‘కోహ్లికి ధోని తోడు అవసరం’

25 May, 2019 20:46 IST|Sakshi

ముంబై: మాజీ సారథి, సీనియర్‌ ఆటగాడు ఎంఎస్‌ ధోని అనుభవం, సమయస్ఫూర్తి ప్రపంచకప్‌లో టీమిండియాకు ఎంతగానో ఉపయోగపడుతుందని మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ అభిప్రాయపడ్డారు. మే 30 నుంచి ఇంగ్లండ్‌ వేదికగా ప్రారంభంకానున్న వన్డే ప్రపంచకప్‌ 2019లో టీమిండియాపై భారీ అంచనాలే ఉన్నాయన్నారు. ఐపీఎల్‌లో విరాట్‌ కోహ్లి సారథ్యంలోని బెంగళూరు ఓడినంత మాత్రాన అతడి కెప్టెన్సీపై అనుమానం వ్యక్తం చేయాల్సిన అవసరంలేదన్నారు. కోహ్లి దూకుడు, ధోని అనుభవం టీమిండియాకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.
‘వికెట్‌ కీపర్‌గా ధోని అనుభవం, సమయస్ఫూర్తి టీమిండియాకు ఎంతో కీలకం. వికెట్ల వెనకాల నిలబడి అతడు మైదానాం మొత్తాన్ని పరిశీలిస్తాడు. బ్యాట్స్‌మెన్‌ కదలికలను పసిగడతాడు. బౌలర్‌ బంతి వేయడం ప్రారంభించాక బ్యాట్స్‌మెన్‌ కంటే ధోనీనే ఎక్కువగా గమనిస్తాడు. అందుకే స్టంప్స్‌ వెనక ఎంతో అనుభవమున్న ధోనీ టీమిండియాకు చాలా ప్లస్‌. ఇక సారథిగా, ఆటగాడిగా ఎంతో అనుభవం ఉన్న ధోని తోడు ప్రపంచకప్‌లో కోహ్లికి ఎంతో అవసరం’అంటూ సచిన్‌ పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రపంచకప్‌లో ధోని ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తే మంచిదని సూచించారు. ఇక ప్రపంచకప్‌ తొలి పోరులో భాగంగా జూన్‌ 5న టీమిండియా దక్షిణాప్రికాతో తలపడనుంది. 

మరిన్ని వార్తలు