నాదల్‌ను ఆపతరమా...

27 May, 2018 01:31 IST|Sakshi
నాదల్, జొకోవిచ్‌

మరోసారి ఫేవరెట్‌గా   స్పెయిన్‌ స్టార్‌

జొకోవిచ్, జ్వెరెవ్‌ నుంచి పోటీ

సెరెనా పునరాగమనంపై ఆసక్తి

నేటి నుంచి ఫ్రెంచ్‌ ఓపెన్‌ టోర్నీ

పారిస్‌: అనుకోకుండా గాయపడటమో లేదా ఫిట్‌నెస్‌ సమస్యలు ఎదురైతే తప్పించి ఈసారీ మట్టికోటపై రాఫెల్‌ నాదల్‌ విజయబావుటా ఎగురవేయడం ఖాయమనిపిస్తోంది. ఇప్పటికే రికార్డుస్థాయిలో పదిసార్లు ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ను సొంతం చేసుకున్న ఈ స్పెయిన్‌ స్టార్‌ గతేడాది ఫలితాన్ని పునరావృతం చేయాలనే పట్టుదలతో ఉన్నాడు. క్లే కోర్టు సీజన్‌లో మూడు టైటిల్స్‌ (రోమ్, బార్సిలోనా, మోంటెకార్లో) నెగ్గిన నాదల్‌ తన స్థాయికి తగ్గట్టు ఆడితే 11వసారి ఫ్రెంచ్‌ ఓపెన్‌ను దక్కించుకోవడం కష్టమేమీ కాదు. తొలి రౌండ్‌లో అతడితో తలపడాల్సిన డల్గొపలోవ్‌ (ఉక్రెయిన్‌) గాయం కారణంగా చివరి నిమిషంలో వైదొలిగాడు. దాంతో ‘లక్కీ లూజర్‌’ సిమోన్‌ బొలెలీ (ఇటలీ)తో నాదల్‌ ఆడతాడు. బొలెలీతో ముఖా ముఖి రికార్డులో నాదల్‌ 5–0తో ఆధిక్యంలో ఉన్నాడు. ఇటీవలే మాడ్రిడ్‌ ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో డొమినిక్‌ థీమ్‌ (ఆస్ట్రియా) చేతిలో నాదల్‌ ఓడిపోయినప్పటికీ... అనంతరం పుంజుకొని రోమ్‌ ఓపెన్‌లో విజేతగా నిలిచాడు. మాజీ చాంపియన్స్‌ వావ్రింకా (స్విట్జర్లాండ్‌), జొకోవిచ్‌ (సెర్బియా)... మాడ్రిడ్‌ ఓపెన్‌ విజేత, రెండో సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ), డొమినిక్‌ థీమ్, దిమిత్రోవ్‌ (బల్గేరియా) తదితరులు ఒకే పార్శ్వంలో ఉండటంతో నాదల్‌ పని మరింత సులువు కానుంది.  

మరోవైపు మహిళల సింగిల్స్‌ విభాగంలో కచ్చితమైన ఫేవరెట్‌ ఎవరూ కనిపించడంలేదు. అయితే డిఫెండింగ్‌ చాంపియన్‌ ఒస్టాపెంకో (లాత్వియా), టాప్‌ సీడ్‌ హలెప్‌ (రొమేనియా), మాజీ విజేతలు షరపోవా (రష్యా), సెరెనా విలియమ్స్‌ (అమెరికా) ఆటతీరుపై అందరిలో ఆసక్తి నెలకొంది. గతేడాది పాపకు జన్మనిచ్చాక సెరెనా ఆడుతోన్న తొలి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఇదే. ఆదివారం జరిగే తొలి రౌండ్‌లో కొజ్లోవా (ఉక్రెయిన్‌)తో ఒస్టాపెంకో ఆడుతుంది. నాదల్, జొకోవిచ్, షరపోవా, సెరెనా సోమవారం తమ తొలి రౌండ్‌ మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంది.   

- మధ్యాహ్నం గం. 2.30 నుంచి  స్టార్‌ స్పోర్ట్స్‌ సెలెక్ట్‌–1లో ప్రత్యక్ష ప్రసారం 

మరిన్ని వార్తలు