లంక నిలవగలదా?

1 Jun, 2019 05:45 IST|Sakshi

నేడు న్యూజిలాండ్‌తో మ్యాచ్‌

మధ్యాహ్నం గం.3 నుంచి

స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం

కార్డిఫ్‌: ప్రపంచ కప్‌లో మంచి రికార్డున్న న్యూజిలాండ్‌ (ఆరు సార్లు సెమీస్, ఒకసారి ఫైనల్‌), శ్రీలంక (ఒకసారి విజేత, రెండుసార్లు రన్నరప్, ఒకసారి సెమీస్‌) మధ్య మ్యాచ్‌ అంటే అభిమానులకు సహజంగానే ఆసక్తి ఏర్పడాలి. కానీ, ప్రస్తుత పరిస్థితి అలా లేదు. గత కప్‌ అనంతరం రిటైరైన కెప్టెన్‌ బ్రెండన్‌ మెకల్లమ్‌ తప్ప ప్రధాన ఆటగాళ్లంతా ఈసారీ కివీస్‌కు అందుబాటులో ఉంటే, ఈ వ్యవధిలో లంక జట్టులోకి అనేక మంది వచ్చి వెళ్లారు. కెప్టెన్‌ దిముత్‌ కరుణరత్నె, నిన్నమొన్నటి వరకు వన్డే సారథిగా వ్యవహరించిన ప్రధాన పేసర్‌ లసిత్‌ మలింగ కూడా ఈ జాబితాలో ఉన్నారంటే జట్టు ఎలాంటి స్థితిలో ఉందో తెలుస్తోంది.
 
ప్రస్తుత కప్‌లో చాలా జట్లకు టాపార్డర్‌ బ్యాటింగే బలం. కివీస్‌కు మాత్రం అలా కాదు. కారణం... రాస్‌ టేలర్‌. స్పిన్‌ను పేస్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ రెండేళ్లుగా 60 సగటుతో పరుగులు చేస్తున్నాడు. ఓపెనర్‌ గప్టిల్‌ పెద్దగా రాణించకున్నా, నిలకడగా ఆడే కెప్టెన్‌ విలియమ్సన్‌ తోడుగా ఇన్నింగ్స్‌లను నిర్మిస్తున్నాడు. లాథమ్, నికోల్స్, నీషమ్, గ్రాండ్‌హోమ్‌ చెలరేగితే బౌలర్లకు చుక్కలే.   మరోవైపు ఒక్కరూ ఫామ్‌లో ఉన్నారని కచ్చితంగా చెప్పలేని స్థితి శ్రీలంకది. రెండేళ్లలో 55 వన్డేలాడి 41 మ్యాచ్‌ల్లో పరాజయం పాలైందీ జట్టు.  

ముఖాముఖి రికార్డు
లంక, కివీస్‌ ఇప్పటివరకు 98 వన్డేల్లో తలపడ్డాయి. వీటిలో లంక 41 గెలిచి, 48 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఒక మ్యాచ్‌ ‘టై’ కాగా, ఎనిమిదింట్లో ఫలితం తేలలేదు. ప్రపంచ కప్‌లో న్యూజిలాండ్‌పై ఆరుసార్లు నెగ్గిన శ్రీలంక నాలుగుసార్లు పరాజయం పాలైంది.

ఆస్ట్రేలియా X అఫ్గానిస్తాన్‌
సాయంత్రం 6 గంటల నుంచి
స్టార్‌ స్పోర్ట్స్‌–3లో ప్రత్యక్ష ప్రసారం


అంతర్జాతీయస్థాయిలో ఇప్పటివరకు ఆస్ట్రేలియా, అఫ్గానిస్తాన్‌ జట్లు రెండు సార్లు తలపడగా... రెండు సార్లూ ఆసీసే గెలిచింది.

మరిన్ని వార్తలు