రోడ్డైనా.. క్రీజైనా.. లైన్‌ దాటితే అంతే!

27 Mar, 2019 12:46 IST|Sakshi
కోల్‌కతా పోలీసులు ట్వీట్‌ చేసిన ఫొటో

కోల్‌కతా : వారెవ్వా ఏం క్రియేటివిటీ భయ్యా! అంటూ కోల్‌కతా పోలీసులపై సోషల్‌ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది. అవును వారి క్రియేటివిటీ చూస్తే మీరు కూడా ఔరా అనాల్సిందే. ఇంతకీ ఆ క్రియేటివిటీ ఏంటంటే.. ఐపీఎల్‌లో తాజాగా చోటుచేసుకున్న మన్కడింగ్‌ వివాదం కింగ్స్‌ పంజాబ్‌ కెప్టెన్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌కు ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. ఆ వివాదాన్నే ఉపయోగిస్తూ కోల్‌కతా పోలీసులు ట్రాఫిక్‌ రూల్స్‌పై అవగాహన కల్పించడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో బంతి వేయకుండానే నాన్‌స్ట్రైకర్‌గా ఉన్న జోస్‌ బట్లర్‌ క్రీజు దాటడంతో అశ్విన్‌ బంతిని వికెట్లకు కొట్టి మన్కడ్‌ విధానంలో రనౌట్‌గా పెవిలియన్‌ చేర్చాడు. దీంతో రాజస్తాన్‌ రాయల్స్‌ భారీ మూల్యం చెల్లించుకుంది.

గెలవాల్సిన మ్యాచ్‌లో పరాజయం పాలైంది. ఇదే పాయింట్‌ పట్టుకున్న కోల్‌కతా పోలీసులు.. ట్రాఫిక్‌ సిగ్నల్‌ లైన్‌ దాటిన ఓ వాహనం ఫొటోను.. దాని పక్కనే క్రీజు దాటిన జోస్‌ బట్లర్‌ ఫొటోను పెట్టి ట్వీట్‌ చేశారు. దీనికి క్యాప్షన్‌గా.. ‘క్రీజ్‌ అయినా.. రోడ్డు అయినా.. లైన్‌ దాటితే తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే’ నని పేర్కొంది. వినూత్నంగా ఉన్న ఈ ట్వీట్‌ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. గతంలో జైపూర్‌ పోలీసులు కూడా చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో బుమ్రా వేసిన నోబాల్‌ దృశ్యాన్ని ఇదే తరహా ప్రచారానికి వాడారు. అయితే అప్పట్లో దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. బుమ్రా కూడా ఈఘటనపై సీరియస్‌గానే స్పందించాడు.

చదవండి: ‘మన్కడింగ్‌’ రేపిన దుమారం 

మరిన్ని వార్తలు