ఇలాంటి జర్నలిజం అవసరమా: కైఫ్‌

31 Jul, 2018 13:21 IST|Sakshi
మహ్మద్‌ కైఫ్‌ (ఫైల్‌ ఫొటో)

హైదరాబాద్‌ : ఇటీవల రిటైర్మెంట్‌ ప్రకటించిన టీమిండియా క్రికెటర్‌ మహ్మద్‌ కైఫ్‌ ప్రముఖ ఆంగ్ల వెబ్‌ సైట్‌ ‘ది వైర్‌’  పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇలాంటి జర్నలిజం అక్కర్లేదని చురకలింటించాడు. డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌లా సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే కైఫ్‌.. ప్రతి విషయంపై సోషల్‌ మీడియా వేదికగా స్పందిస్తుంటాడు. అయితే ‘ది వైర్‌’  భారత క్రికెట్‌కు సంబంధించిన ఓ కథనాన్ని ప్రచురించింది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ షెడ్యూల్‌ కులాల ఆటగాళ్లకు దక్కిన ప్రాధాన్యత గురించి ప్రస్తావించింది. అయితే ఈ కథనంపై కైఫ్‌ ట్విటర్‌ వేదికగా మండిపడ్డాడు. ‘ మీ సంస్థల్లో ఎంత మంది ప్రైమ్‌ టైమ్‌ జర్నలిస్టులు ఎస్సీ, ఎస్టీలున్నారు? సీనియర్‌ ఎడిటర్లు ఎందరున్నారు? కులాల అడ్డుంకులను దాటింది ఒక క్రీడల్లోనే, ఆటగాళ్లు ఎలాంటి విభేదాలు లేకుండా ఆడుతారు. అలాంటప్పుడు ఇలాంటి విద్వేషాలు వ్యాపింప జేసే జర్నలిజం అవసరమా.’ అని ట్వీట్‌ చేశాడు. 

ఇంతకీ ది వైర్‌ కథనం ఏమిటంటే.. ‘భారత్‌కు టెస్ట్ క్రికెట్ హోదా వచ్చి 86 సంవత్సరాలు అవుతోంది, ఇన్నేళ్లలో ఆడిన 290 మంది క్రికెటర్లలో కేవలం నలుగురు మాత్రం ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన వాళ్లు భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించారు. జనాభ ప్రకారం 70 మందికి దక్కాల్సిన అవకాశం కేవలం నలుగురికే దక్కింది. ఇది కేవలం అసమానత్వమే.. దీన్ని తేలికగా తీసుకోలేము’’  అని ఆ ఆర్టికల్‌లో రాసుకొచ్చింది. ఈ ఆర్టీకల్‌పై కైఫే కాకుండా నెటిజన్లు మండిపడుతున్నారు. క్రికెట్‌లోకి కులాన్ని తీసుకొచ్చి విబేధాలు సృష్టించవద్దని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశం సోషల్‌ మీడియాలో చర్చనీయాంశమైంది.

చదవండి: క్రికెట్‌కు కైఫ్‌ వీడ్కోలు  

మరిన్ని వార్తలు