్తా చాటి జట్టును నడిపిస్తున్నారు.

ఎలాంటి ఆందోళన లేకుండా ఏ విషయంలోనూ లోపాలు లేకుండా జట్టు గొప్పగా కనిపిస్తోంది. విరాట్‌ కోహ్లి టోర్నీలో టాప్‌ స్కోరర్‌గా (594 పరుగులు) కొనసాగుతుండగా, రోహిత్‌ శర్మ 503, శ్రేయస్‌ 421 పరుగులతో జట్టు బ్యాటింగ్‌ను నడిపిస్తున్నారు. గిల్, రాహుల్‌లకు కూడా విజయాల్లో ప్రధాన భాగస్వామ్యం ఉంది.

మిడిలార్డర్‌లో సూర్యకుమార్, జడేజాల బ్యాటింగ్‌ భారత్‌కు అదనపు బలంగా మారింది. ముగ్గురు పేసర్లు బుమ్రా, షమీ, సిరాజ్‌లను ఎదుర్కోవడం ప్రత్యర్థులకు దాదాపు అసాధ్యంగా మారగా... కుల్దీప్, జడేజా స్పిన్‌ను కూడా వారు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇలాంటి స్థితిలో భారత్‌ను నిలువరించాలంటే ఏ జట్టయినా అసాధారణ ఆటతీరు కనబర్చాల్సి ఉంటుంది.  

ఆల్‌రౌండ్‌ నైపుణ్యంతో... 
న్యూజిలాండ్‌ కూడా అంచనాలకు మించి రాణించి భారత్‌ను ఓడించాలని పట్టుదలగా ఉంది. ఆటగాళ్లంతా పూర్తి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నారు. ఓపెనర్లు కాన్వే, రచిన్‌ రవీంద్ర వరుసగా జట్టుకు శుభారంభాలు అందిస్తున్నారు. రచిన్‌ 565 పరుగులతో మూడో స్థానంలో ఉండగా, మిడిలార్డర్‌ బ్యాటర్‌ డరైల్‌ మిచెల్‌ కూడా 418 పరుగులు సాధించాడు. 359 పరుగులు చేసిన కాన్వే దూకుడుగా ఆడటంలో మేటి.

కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ తన బ్యాటింగ్‌తో ఇన్నింగ్స్‌ను సమర్థంగా నడిపించగలడు. టామ్‌ లాథమ్‌ కూడా చక్కటి బ్యాటర్‌ కాగా... మెరుపు బ్యాటింగ్‌ చేయగల ఫిలిప్స్, చాప్‌మన్‌ ఆ జట్టు మిడిలార్డర్‌లో ఉండటం అదనపు బలం. స్పిన్నర్‌ సాన్‌ట్నర్‌పై భారత్‌పై మంచి రికార్డు ఉండగా... కివీస్‌ కూడా తమ పేస్‌ బలాన్ని నమ్ముకుంటోంది. ముఖ్యంగా ఆరంభ ఓవర్లలో ట్రెంట్‌ బౌల్ట్‌ చెలరేగితే భారత్‌కు కష్టాలు తప్పవు. ఫెర్గూసన్‌ కూడా ఫామ్‌లో ఉండగా సౌతీ అనుభవం జట్టుకు ఉపయోగపడగలదు.  

4 నేడు న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌తో విరాట్‌ కోహ్లి అత్యధికంగా నాలుగుసార్లు (2011, 2015, 2019, 2023) వన్డే వరల్డ్‌కప్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌లు ఆడిన భారత ప్లేయర్‌గా గుర్తింపు పొందుతాడు. సచిన్‌ టెండూల్కర్‌ (1996, 2003, 2011), ధోని (2011, 2015, 2019) మూడుసార్లు చొప్పున వరల్డ్‌కప్‌ సెమీఫైనల్స్‌ ఆడారు.  

8 వన్డే ప్రపంచకప్‌ చరిత్రలో భారత జట్టుకిది ఎనిమిదో సెమీఫైనల్‌ కానుంది. మూడుసార్లు (1983లో ఇంగ్లండ్‌పై; 2003లో కెన్యాపై; 2011లో పాకిస్తాన్‌పై) సెమీఫైనల్స్‌లో నెగ్గిన భారత్‌.... నాలుగుసార్లు (1987లో ఇంగ్లండ్‌ చేతిలో; 1996లో శ్రీలంక చేతిలో; 2015లో ఆ్రస్టేలియా చేతిలో; 2019లో న్యూజిలాండ్‌ చేతిలో) సెమీఫైనల్లో ఓటమి పాలైంది. 

11 మూడు వరల్డ్‌కప్‌ సెమీఫైనల్స్‌లో  కలిపి కోహ్లి చేసిన పరుగులు. 2011 పాక్‌తో సెమీస్‌లో 9 పరుగులు... 2015 ఆ్రస్టేలియాతో సెమీస్‌లో 1 పరుగు... 2019 న్యూజిలాండ్‌తో సెమీస్‌లో 1 పరుగు చేశాడు. ఈ మూడు సెమీఫైనల్స్‌లో ఎడంచేతి వాటం పేస్‌ బౌలర్ల (వహాబ్‌ రియాజ్, మిచెల్‌ జాన్సన్, ట్రెంట్‌ బౌల్ట్‌) చేతిలోనే కోహ్లి అవుట్‌ కావడం గమనార్హం.   

9 వన్డే ప్రపంచకప్‌ చరిత్రలో న్యూజిలాండ్‌ జట్టుకిది తొమ్మిదో సెమీఫైనల్‌ కానుంది. రెండుసార్లు (2015లో దక్షిణాఫ్రికాపై, 2019లో భారత్‌పై) నెగ్గిన న్యూజిలాండ్‌... ఆరుసార్లు (1975లో వెస్టిండీస్‌ చేతిలో; 1979లో ఇంగ్లండ్‌ చేతిలో; 1992లో పాకిస్తాన్‌ చేతిలో; 1999లో పాకిస్తాన్‌ చేతిలో; 2007లో శ్రీలంక చేతిలో; 2011లో శ్రీలంక చేతిలో) పరాజయం పాలైంది. 

117 భారత్, న్యూజిలాండ్‌ జట్లు ఇప్పటి వరకు 117 వన్డేల్లో తలపడ్డాయి. 59 మ్యాచ్‌ల్లో భారత్‌... 50 మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్‌ గెలిచాయి. ఒక మ్యాచ్‌ ‘టై’ అయింది. 7 మ్యాచ్‌లు రద్దయ్యాయి. 

5 వాంఖెడే స్టేడియంలో భారత్‌ ఇప్పటి వరకు ఐదుసార్లు వన్డే వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లు ఆడింది. 3 మ్యాచ్‌ల్లో (1987లో జింబాబ్వేపై, 2011లో శ్రీలంకపై, 2023లో శ్రీలంకపై) నెగ్గి, 2 మ్యాచ్‌ల్లో (1987లో ఇంగ్లండ్‌ చేతిలో, 1996లో ఆ్రస్టేలియా చేతిలో) ఓటమి పాలైంది. 

9 వన్డే వరల్డ్‌కప్‌ చరిత్రలో భారత్, న్యూజిలాండ్‌ జట్లు 9 సార్లు ముఖాముఖిగా తలపడ్డాయి. 4 మ్యాచ్‌ల్లో భారత్‌... 5 మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్‌ విజయం సాధించాయి. 

వాంఖెడె స్టేడియంలో భారత్‌తో జరిగిన ఏకైక మ్యాచ్‌లో (2017లో) న్యూజిలాండ్‌ గెలిచింది.  

21 వాంఖెడే స్టేడియంలో భారత జట్టు ఇప్పటి వరకు 21 మ్యాచ్‌లు ఆడింది. 12 మ్యాచ్‌ల్లో గెలిచి, 9 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 

పిచ్, వాతావరణం 
ఈ వరల్డ్‌ కప్‌లో వాంఖెడే మైదానంలో పరుగుల వరద పారింది. ముఖ్యంగా తొలి ఇన్నింగ్స్‌లో అన్ని జట్లూ భారీ స్కోర్లు చేశాయి. రెండో అర్ధభాగం ఆరంభంలో పేస్‌ బౌలింగ్‌కు పిచ్‌ అనుకూలిస్తోంది. సెమీస్‌ ఒత్తిడిని కూడా దృష్టిలో ఉంచుకొని చూస్తే టాస్‌ గెలిచిన జట్టు బ్యాటింగ్‌ ఎంచుకోవడం ఖాయం. వర్ష సూచన లేదు. ఒకవేళ అవాంతరం ఎదురైనా సెమీస్‌కు రిజర్వ్‌ డే కూడా ఉంది.   

తుది జట్ల వివరాలు (అంచనా) 
భారత్‌: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), గిల్, కోహ్లి, అయ్యర్, కేఎల్‌ రాహుల్, సూర్యకుమార్, జడేజా, షమీ, కుల్దీప్, బుమ్రా, సిరాజ్‌.
న్యూజిలాండ్‌: విలియమ్సన్‌ (కెప్టెన్‌), కాన్వే, రచిన్‌ రవీంద్ర, మిచెల్, లాథమ్, ఫిలిప్స్, చాప్‌మన్, సాన్‌ట్నర్, సౌతీ, ఫెర్గూసన్, బౌల్ట్‌. 

మరిన్ని వార్తలు