ధోని–జాదవ్‌ ఇంత చెత్తగానా?

1 Jul, 2019 09:01 IST|Sakshi
జాదవ్‌ ధోని

బర్మింగ్‌హామ్‌: 7 డాట్‌ బాల్స్, 20 సింగిల్స్, 3 ఫోర్లు, 1 సిక్స్‌...! 31 బంతుల్లో 71 పరుగులు చేయాల్సిన దశలో ధోని–జాదవ్‌ భాగస్వామ్యం సాగిన తీరిది. కాస్త కష్టపడితే అందుకోదగ్గ లక్ష్యం కళ్లెదుట ఉండగా సీనియర్లిద్దరూ మన వల్ల కాదులే అన్నట్లు ఆడారు. విరుచుకుపడటం మాట దేవుడెరుగు? ప్రత్యర్థి పేసర్ల బౌలింగ్‌లో చాలాసార్లు బంతిని బ్యాట్‌కు కనీసం తాకించలేక పోయారు. మధ్య ఓవర్ల తరహాలో సింగిల్స్‌ తీస్తూ ఆగ్రహం తెప్పించారు.

ధోని-జాదవ్‌ స్లో బ్యాటింగ్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. భారీ లక్ష్యాన్ని చూసి భారత ఆటగాళ్లు చేతులెత్తేశారని, ఎంతసేపు సింగిల్స్‌పైనే దృష్టిపెట్టారని, గెలవాలనే తపనతో ఆడలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చేతిలో ఐదు వికెట్ల ఉండి కూడా భారీ షాట్లకు ప్రయత్నించకపోవడం ఆశ్యర్యానికి గురిచేసిందని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌, కామెంటేటర్‌ నాసర్‌ హుస్సెన్‌ అయితే ధోని-జాదవ్‌ల బ్యాటింగ్‌ తీరుపై అసహనం వ్యక్తం చేశాడు. ఈ తరహా బ్యాటింగ్‌ టీమిండియాకు అవసరం లేదన్నాడు. వీరి ఆటకు వెగటుపుట్టి అభిమానులు మైదానం వీడుతున్నారని వ్యాఖ్యానించాడు. టీమిండియా మాజీ కెప్టెన్‌ గంగూలీ సైతం నెమ్మదైన బ్యాటింగ్‌ను తప్పుబట్టాడు. తొలి 10 ఓవర్లు, చివరి 6 ఓవర్లలో భారత్‌ పరుగులు చేయలేకపోయిందన్నాడు. ఇక ధోని (31 బంతుల్లో 42 నాటౌట్‌; 4 ఫోర్లు, సిక్స్‌), కేదార్‌ జాదవ్‌ (13 బంతుల్లో 12 నాటౌట్‌)లు చివరి 31 బంతుల్లో 39 పరుగులే చేసి తీవ్రంగా నిరాశపర్చారు. దీంతో భారత్‌ 31 పరుగుల తేడాతో మెగాటోర్నీలో తొలి ఓటమి రుచి చూసింది. 

మరిన్ని వార్తలు