బుమ్రా కూడా అలాంటి వాడే : మలింగ

5 Jul, 2019 08:45 IST|Sakshi

ప్రపంచకప్‌లో స్లో బ్యాటింగ్‌ కారణంగా మిస్టర్‌ కూల్‌ ధోనిపై విమర్శల వర్షం కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మెగాటోర్నీ తర్వాత ధోనీ ఆటకు స్వస్తి చెబుతాడనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీలంక స్టార్‌ బౌలర్‌ లసిత్‌ మలింగ ధోనికి అండగా నిలిచాడు. ప్రపంచ క్రికెట్‌లో ఇప్పటికీ తనే బెస్ట్‌ ఫినిషర్‌ అని కితాబిచ్చాడు. ధోని మరో రెండేళ్ల పాటు క్రికెట్‌లో కొనసాగాలని ఈ ఫాస్ట్‌ బౌలర్‌ ఆకాంక్షించాడు. ధోని స్థానాన్ని భర్తీ చేసే ఆటగాళ్లు వచ్చే అవకాశమైతే లేదు గానీ.. యువ ఆటగాళ్లు అతడి ఆట నుంచి చాలా నేర్చుకోవాల్సి ఉందని అభిప్రాయపడ్డాడు.

చదవండి : ఈ ఫొటో చూశాకైనా ధోనీ అంటే ఏంటో అర్థమైందా?!

ఇక ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో తన సహచర ఆటగాడు, ముంబై ఇండియన్స్‌ యార్కర్ల కింగ్‌ జస్ప్రీత్‌ బుమ్రాపై కూడా మలింగ ప్రశంసలు కురిపించాడు. ఆత్మవిశ్వాసం ఉండటమే బుమ్రా ప్రధాన బలమని.. ఈ కారణంగానే ఒత్తిడి లేకుండా ఆడగలుగుతున్నాడని పేర్కొన్నాడు. ‘ నైపుణ్యం ఉన్న ఆటగాడు ఒత్తిడికి గురవ్వాల్సిన అవసరం లేదు. నైపుణ్యానికి... ఏ ప్రాంతంలో బంతులు విసరాలనే కచ్చితత్వం తోడైతే ప్రతీ బౌలర్‌ విజయవంతమవుతాడు. బుమ్రా కూడా అలాంటి వాడే. యార్కర్లు ఎవరైనా సంధించగలరు. కానీ దానిని అమలు చేసే విధానంలో తేడా ఉంటుంది. అలాంటి నైపుణ్యం కలిగిన ఆటగాడు బుమ్రా. 2013లో తనను చూసినపుడు నేర్చుకోవాలనే కసి కనిపించింది. ఫలితంగా ఇప్పుడు ఓ స్టార్‌ బౌలర్‌గా ఎదిగాడు’ అని బుమ్రాపై ప్రశంసల జల్లు కురిపించాడు.

చదవండి : కోహ్లి సేనకు ఇంగ్లండ్‌ గండం తప్పాలంటే...

టీమిం‍డియాకే అర్హత!
ప్రపంచకప్‌ ట్రోఫీ సాధించేందుకు టీమిండియాకు అన్ని అర్హతలు ఉన్నాయని మలింగ అభిప్రాయపడ్డాడు. రోహిత్‌ శర్మ, కోహ్లి వంటి ఆటగాళ్లతో నిండి ఉన్న ప్రస్తుత జట్టు.. నాడు ధోని సారథ్యంలోని 2011 నాటి ఫలితాన్ని పునరావృతం చేస్తుందని జోస్యం చెప్పాడు. మెగాటోర్నీ అనంతరం బోర్డుతో మాట్లాడి.. 2020 టీ20 వరల్డ్‌ కప్‌నకు సన్నద్ధమయ్యే పనిలో ఉన్నానని తన భవిష్యత్‌ ప్రణాళికలను మలింగ వెల్లడించాడు.

మరిన్ని వార్తలు