37 ఏళ్ల నిరీక్షణకు తెర.. తెలుగు తేజం సంచలనం

22 Oct, 2017 22:12 IST|Sakshi

ఒడెన్స్‌: 37 ఏళ్ల నిరీక్షణకు తెలుగు తేజం తెరదించాడు. ప్రతిష్టాత్మక డెన్మార్క్‌ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ను భారత నంబర్‌వన్‌ కిడాంబి శ్రీకాంత్‌ సాధించాడు. ఆదివారం రాత్రి జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో 21-10, 21-5 తేడాతో 37 ఏళ్ల లీ హున్‌ ఇల్‌ (దక్షిణ కొరియా)పై వరుస సెట్లలో గెలుపొందాడు.

డెన్మార్క్ సూపర్ సిరీస్‌ విజేతలో నిలవడంతో భాగంగా.. క్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్‌ విక్టర్‌ అక్సెల్‌సన్‌ను ఓడించిన ఈ తెలుగు తేజం సెమీస్‌లోనూ  వరుస గేముల్లో తన ప్రత్యర్థి వోంగ్‌ వింగ్‌ కీ విన్సెంట్‌ను చిత్తు చేసిన విజయం తెలిసిందే. టైటిల్‌ పోరులోనూ అదే పోరాట పటిమను ప్రదర్శించిన తెలుగు తేజం కిడాంబి శ్రీకాంత్ వరుస సెట్లలో దూకుడు ప్రదర్శిస్తూ ప్రత్యర్థి లీ హున్‌ ఇల్‌ కు పోరాడే అవకాశమూ ఇవ్వలేదు.

1980లో ప్రకాశ్‌ పదుకొనె తర్వాత ఈ మెగా టోర్నీలో పురుషుల సింగిల్స్‌ విభాగంలో భారత్‌ తరఫున ఫైనల్‌కు చేరిన రెండో క్రీడాకారుడిగా శ్రీకాంత్‌ గుర్తింపు పొందాడు. 1980లో ప్రకాశ్‌ పదుకొనె ఈ టోర్నీలో విజేతగా నిలవగా, 37 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ శ్రీకాంత్ ఈ సూపర్ సిరీస్‌ను సొంతం చేసుకున్నాడు. మహిళల సింగిల్స్‌ విభాగంలో భారత్‌ తరఫున సైనా నెహ్వాల్‌ (2012లో) టైటిల్‌ నెగ్గగా... పీవీ సింధు (2015లో) రన్నరప్‌గా నిలిచింది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు