మరిన్ని విజయాలు సాధిస్తాం : కరన్‌

2 Apr, 2019 08:56 IST|Sakshi

మొహాలి : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ 14 పరుగుల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్న ‘హ్యాట్రిక్‌’ వీరుడు సామ్‌ కరన్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అందుకున్నాడు. హిట్టర్‌ క్రిస్‌ గేల్‌ గాయంతో మ్యాచ్‌కు దూరమవడంతో అతడి స్థానంలో జట్టులోకి వచ్చిన ఈ యువ బౌలర్‌.. ఐపీఎల్‌ చరిత్రలో అతి పిన్న వయసులో  (20 ఏళ్ల 302) ఈ ఘనత సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలో కింగ్స్‌ జట్టు సహ యజమాని ప్రీతి జింటా కరన్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. ‘ మేము గెలిచాం. గొప్ప విజయాన్ని అందుకున్నాం. మా టీమ్‌ ప్రదర్శన పట్ల చాలా గర్వంగా ఉంది. ఒత్తిడిలో కూడా సామ్‌ కరన్‌ హ్యాట్రిక్‌ సాధించాడు. ఈ ‘లయన్‌ హర్టెడ్‌’ ఆటగాడితో చిన్న సెలబ్రేషన్‌’ అంటూ కరన్‌ కోసం బాంగ్రా స్టెప్పులేసిన వీడియో చేశారు.

ఇక మ్యాచ్‌ అనంతరం కరన్‌ మాట్లాడుతూ... ‘ హ్యాట్రిక్‌ సాధిస్తానని అనుకోనేలేదు. ప్రేక్షకుల హర్షధ్వానాల మధ్య నా మాటలు నేనే వినలేకపోయా. అశ్‌ చెప్పినట్టుగానే బౌల్‌ చేశా. స్థానిక బ్యాటర్స్‌(ఇండియన్‌ ప్లేయర్స్‌)కు ఎలా బౌలింగ్‌ చేయాలనే విషయంపై సహచరులతో చర్చించా. షమీ కూడా అద్భుతంగా బౌలింగ్‌ చేసి నాకు అండగా నిలిచాడు. నిజంగా మాకిది గొప్ప విజయం.బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ విభాగాల్లో రాణించేందుకు ఎల్లవేళలా కష్టపడతా. స్కూల్‌ క్రికెట్‌తో మొదలెట్టిన నేను.. మొదటిసారిగా ఇప్పుడే ప్రొఫెషనల్‌ క్రికెట్‌ ఆడానని అనుకుంటున్నా. ఇలాంటి విజయాలు మరిన్ని నమోదు చేస్తాం’ అని విశ్వాసం వ్యక్తం చేశాడు. కాగా కింగ్స్‌ కెప్టెన్‌ అశ్విన్‌.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన షమీ, కరన్‌లపై ప్రశంసలు కురిపించాడు.

కాగా సోమవారం నాటి మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌ 18వ ఓవర్‌ చివరి బంతికి హర్షల్‌ను ఔట్‌ చేసిన కరన్‌... 20వ ఓవర్‌ తొలి రెండు బంతులకి రబడ (0), లమిచానే (0)లను క్లీన్‌బౌల్డ్‌ చేసి ఈ సీజన్‌లో తొలి ‘హ్యాట్రిక్‌’ (2.2 ఓవర్లలో 11 పరుగులిచ్చి 4 వికెట్లు)ను నమోదు చేశాడు. ఇక ఐపీఎల్‌లో ఇది మొత్తంగా 17వ హ్యాట్రిక్‌.

మరిన్ని వార్తలు