‘అలా సచిన్‌ను తొలిసారి చూశా’

9 Apr, 2020 14:09 IST|Sakshi

న్యూఢిల్లీ: టీమిండియా రెండోసారి వన్డే వరల్డ్‌కప్‌ గెలిచి ఇటీవలే తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ మెగా విజయంలో భాగమైన ప్రతీ ఒక్కరూ తమ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉన్నారు. దానిలో భాగంగా టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ మరికొన్ని విషయాలను వెల్లడించాడు. మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌  టెండూల్కర్‌ కెరీర్‌లో  అతి పెద్ద విజయంగా నిలిచిన ఆనాటి వరల్డ్‌కప్‌ ఫైనల్‌ క్షణాలను తామంతా ఎంతగానో ఆస్వాదించామని భజ్జీ పేర్కొన్నాడు. ప్రత్యేకంగా సచిన్‌ అయితే ఆ విజయానికి అందరికంటే కాస్త ఎక్కువగానే సంబరపడ్డాడని తెలిపాడు. ఆ సమయంలో చుట్టుపక్కల ఉన్న వారిని సైతం సచిన్‌ పట్టించుకోకుండా సెలబ్రేషన్స్‌ చేసుకున్నాడన్నాడు. ఆ క్షణంలో సచిన్‌లో ఎప్పుడూ చూడని కొత్త కోణాన్ని చూశామన్నాడు.(నాకు నమ్మశక్యంగా లేదు)

‘సచిన్‌ ఎప్పుడూ డ్యాన్స్‌ చేయడం నేను చూడలేదు. ఏ విజయం సాధించినా సచిన్‌ సాధారణంగానే ఉండేవాడు. కాకపోతే ధోని నేతృత్వంలో 2011లో వరల్డ్‌కప్‌ గెలిచాక సచిన్‌ ఫుల్‌ ఖుషీ అయ్యాడు. సచిన్‌ డ్యాన్స్‌తో దుమ్ములేపాడు. సచిన్‌ను అలా చేయడాన్ని నేను తొలిసారి చూశా. చుట్టూ ఎవర్నీ పట్టించుకోకుండా సచిన్‌ చిందులు వేయడం అదే మొదటిసారి.  మా అందరితో కలిసి సచిన్‌ ఎంజాయ్‌ చేశాడు. అది నాకు ఎప్పటికీ గుర్తుండే విషయం. మేము వరల్డ్‌కప్‌ గెలిచిన సందర్భంలో నా కళ్లలో ఆనంద బాష్పాలు రాలాయి. నాకు ఎలా రియాక్ట్‌ కావాలో కూడా అర్థం కాక ఏడ్చేశాను. నాకు ఒక విషయం బాగా గుర్తు. ఆ రోజు రాత్రి  నేను మెడల్‌ పక్కన పెట్టుకునే పడుకున్నా. నేను లేచి చూసుకున్న క్షణంలో ఆ మెడల్‌ నాపై ఉండటం ఇంకా గొప్పగా అనిపించింది’ అని భజ్జీ తెలిపాడు. (అది ‘మాస్టర్‌’ ప‍్లాన్‌: సెహ్వాగ్‌)

మరిన్ని వార్తలు