నాడు తండ్రి... నేడు కొడుకు 

19 Jun, 2018 00:36 IST|Sakshi
పీటర్‌ ,కాస్పర్‌

తండ్రి వారసత్వాన్ని కుమారుడు అందిపుచ్చుకోవడం నేడు అన్ని రంగాల్లోనూ చూస్తున్నాం. ఫుట్‌బాల్‌ దీనికి మినహాయింపేమీ కాదు. అందులో డెన్మార్క్‌ గోల్‌ కీపర్‌ కాస్పర్‌ షెమిచెల్‌ది మాత్రం కాస్త ఘనమైన వారసత్వం. అదెలాగంటే, ఇతడి తండ్రి పీటర్‌ షెమిచెల్‌ 1998లో దేశం తరఫున ప్రపంచ కప్‌లో గోల్‌ కీపర్‌గా ప్రాతినిధ్యం వహించాడు. మేటి కీపర్‌గానూ పేరుగడించాడు. కాస్పర్‌ కూడా ఫుట్‌బాల్‌నే కెరీర్‌గా ఎంచుకున్నా చిత్రంగా ఏ ఇతర విభాగమో కాకుండా తండ్రిలా కీపింగ్‌ వైపే మొగ్గు చూపాడు.

సరిగ్గా 20 ఏళ్ల అనంతరం... ప్రస్తుత కప్‌లో గ్లోవ్స్‌తో బరిలో దిగాడు. వార ‘సత్తా’ను చాటుతూ పెరూపై డెన్మార్క్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో విశ్లేషకులు ఇద్దరినీ పోల్చడం మొదలుపెట్టారు. 31 ఏళ్ల కాస్పర్‌ ప్రపంచకప్‌లో ఆడటం ఇదే తొలిసారి. 1995లో పీటర్‌ అత్యధికంగా 470 నిమిషాలపాటు డెన్మార్క్‌పై గోల్‌ నమోదు కానీయకుండా నిలువరించగా... ప్రస్తుతం అతని కుమారుడు కాస్పర్‌ 471 నిమిషాలతో (2017 నుంచి ఇప్పటి వరకు) తండ్రి పేరిట ఉన్న రికార్డును తిరగరాశాడు.   

మరిన్ని వార్తలు