పాక్‌ కోచ్‌ అయినప్పుడు చెబుతా: రోహిత్‌

17 Jun, 2019 18:09 IST|Sakshi

మాంచెస్టర్‌: ప్రపంచకప్‌లో భాగంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా జయకేతనం ఎగరవేసింది. టీమిండియా హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ శర్మ సూపర్‌ సెంచరీతో పాటు బౌలర్లు సమిష్టిగా రాణించడంతో కోహ్లి సేన సునాయస విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా రోహిత్‌ ఇన్నింగ్స్‌ మ్యాచ్‌కే హైలెట్‌. క్రికెట్‌ గాడ్‌, భారత దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ను గుర్తుచేస్తూ కొన్ని చూడముచ్చటైన షాట్‌లు ఆడాడు. బహుమతి ప్రధానోత్సవం అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రోహిత్‌ పాల్గొన్నాడు. ఈ  పాక్‌ జర్నలిస్టు అడిగిన ఓ ప్రశ్నకు తనదైన రీతిలో సమాధానమిచ్చి నవ్వులజల్లులు కురిపించాడు.  

‘ఓటమితో పాక్‌ బ్యాట్స్‌మెన్‌ కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఈ సమయంలో మీ సహచర ఆటగాళ్లు, పాక్‌ బ్యాట్స్‌మెన్‌కు మీరిచ్చే సలహాలు ఏంటి’ అని జర్నలిస్టు ప్రశ్నించాడు. దీనికి సమాధానంగా..‘నేను పాకిస్థాన్ కోచ్ గా ఎప్పుడు బాధ్యతలు స్వీకరిస్తానో అప్పుడు మీకు తప్పకుండా సమాచారం అందిస్తాను, ఎందుకంటే ఇది పాకిస్థాన్ కోచ్ జవాబు చెప్పాల్సిన ప్రశ్న, దీనికి నేనేం సమాధానం చెబుతాను?’ అంటూ చమత్కరించాడు. ఇక దేశం తరుపున చేసిన ప్రతీ పరుగు ఎంతో ముఖ్యమైందని, ప్రపంచకప్‌ లాంటి మ్యాచ్‌ల్లో సెంచరీ సాధిస్తే అంతకుమించిన ఆనందం మరొకటి ఉండదన్నాడు. సమైరా(రోహిత్‌ కూతురు) తన జీవితంలోకి వచ్చాక దశ, దిశ మారిందని, అంతా కలిసొస్తుందని రోహిత్‌ పేర్కొన్నాడు.

చదవండి:
‘ఆ గెలుపు క్రెడిట్‌ అంతా ఐపీఎల్‌దే’
అంతా నా బిడ్డ వల్లే : రోహిత్‌ శర్మ

మరిన్ని వార్తలు