CWC 2023: నాడు పాక్‌కు వలస వెళ్లిన కుటుంబం.. డాక్టర్‌ కావాలనుకున్న రషీద్‌ ఇప్పుడిలా! ఇంజమామ్‌ వల్లే..

9 Nov, 2023 18:52 IST|Sakshi

వన్డే ప్రపంచకప్‌-2023లో పాకిస్తాన్‌తో అఫ్గానిస్తాన్‌ మ్యాచ్‌.. పదకొండేళ్ల వ్యవధిలో.. వన్డేల్లో పాక్‌తో తలపడిన 7 సార్లూ అఫ్గాన్‌కు ఓటమే ఎదురైంది. విజయానికి కొన్నిసార్లు చేరువగా రాగలిగినా.. లక్ష్యాన్ని అందుకోవడం మాత్రం అఫ్గాన్‌ల వల్ల కాలేదు.

కానీ ఈసారి లెక్క మారింది. అప్పటికి ఇంగ్లండ్‌పై గెలిచిన అఫ్గన్‌.. మరోసారి అద్భుత ప్రదర్శనతో అదరగొట్టి పాక్‌ను చిత్తు చేయడంలో సఫలమైంది. ఈ గెలుపుతో వచ్చిన జోష్‌లో తర్వాత మరో రెండు మ్యాచ్‌లు నెగ్గి..  ప్రపంచకప్‌లో తొలిసారిగా సెమీస్‌ రేసులోనూ నిలవగలిగింది. 

ఇక పాకిస్తాన్‌పై చిరస్మరణీయమైన విజయం తర్వాత కీలక సభ్యుడైన రషీద్‌ ఖాన్‌ ఆట పాటతో మైదానంలోనే సంబరాలు చేసుకున్న విషయం తెలిసిందే.  ఈ విజయం జట్టుదే కావచ్చు. కానీ రషీద్‌కు సంబంధించి ఇది మరింత ప్రత్యేకం.

ఎందుకంటే అఫ్గానిస్తాన్‌ ఒక జట్టుగా ఎదగడంలో అతడి పాత్ర కూడా ఎంతో కీలకం. వరుస పరాజయాల నుంచి బయటపడి క్రికెట్‌ వేదికపై టీమ్‌గా ఆ జట్టు సత్తా చాటడంలో రషీద్‌ కూడా ప్రధాన భాగస్వామి. సరిగ్గా చెప్పాలంటే అఫ్గాన్‌  క్రికెట్‌తో పాటు సమాంతరంగా అతనూ ఎదిగాడు.

అంతకుమించి కూడా వ్యక్తిగతంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. తమ సొంత దేశంలో యుద్ధ వాతావరణం, మరెన్నో ప్రతికూలతలను అధిగమించి ఈ స్థాయికి చేరిన అతని పట్టుదల, కఠోర సంకల్పం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక దశలో యుద్ధ భయంతో పాకిస్తాన్‌కు వలస వెళ్లిపోయి అక్కడే దేశవాళీ క్రికెట్‌లోనూ సత్తా చాటి వెలుగులోకి వచ్చిన రషీద్‌ ప్రస్థానం అసాధారణం. 

తొలి గ్లోబల్‌ సూపర్‌ స్టార్‌
అఫ్గానిస్తాన్‌ దేశం నుంచి వచ్చిన తొలి గ్లోబల్‌ సూపర్‌ స్టార్‌.. ఈ వాక్యం రషీద్‌ఖాన్‌కు సరిగ్గా సరిపోతుంది. ఒకటి కాదు రెండు కాదు ప్రపంచవ్యాప్తంగా రషీద్‌ వేర్వేరు టోర్నీలు, లీగ్స్‌లో ఏకంగా 30 జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ఇందులో తన సొంత దేశం నుంచి పాకిస్తాన్, భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్‌ మొదలు అటు ఆస్ట్రేలియా నుంచి అమెరికా, ఇంగ్లండ్‌కు చెందిన జట్ల వరకు ఉన్నాయి.

అన్నింటా, అంతటా ఎక్కడ ఆడినా అతనికి అన్ని వైపుల నుంచి అభిమానం దక్కింది. క్రికెట్‌ ప్రేమికులందరూ లెగ్‌స్పిన్నర్‌గా రషీద్‌ ఆటను చూసి చప్పట్లు కొట్టినవారే! ఏదో ఒక దశలో తమవాడిగా సొంతం చేసుకున్నవారే. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ క్రికెట్‌ ఫ్యాన్స్‌ను అడిగితే చెప్తారు ఐపీఎల్‌లో అతని విలువేంటో, అతని ప్రభావం ఎలాంటిదో!

తొలిసారి ఐపీఎల్‌లో అడుగు పెట్టినప్పుడే
2017 నుంచి ఐదు సీజన్ల పాటు హైదరాబాద్‌కు ఆడిన అతను గత రెండేళ్లుగా గుజరాత్‌ టైటాన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అతని గూగ్లీలు ప్రపంచంలో ఎంతటి బ్యాటర్‌నైనా ఇబ్బంది పెడతాయి. తొలిసారి ఐపీఎల్‌లో అడుగు పెట్టినప్పుడే అతను అసోసియేట్‌ టీమ్‌ నుంచి ఈ మెగా లీగ్‌లో ఆడిన తొలి ఆటగాడిగా కొత్త ఘనతతో బరిలోకి దిగాడు.

అదీ ఏకంగా రూ. 4 కోట్ల విలువతో రైజర్స్‌ అతడిని ఎంచుకుంది. అప్పటి నుంచి అతను ఒక వైపు తన ఫ్రాంచైజీ టీమ్‌లకు, మరో వైపు జాతీయ జట్టుకు స్టార్‌గా మారాడు. ఇంకా చెప్పాలంటే అతను రాక ముందు వేళ్ల మీద లెక్కించగలిగే విజయాలు మాత్రమే సాధించిన అఫ్గానిస్తాన్‌ ఆ తర్వాత ఎన్నో సంచలనాలకు కారణమైందంటే అందులో రషీద్‌ పాత్ర ఎంతుందో అర్థం చేసుకోవచ్చు. 

యుద్ధ వాతావరణం నుంచి వచ్చి...
అఫ్గానిస్తాన్‌లోని నన్‌గర్హర్‌ రాష్ట్రం అతని స్వస్థలం. ఏడుగురు అన్నదమ్ముల్లో అతను ఆరోవాడు. చాలామంది లాగే తన అన్నలు సరదాగా టెన్నిస్‌ బాల్‌తో క్రికెట్‌ ఆడుతుండటం చూసి అతనికీ ఆసక్తి కలిగింది. అయితే ఆ దేశంలో పరిస్థితులు కనీస స్థాయిలో కూడా లేవు. కాబట్టి ఇంతకంటే మెరుగ్గా క్రికెట్‌లో ఏమీ చేయలేమనేది అందరి భావన.

డాక్టర్‌ కావాలనుకుంటే విధిరాత మరోలా
పెద్దయ్యాక తామేం కావాలో కలలు కనే అందరి పిల్లల్లానే చిన్నప్పుడు రషీద్‌ కూడా డాక్టర్‌ కావాలని,  కంప్యూటర్స్‌ నేర్చుకొని పెద్ద స్థాయికి చేరుకోవాలని, మంచి ఇంగ్లిష్‌ నేర్చుకొని టీచర్‌ కావాలని.. ఇలా చాలా కలలు కన్నాడు. కానీ అతనికి మరో విధంగా రాసి పెట్టి ఉంది. రషీద్‌ ఉండే ఊరు బాటి కోట్‌ పాకిస్తాన్‌ సరిహద్దులో ఉంటుంది. పెషావర్‌ సమీప నగరం.

చిన్న చిన్న క్రికెట్‌ టోర్నీలు ఆడేందుకు ఇక్కడివారు అక్కడికి, అక్కడివారు ఇక్కడికి వస్తుంటారు. అలాంటి సమయంలో నజీమ్‌ అనే మేనేజర్‌ రషీద్‌లోని ప్రతిభను గుర్తించాడు. ధాటిగా బ్యాటింగ్‌ చేయడంతో పాటు ప్రత్యర్థి బ్యాటర్లకు ఏమాత్రం అర్థం కాని అతని బౌలింగ్‌ శైలి నజీమ్‌ను ఆకర్షించింది. తన మాట మీద పెషావర్‌లోని ఒక కళాశాల కోచింగ్‌ కార్యక్రమంలో రషీద్‌ను అక్కడివారు తీసుకున్నారు.

పాకిస్తాన్‌కు వలస వెళ్లి
దాంతో రషీద్‌కు కొత్త తరహా శిక్షణ లభించింది. అప్పటి వరకు ఎలాంటి నాణ్యత లేని సిమెంట్‌ టర్ఫ్‌లపై ప్రాక్టీస్‌ చేస్తూ వచ్చిన అతనికి అసలైన క్రికెట్‌ ఏమిటో అర్థమైంది. దాదాపు అదే సమయంలో అఫ్గానిస్తాన్‌లో యుద్ధ వాతావరణం ఏర్పడింది.

కారణాలు ఏమైనా తీవ్రవాదుల హల్‌చల్, ప్రభుత్వ నియంత్రణ లేకపోవడం పరిస్థితులను ఇబ్బందికరంగా మార్చాయి. దాంతో రషీద్‌ కుటుంబం మొత్తం పాకిస్తాన్‌లోని పెషావర్‌కే వెళ్లి తలదాచుకుంది. అక్కడ అతడిని చాలా మంది ముహాజిర్‌ (శరణార్థి) అంటూ ఆట పట్టించినా.. తన క్రికెట్‌తో అతను అన్ని మరచిపోయేవాడు. 

తిరుగులేని ప్రదర్శనతో...
అపార ప్రతిభ ఉండటంతో పాకిస్తాన్‌లో జరిగే పలు దేశవాళీ టోర్నీల్లో రషీద్‌ చెలరేగిపోయాడు. అయితే సహజంగానే జాతీయ బోర్డు నిబంధనల కారణంగా అతనికి పాక్‌ టీమ్‌లో అవకాశాలైతే రాలేదు. కానీ అప్పటికే మెరికలా మారిన అతను తన సొంత దేశం చేరి ఆటపై పూర్తిగా దృష్టి పెట్టాడు. పాకిస్తాన్‌ దిగ్గజం ఇంజమామ్‌ ఉల్‌ హక్‌ తమ కోచ్‌గా రావడం రషీద్‌ కెరీర్‌ను మలుపు తిప్పింది.

ఇంజమామ్‌ ఒత్తిడి తేవడంతో
జింబాబ్వే పర్యటనకు తొలుత.. అతడిని సెలక్టర్లు ఎంపిక చేయలేదు. రషీద్‌ను తీసుకున్న తర్వాతే మిగతా విషయాలు మాట్లాడదామంటూ ఇంజమామ్‌ ఒత్తిడి తేవడంతో స్థానం ఖాయమైంది. ఆ తర్వాత కొన్నేళ్లకు చూస్తే అందరికంటే ముందుగా రషీద్‌ పేరుతోనే టీమ్‌ షీట్‌ తయారు కావడం విశేషం.

జింబాబ్వే సిరీస్‌తో అరంగేట్రం చేసిన రషీద్‌ ఆ తర్వాత అమిత వేగంగా దూసుకుపోయాడు. ఆ తర్వాత లెక్కలేనన్ని ఘనతలు అతడి ఖాతాలో వచ్చి చేరాయి. టెస్టుల్లో, వన్డేల్లో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన అతి పిన్న వయస్కుడిగా, టి20ల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన బౌలర్‌గా పలు ఘనతలు అతడి జాబితాలో చేరాయి. 

సహాయకార్యక్రమాల్లో ముందుంటూ...
భారత గడ్డపై వన్డే వరల్డ్‌ కప్‌ మొదలైన రెండు రోజులకు.. అఫ్గానిస్తాన్‌ జట్టు తమ తొలి మ్యాచ్‌లో ధర్మశాల మైదానంలో మరికొద్ది సేపట్లో బంగ్లాదేశ్‌తో తలపడేందుకు సన్నద్ధమైంది. అప్పుడే ఒక విషాద వార్త  బయటకు వచ్చింది. అఫ్గానిస్తాన్‌ దేశాన్ని అతి పెద్ద భూకంపం కుదిపేసింది.

మ్యాచ్‌ ఫీజును విరాళంగా
దేశంలో మూడో పెద్ద నగరమైన హిరాట్‌లో పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. ఎలాగోలా అఫ్గాన్‌ ఆటగాళ్లు మ్యాచ్‌ను ముగించేశారు. ఆ వెంటనే జట్టు స్టార్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ తన తరఫు నుంచి మొత్తం ప్రపంచకప్‌ మ్యాచ్‌ ఫీజును విరాళంగా ప్రకటించేశాడు.

ఆపై తగిన సహాయం చేయాలంటూ తన ఫౌండేషన్‌ ద్వారా కోరాడు. ఒకవైపు టోర్నీలో సత్తా చాటుతూ మరోవైపు తన సన్నిహితుల సహకారంతో అతను అఫ్గానిస్తాన్‌లో సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తూనే ఉన్నాడు.

నిధులతో పాటు పునరావాస కార్యక్రమాలూ కొనసాగుతున్నాయి. 25 ఏళ్ల రషీద్‌ ఇలా స్పందించడం మొదటిసారి కాదు. గతంలోనూ తన దేశంలో ఎన్నో సేవా కార్యక్రమాల్లో భాగం కావడంతోపాటు తన సొంత డబ్బుతో చిన్నారుల చదువు, పేదలకు సహకారం వంటి పనుల్లో చురుగ్గా పాల్గొన్నాడు.

అక్కడి పరిస్థితులు కూడా తన దేశం కోసం ఏదైనా చేయాలనే ప్రేరణను కలిగిస్తాయని అతను చెబుతుంటాడు. పేద దేశం, టెర్రరిజం మొదలు ఇతర తీవ్రమైన ప్రతికూలతలకు ఎదురొడ్డి తాను ఇప్పుడు ఒక గొప్ప ఆటగాడిగా ఎదగడం వరకు ఎక్కడా తన  మూలాలను మర్చిపోలేదు. ప్రపంచంలో ఏ చోట క్రికెట్‌ ఆడుతున్నా.. సాయం చేసేందుకు ఎప్పుడైనా సిద్ధమని అతను అన్నాడు. అదే అతడిని మరింత ప్రత్యేకంగా నిలబెట్టింది. 
-మొహమ్మద్‌ అబ్దుల్‌ హాది

మరిన్ని వార్తలు