ఇంతగా ఎప్పుడూ బాధపడలేదు

18 Dec, 2017 03:25 IST|Sakshi

గత ఏడాది రియో ఒలింపిక్స్‌ ఫైనల్లో పరాజయం... ఈ ఏడాది ఆగస్టులో వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ ఫైనల్లో ఓటమి... ఇప్పుడు తాజాగా సూపర్‌ సిరీస్‌ ఫైనల్స్‌ టోర్నీ తుది పోరులో అదే ఫలితం.... పీవీ సింధు మరో ప్రతిష్టాత్మక టోర్నీ ఫైనల్లో విక్టరీకి ‘ఫినిషింగ్‌ టచ్‌’ ఇవ్వలేకపోయింది. ఫైనల్లో పరాజయం అనంతరం ఆమె ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఓటమికంటే ఓడిన తీరు తనను ఎక్కువగా బాధ పెట్టిందని తెలిపింది. ఇంకా ఆమె ఏం చెప్పిందంటే...  

ఫైనల్‌ పరాజయంపై...
చాలా బాధగా ఉంది (ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ)... వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ ఫైనల్లో కూడా ఇలాగే జరిగింది. మ్యాచ్‌ ముగిశాక చాలా సేపు వరకు కూడా కోలుకోలేదు. నా బాధను దాచుకోలేక ఒంటరిగా వెళ్లి ఏడ్చేశాను. చాలా కష్టపడి చాలా బాగా ఆడిన మ్యాచ్‌ ఇది. అసలు ఎలా ఓడానో అర్ధం కావడం లేదు. 19–19 వద్ద ఉన్నప్పుడు కూడా పరాజయం గురించి భయపడలేదు. నా వైపు నుంచి ఎలాంటి అనవసర తప్పిదాలు చేయలేదు.  

ఆఖరి రెండు పాయింట్లపై...
నిజానికి ఆ రెండు కూడా నేను ర్యాలీలుగానే ఆడాలని భావించాను. దురదృష్టవశాత్తూ షటిల్స్‌ నెట్‌ను దాటలేకపోయాయి. వాటిలో ఒక్క పాయింట్‌ వచ్చినా ఫలితం భిన్నంగా ఉండేదేమో. మ్యాచ్‌ నాణ్యత గురించి చెప్పాలంటే అంతా గొప్పగా సాగింది. ఇంకా సరిగ్గా చెప్పాలంటే లీగ్‌ మ్యాచ్‌లో నేను ఓడించిన యామగుచి వేరు. ఫైనల్లో ఆడిన యామగుచి వేరు.  

ఫిట్‌నెస్‌పరంగా సమస్యలు...
ఇంత సుదీర్ఘమైన మ్యాచ్‌లో అలసిపోవడం, మధ్యలో ఆటగాళ్లు ఇబ్బంది పడటం సహజం. ఆమెకు కూడా అలాగే అయింది. ఇటీవల చాలా మంది ర్యాలీలు ఎక్కువగా ఆడుతున్నారు. దానికి నేను కూడా సిద్ధమయ్యే వచ్చాను. అయితే డిఫెన్స్‌ కూడా బలంగా ఉండటం ముఖ్యం. ఆటపరంగా గెలిచేందుకు నేను ఏం చేయగలనో అంతా చేశాను కానీ చివర్లో అంతా చేజారింది.  

కీలక ఫైనల్‌ మ్యాచ్‌లలో ఓటములపై...
నాకు కూడా ఫైనల్‌ ముగిశాక ఒకుహారా మ్యాచే గుర్తుకొచ్చింది. ఆటలో గెలుపోటములు సహజం కానీ కొన్ని విషయాల్లో నేను మరింత మెరుగు పడాల్సి ఉంది.  2017 సంవత్సరం చాలా బాగా సాగింది. నా కెరీర్‌లో ఒకే ఏడాది ఎక్కువ మ్యాచ్‌లు గెలిచిన సంవత్సరం ఇది. ఫైనల్స్‌లో గెలిస్తే ఇంకా బాగుండేది కానీ రన్నరప్‌ కూడా మంచి ఫలితమే. వచ్చే ఏడాది కొత్తగా మళ్లీ మొదలు పెడతాను. వరల్డ్‌ నంబర్‌వన్‌ కూడా సాధించే అవకాశం ఉంటుంది కదా.

‘చాలా హోరాహోరీగా మ్యాచ్‌ జరిగింది. ఇద్దరూ బాగా ఆడారు. ఇద్దరూ గెలిచేలా కనిపించారు. అయితే యామగుచి కీలక సమయంలో ఒత్తిడిని అధిగమించింది. చివర్లో సింధు కొంత అలసిపోవడంతో కొన్ని సార్లు అనుకున్న రీతిలో సరైన షాట్‌లతో స్పందించలేదు. కాస్త జలుబుతో కూడా బాధపడుతుండటంతో పదే పదే విరామం తీసుకోవాల్సి వచ్చింది. అయితే ఆటపరంగా నేను సంతృప్తి చెందాను. గత మ్యాచ్‌లలో ప్రదర్శనను బట్టి సింధు గర్వపడవచ్చు. ఈ ఓటమితో ఆమె బాధ పడటం సహజం. 2017లో ఆమె వరుసగా పెద్ద సంఖ్యలో టోర్నీలు ఆడింది. ఎక్కువగా విశ్రాంతి తీసుకోకుండానే గెలిచింది. సుదీర్ఘ ర్యాలీలు సహజంగా మారుతున్నాయి కాబట్టి సమస్య లేదు. ఇక్కడ కొంత అలసట కనిపించినా... నా దృష్టిలో ఫిట్‌నెస్‌పరంగా బ్యాడ్మింటన్‌ సర్క్యూట్‌లో ఆమె అత్యుత్తమ క్రీడాకారిణులలో ఉంటుంది. కాబట్టి నాకు ఆమె ఫిట్‌నెస్‌ గురించి ఎలాంటి ఆందోళన లేదు. ఆమె తన తప్పులు సరిదిద్దుకొని మున్ముందు మరిన్ని విజయాలు సాధిస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నాను.  
– ‘సాక్షి’తో పుల్లెల గోపీచంద్, భారత కోచ్‌

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా