అప్పుడే నా మనసు ఆనందంగా ఉంటుంది: సానియా

16 May, 2020 12:07 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా లాక్‌డౌన్‌లో తన కుటుంబంతో కలిసి ఒకేదగ్గర లేకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సానియా తన ముద్దుల తనయుడు ఇజాన్‌ మిర్జా మాలిక్‌తో కలిసి హైదరాబాద్‌లోని తన తల్లిదండ్రుల ఇంట్లొ చిక్కుకుపోయారు. ఇక తన భర్త, పాకిస్తాన్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ ఏమో పాకిస్తాన్‌లోనే తన తల్లితో ఉంటున్నాడు. ఎప్పుడు బిజీగా ఉండేవారు ఈ లాక్‌డౌన్‌ వేళ కూడా ఒకే దగ్గర ఉండలేక పోయినందుకు ఆమె చింతిస్తున్నారు. (క్రికెట్‌ ప్లేయరా..  టెన్నిస్‌ ప్లేయరా?)

ఈ నేపథ్యంలో ఫేస్‌బుక్‌ లైవ్‌లో మాట్లాడుతూ.. ‘కరోనా కారణంగా నేను  ఇక్కడ హైదరాబాద్‌లో ఇజాన్‌తో చిక్కుకుపోయాను. షోయబ్‌ పాకిస్తాన్‌లో తన తల్లితో ఉండిపోయారు. మాకు చిన్న పిల్లాడు ఉన్నాడు. ఓ కుటుంబంగా ఈ పరిస్థితిన ఎదుర్కొవడం అంత సులభమైనది కాదు. ఇక ఇజాన్‌ తన తండ్రిని ఎప్పుడు చుస్తాడో తెలియదు. ఆ క్షణం వచ్చాక షోయబ్‌ను‌, ఇజాన్‌లను ఆపడం కష్టం’ అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఎదేమైనా ఈ విపత్కర కాలంలో షోయబ్‌ తన తల్లితో అక్కడ ఉండటం మంచిదైందని పేర్కొన్నారు. ‘‘షోయబ్‌ తల్లి 65 ఏళ్ల వృద్దురాలు. కాబట్టి తనకు ప్రస్తుతం ఒకరి సాయం అవసరం. ఎప్పుడూ తనతో ఒకరూ తనతో ఉండటం ముఖ్యం. చివరికి అది జరిగినందుకు ఆనందంగా ఉంది. షోయబ్‌ తనతోనే ఉన్నాడు సంతోషకరమైన విషయం. కానీ ఎప్పుడు మా కుటుంబం అంతా తిరిగి ఒకే దగ్గరికి చేరుతుందో అని ఎదురుచేస్తున్నాను’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. (వైరల్‌ ట్వీట్‌పై సానియా మీర్జా వివరణ)

అయితే ‘‘వర్చువల్‌ వీడియో కాల్స్ దూరాన్ని తగ్గించగలవేమో కానీ వ్యక్తిగతంగా కలవడానికి ప్రత్యామ్నాయం కాదు. నా భర్తకు నేను, ఇజాన్ తన‌ తండ్రికి దూరంగా ఉండటం నిజంగా సులభమైనది కాదు. ఇక ఈ ప్రపంచం మళ్లీ ఎప్పటి లాగే కౌగిలించుకోవడం, కరచాలం చేసే సాధారణ పరిస్థితులకు రావాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. మీకు తెలుసా మనం ప్రేమించే వారిని హత్తుకోలేము, కలుసుకోలేము అన్న ఆలోచన ఆ క్షణం మనల్ని చచ్చిపోయేలా చేస్తుంది.  ఇక మేము మహమ్మారి బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటామని, త్వరలోనే ఈ కాలం నుంచి బయటపడి మా కుటుంబం అంతా కలుసుకోవాలని ఆశిస్తున్నాను. కుటుంబంమంతా ఒక దగ్గర చెరినప్పుడే నా మనసు ఆనందంగా ఉంటుంది. ఇక దానిని విధికే వదిలేస్తున్న’ అని భావోద్యేగానికి  లోనయ్యారు.  

మరిన్ని వార్తలు