కోల్‌కతా మెరుపు విజయం

8 Apr, 2019 03:17 IST|Sakshi

13.5 ఓవర్లలోనే 140 పరుగుల ఛేదన

సొంతగడ్డపై రాయల్స్‌ విలవిల

రాణించిన లిన్, నరైన్, గర్నీ 

జైపూర్‌: కోల్‌కతా కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ముం దుగా రాజస్తాన్‌ను కట్టేసింది. వికెట్లున్నా పరుగుల్ని నిరోధించింది. తర్వాత సులభ లక్ష్యాన్ని వేగంగా ఛేదించింది. మందకొడి పిచ్‌పై చక్కని విజయాన్ని సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో రాజస్తాన్‌ రాయల్స్‌పై విజయం సాధించింది. లీగ్‌లో నైట్‌రైడర్స్‌ నాలుగో విజయాన్ని నమోదు చేసింది. మొదట రాజస్తాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. స్మిత్‌ (59 బంతుల్లో 73; 7 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధసెంచరీ సాధించాడు.  ఐపీఎల్‌లో తొలిసారి బరిలోకి దిగిన ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ హ్యారీ గర్నీ 2 వికెట్లు తీశాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన కోల్‌కతా 13.5 ఓవర్లలో 2 వికెట్లకు 140 పరుగులు చేసి గెలిచింది. లిన్‌ (32 బంతుల్లో 50; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), నరైన్‌ (25 బంతుల్లో 47; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగారు.  

వికెట్లున్నా... పరుగులేవి? 
రాజస్తాన్‌ సొంతగడ్డపై ముందుగా టాస్‌తో ఓడింది. తర్వాత పిచ్‌తో ఓడింది. ఆఖరికి ప్రత్యర్థి చేతిలో ఓడింది. నిజమే..! ఎందుకంటే సొంతపిచ్‌పై చేతిలో గంపెడు వికెట్లున్నా... గుప్పెడు పరుగుల్ని ఎక్కువగా చేయలేకపోయింది. అసలు పరుగుపెట్టేందుకే ఆపసోపాలు పడింది. ఓపెనర్‌ రహానే (5) వికెట్‌ను రెండో ఓవర్లో కోల్పోయింది. తర్వాత రెండో ఓపెనర్‌ బట్లర్‌ (34 బంతుల్లో 37; 5 ఫోర్లు, 1 సిక్స్‌) 12వ ఓవర్లో ఔటయ్యాడు. అంటే రెండో వికెట్‌ భాగస్వామ్యం 10.4 ఓవర్లదాకా సాగింది.

అప్పటిదాకా ఒకే వికెట్‌ కోల్పోయినా...ఈ 12 ఓవర్లలో చేసిందెంతో తెలుసా... 77 పరుగులు. పిచ్‌ పరిస్థితుల నుంచి లబ్ది పొందిన కోల్‌కతా బౌలర్లు ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను నిలబెట్టే పరుగులకు అడ్డుకట్ట వేయడం ఈ మ్యాచ్‌లోని గొప్ప విశేషం. దీంతో రాయల్స్‌ 15వ ఓవర్లో 100 పరుగులు చేసింది. అనుభవజ్ఞుడైన ఆసీస్‌ స్టార్‌ స్మిత్‌ నిలబడటంతో ఆ మాత్రమైన స్కోరు వచ్చింది. అతను 44 బంతుల్లో అర్ధసెంచరీ చేసుకున్నాడు. త్రిపాఠి (6) ఔటయ్యాక వచ్చిన స్టోక్స్‌ హిట్టరే అయినా కిందా మీదా పడుతూ 14 బంతుల్లో 7 పరుగులే చేశాడు. ఒక్క బౌండరీ కొడితే ఒట్టు! 

చెలరేగిన ఓపెనర్లు 
ఏమంత కష్టసాధ్యం కాని లక్ష్యఛేదనకు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌ను ఓపెనర్లే సుమారు వంద పరుగులదాకా నడిపించారు. ఐపీఎల్‌తో గతంలోనే ఓపెనర్‌ అవతారమెత్తిన నరైన్, లిన్‌ ధాటిగా ఆడారు. గౌతమ్‌ వేసిన రెండో ఓవర్‌ను పూర్తిగా ఆడిన నరైన్‌ 4, 0, 6, 4, 4, 4లతో 22 పరుగులు చేశాడు. 2 ఓవర్లకే 32 పరుగులు చేసిన కోల్‌కతా 4.1 ఓవర్లలోనే 50 పరుగులను అధిగమించింది.

ఇద్దరు కలిసి ఇక సిక్సర్ల మోత మోగించడంతో జట్టు 8.1 ఓవర్లలోనే 90 పరుగులకు చేరింది. మరో పరుగు జతయ్యాక 91 స్కోరు వద్ద నరైన్‌ ఔటయ్యాడు. అయినాసరే 10వ ఓవర్‌ పూర్తికాక ముందే (9.3) జట్టు స్కోరు వందకు చేరింది. లిన్‌ 31 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అర్ధసెంచరీ చేశాడు. ఆ తర్వాత బంతికే అతనూ ఔటయినప్పటికీ రాబిన్‌ ఉతప్ప (16 బంతుల్లో 26 నాటౌట్‌; 1 ఫోర్, 2 సిక్స్‌లు), శుభ్‌మన్‌ గిల్‌ (6 నాటౌట్‌) మరో వికెట్‌ పడకుండా 13.5 ఓవర్లలోనే లక్ష్యానికి చేర్చారు. గోపాల్‌కు 2 వికెట్లు దక్కాయి. 

మరిన్ని వార్తలు