రూ. 1.25 కోట్లు.. కలిసే ఉంటాం: సానియా మీర్జా

31 Mar, 2020 13:10 IST|Sakshi

ప్రాణాంతక కరోనా వైరస్‌(కోవిడ్‌-19)పై పోరులో తన వంతు సహాయం అందించేందుకు భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా ముందుకు వచ్చారు. మహమ్మారితో పోరాడేందుకు స్వచ్ఛంద సంస్థలతో కలిసి రూ. 1.25 కోట్ల నిధులు సేకరించారు. ఈ విషయాన్ని ఆమె సోషల్‌ మీడియాలో వెల్లడించారు. ఈ మేరకు.. ‘‘ గత వారం రోజులుగా ఓ బృందంగా ఏర్పడి అవసరమైన వారికి సహాయం చేస్తున్నాం. వేలాది కుటుంబాలకు ఆహారం అందించాం. వారం రోజుల్లో 1.25 కోట్ల రూపాయలు సేకరించాం. తద్వారా దాదాపు లక్ష మందికి సహాయం చేసే అవకాశం లభించింది. ఈ ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుంది. ఈ పోరాటంలో మేమంతా కలిసే ఉంటాం’’ అని సోమవారం ట్వీట్‌ చేశారు. యూత్‌ఫీడ్‌ ఇండియా, సఫా ఇండియా ఇందులో భాగస్వామ్యమయ్యాయని తెలిపారు.(కరోనా: హిట్‌ మ్యాన్‌ భారీ విరాళం! )

కాగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమల్లో ఉన్న నేపథ్యంలో పేదలకు అండగా ఉండేందుకు కుబేరుల నుంచి సామాన్యుల వరకు తమకు తోచిన సహాయం చేస్తున్నారు. ప్రధాని, ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందిస్తున్నారు. ఈ క్రమంలో మహిళా క్రీడాకారులు మిథాలీ రాజ్‌ రూ. 10 లక్షలు, స్పిన్నర్‌ పూనం యాదవ్‌ రూ. 2 లక్షలు, ఎంపీ మేరీకోమ్‌ తన నెల జీతం, దీప్తి శర్మ రూ. 1.5 లక్ష, షూటర్‌ మనుబాకర్‌ లక్ష రూపాయలు, స్ప్రింటర్‌ హిమదాస్‌ తన నెల జీతం.. అదేవిధంగా క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ రూ. 50 లక్షలు, సురేశ్‌ రైనా  52 లక్షలు. రోహిత్‌ శర్మ రూ. 80 లక్షలు విరాళంగా ప్రకటించారు. 

మరిన్ని వార్తలు