రష్మిక సంచలనం

1 Oct, 2019 10:11 IST|Sakshi

ఫెనెస్టా ఓపెన్‌ జాతీయ టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌  

సాక్షి, హైదరాబాద్‌: ఫెనెస్టా ఓపెన్‌ జాతీయ మహిళల టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక సంచలన విజయంతో శుభారంభం చేసింది. న్యూఢిల్లీలోని ఆర్‌కే ఖన్నా స్టేడియంలో సోమవారం జరిగిన తొలి రౌండ్‌లో శ్రీవల్లి రష్మిక 7–5, 6–3తో ఆరో సీడ్‌ చామర్తి సాయి సంహిత (తమిళనాడు)ను బోల్తా కొట్టించింది. తొలి సెట్‌లో 3–5తో వెనుకబడ్డా... ఎక్కడా ఒత్తిడికి గురికాని రష్మిక వరుసగా నాలుగు గేములను సొంతం చేసుకొని సెట్‌ను గెలిచింది. రెండో సెట్‌లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన ఆమె విజయాన్ని ఖాయం చేసుకుంది. ఇతర మ్యాచ్‌ల్లో తెలంగాణకే చెందిన దామెర సంస్కృతి 6–0, 6–1తో సాల్సా అహెర్‌ను చిత్తుగా ఓడించగా... వై. సాయిదేదీప్య 6–3, 6–1తో ప్రతిభ (కర్ణాటక)పై గెలిచింది. తటవర్తి శ్రేయ 6–2, 6–2తో శరణ్యను ఓడించింది.  

మెయిన్‌ ‘డ్రా’కు కార్తీక్‌ రెడ్డి
పురుషుల సింగిల్స్‌లో తెలంగాణ కుర్రాడు సాయి కార్తీక్‌రెడ్డి మెయిన్‌ ‘డ్రా’కు అర్హత సాధించాడు. క్వాలిఫయింగ్‌ ఫైనల్‌లో కార్తీక్‌ రెడ్డి 6–3, 4–6, 6–2తో అని్వత్‌ బింద్రే (మహారాష్ట్ర)పై విజయం సాధించాడు. క్వాలిఫయింగ్‌ తొలి రౌండ్‌లో అతను 9–3తో ఆకాశ్‌ నంద్వాల్‌ (మధ్యప్రదేశ్‌)పై గెలుపొందగా... రెండో రౌండ్‌లో 9–5తో జూనియర్‌ జాతీయ చాంపియన్‌ దిగ్విజయ్‌ ప్రతాప్‌ సింగ్‌ (చండీగడ్‌)ను చిత్తు చేశాడు. సోమవారం జరిగిన మెయిన్‌ డ్రా తొలి రౌండ్‌ మ్యాచ్‌లో హైదరాబాద్‌ కుర్రాడు రిషబ్‌ అగర్వాల్‌ 3–6, 3–6తో పారస్‌ దహియా చేతిలో ఓడిపో యాడు. అండర్‌ –18 బాలుర సింగిల్స్‌ తొలి రౌండ్‌ మ్యాచ్‌లో లంక సుహిత్‌ రెడ్డి 6–2, 6–4తో భూపేందర్‌పై గెలిచాడు. ఈ టోర్నీ ప్రారంభమై ఈ ఏడాదికి 25 ఏళ్లు పూర్తి కావడంతో నిర్వాహకులు మాజీ చాంపియన్స్‌ ను సన్మానించారు. తొలి రోజు  కేంద్ర క్రీడల మాజీ మంత్రి, ఏథెన్స్‌ ఒలింపిక్స్‌ రజత పతక విజేత రాజ్యవర్ధన్‌ రాథోడ్‌ ముఖ్య అతిథిగా విచ్చేశారు.

మరిన్ని వార్తలు