విజయ్‌ శంకర్‌ ఆట ముగిసింది

2 Jul, 2019 05:33 IST|Sakshi
విజయ్‌ శంకర్‌, మయాంక్‌ అగర్వాల్‌

గాయంతో ప్రపంచ కప్‌ నుంచి ఔట్‌

మయాంక్‌ అగర్వాల్‌కు చోటు

బర్మింగ్‌హామ్‌: ప్రపంచ కప్‌ కీలక దశలో మరో భారత ఆటగాడు టోర్నీకి దూరమయ్యాడు. ఎడమ కాలు బొటన వేలి గాయం కారణంగా ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌ వరల్డ్‌ కప్‌ నుంచి తప్పుకున్నాడు. అతని స్థానంలో టెస్టు ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ను సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేసింది. శిఖర్‌ ధావన్‌ తర్వాత గాయం కారణంగా మెగా టోర్నీ నుంచి తప్పుకున్న రెండో ఆటగాడు విజయ్‌ శంకర్‌. జూన్‌ 19న నెట్‌ ప్రాక్టీస్‌లో బుమ్రా వేసిన యార్కర్‌తో విజయ్‌ కాలి బొటనవేలికి గాయమైంది.

అయితే ఆ తర్వాత పెద్దగా ఇబ్బంది అనిపించకపోవడంతో భారత్‌ ఆడిన తర్వాత రెండు మ్యాచ్‌లలో (అఫ్గానిస్తాన్, వెస్టిండీస్‌లతో) అతను బరిలోకి దిగాడు. ఆ తర్వాత అదే గాయం తిరగబెట్టింది. ఫలితంగా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు దూరమయ్యాడు. ‘సీటీ స్కాన్‌ అనంతరం విజయ్‌ శంకర్‌ బొటన వేలికి ఫ్రాక్చర్‌ అయినట్లుగా తేలింది. దీని నుంచి కోలుకునేందుకు కనీసం మూడు వారాల సమయం పడుతుంది. దాంతో అతను వరల్డ్‌ కప్‌ నుంచి తప్పుకుంటున్నాడు’ అని బీసీసీఐ ప్రకటించింది.  

ఆది నుంచి విమర్శలే..: 2019 జనవరిలోనే వన్డేల్లో అరంగేట్రం చేసిన విజయ్‌ శంకర్‌ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ పర్యటనల్లో అద్భుతంగా ఆడకపోయినా... సెలక్టర్లను ఆకట్టుకునేందుకు రెండు ఇన్నింగ్స్‌లు (45, 46) సరిపోయాయి. మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌గా అంబటి రాయుడును కాదని 9 వన్డేల అనుభవం ఉన్న అతడిని సెలక్టర్లు ప్రపంచ కప్‌కు ఎంపిక చేశారు. పైగా ‘మంచి బ్యాట్స్‌మన్, చక్కటి బౌలర్‌ కావడంతో పాటు అద్భుతమైన ఫీల్డర్‌ కాబట్టి మూడు రకాలుగా ఉపయోగపడతాడు’ అని చైర్మన్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ ప్రశంసాపూర్వక మాటలు కూడా చెప్పాడు.

అయితే ఈ ప్రపంచ కప్‌లో అతని ప్రభావం అంతగా ఏమీ కనిపించలేదు. ఆడిన 3 మ్యాచ్‌లలో 15 నాటౌట్, 29, 14 పరుగులు చేసిన అతను ఒకే మ్యాచ్‌లో బౌలింగ్‌ చేసి 2 వికెట్లు తీశాడు. పాక్‌తో మ్యాచ్‌లో తాను వేసిన తొలి బంతికే వికెట్‌ తీయడం మాత్రం అందరికీ గుర్తుండిపోయే క్షణం. విండీస్‌తో మ్యాచ్‌ తర్వాత విజయ్‌ శంకర్‌ పనికి రాడని, అతడిని తప్పించాలని అభిమానులు, విశ్లేషకుల నుంచి చాలా విమర్శలు వచ్చాయి. ఇప్పుడు గాయంతో అతను మొత్తం టోర్నీకే దూరమయ్యాడు.  

మరిన్ని వార్తలు