ఇది మ్యాచ్‌ ఫిక్సింగ్‌ బౌలింగా?

14 Dec, 2019 10:39 IST|Sakshi

ఒకేసారి బిగ్‌ నో బాల్‌.. బిగ్‌ వైడ్‌

టెస్టుల్లో కూడా వైడ్‌ ఇచ్చేంతగా..

ఢాకా:  బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌(బీపీఎల్‌) బుధవారం ఆరంభం కాగా ఓ బౌలింగ్‌ వేసిన తీరు నవ్వులు తెప్పించడమే కాదు.. అనేక అనుమానాలకు తావిచ్చింది. వెస్టిండీస్‌కు చెందిన  34 ఏళ్ల ఎడమ చేతి మీడియం పేసర్‌ క్రిష్‌మర్‌ సంతోకి బీపీఎల్‌లో సిలెట్‌ థండర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. చట్టాగ్రామ్‌ చాలెంజర్స్‌తో జరిగిన ప్రారంభపు మ్యాచ్‌లో సంతోకి వేసిన బంతులు క్రికెట్‌ ప్రపంచాన్ని నివ్వెరపరిచాయి. కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్‌కు అతడు ఓవర్‌ ద వికెట్‌ బౌలింగ్‌ చేస్తూ.. లెగ్‌సైడ్‌కు అత్యంత దూరంగా ఫుల్‌టాస్‌ వేయడం గమనార్హం. ఆ బంతి వికెట్‌కు ఎంత దూరంగా వెళ్లిదంటే టెస్ట్‌ల్లోనూ ఆ బంతిని నిస్సందేహంగా వైడ్‌గా ప్రకటించేంతగా. ఆ బంతిని అందుకొనేందుకు కీపర్‌ ఎడమవైపుకు బాగా డైవ్‌ కొట్టి మరీ ఆపాడు.

ఇక.. క్రిష్‌మర్‌ వేసిన నోబ్‌ను చూసి‘ ‘క్రికెట్‌లో ఇలాంటి నోబాల్‌ కూడా వేస్తారా?’ అనిపించింది. అతడి కుడికాలు క్రీజ్‌కు చాలా దూరంగా పడింది. దాంతో సంతోకి బౌలింగ్‌పై నెటిజన్లు అనుమానాలు వ్యక్తంజేశారు. సంతోకి అనుమానాస్పద బౌలింగ్‌పై విచారణ చేయాలని బంగ్లా క్రికెట్‌ బోర్డును కోరామని  సిలెట్‌ థండర్‌ డైరెక్టర్‌ తంజిల్‌ చౌధురి పేర్కొన్నారు. ‘ నో బాల్‌-వైడ్‌పై విచారణకు ఆదేశించాం. ఓవరాల్‌గా మాకు బరిలోకి దిగే ఎలెవన్‌ జట్టుపై మా జోక్యం ఉండదు. అది మేనేజ్‌మెంట్‌, కోచ్‌ పని. దీనిపై స్పాన్సర్ల ప్రమేయం ఏమైనా ఉందని అడిగా. కానీ వారు చెప్పలేదు. ఇక ఇప్పుడు టీమ్‌ మేనేజ్‌మెంట్‌తో మాట్లాడాలి. సంతోకి ఇలా బౌలింగ్‌ చేసి స్పాట్‌ ఫిక్సింగ్‌కు పాల్పడ్డడా అనే అనుమానం కూడా ఉంది. సంతోకి ఇలా చేయడానికి ఎవరి ప్రమేయం ఉందా అనే విషయంపై దర్యాప్తు చేస్తాం’ అని తంజిల్‌ తెలిపారు. ఈ మ్యాచ్‌లో సంతోకి 4 ఓవర్లు బౌలింగ్‌ వేసి 34 పరుగులు ఇచ్చాడు. ఒక వికెట్‌ కూడా తీశాడు. ఈ మ్యాచ్‌లో సిలెట్‌ థండర్‌ ఐదు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. సిలెట్‌ థండర్‌  నిర్దేశించిన 162 పరుగుల టార్గెట్‌ను  చట్టాగ్రామ్‌ చాలెంజర్స్ 19 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ టీ20 మ్యాచ్‌లో సంతోకి ఒక నోబాల్‌తో పాటు 4 వైడ్లు వేశాడు. దాంతోనే అతని బౌలింగ్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మరిన్ని వార్తలు