ప్లీజ్‌.. అలాంటి మాటలు చెప్పకండి: సానియా

3 Oct, 2019 18:05 IST|Sakshi

న్యూఢిల్లీ : ‘ఆటలు ఆడితే నిన్నెవరూ పెళ్లి చేసుకోరు’ అంటూ క్రీడల్లోకి రాకుండా ఆడపిల్లల్ని నిరుత్సాహ పరచవద్దని భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా సూచించారు. మహిళా క్రీడా ప్రపంచంలో తాను భాగస్వామినైనందుకు గర్వపడుతున్నానన్నారు. పురుషులతో పాటుగా మహిళలకు సమానమైన అవకాశాలు రానప్పటికీ.. నేడు ఎంతో మంది మహిళామణులు తమ దేశ కీర్తి పతాకను ఎగురవేస్తున్నారని పేర్కొన్నారు. ఇక సమాన అవకాశాలు లభిస్తే ఆకాశమే హద్దుగా చెలరేగి... తమ ప్రతిభను ప్రపంచవ్యాప్తం చేసుకుంటారని చెప్పుకొచ్చారు. అయితే ఇందుకు సమాజంతో పాటు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం కూడా ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. తల్లిదండ్రులు, బంధువుల ఆలోచనాసరళిలో మార్పు వచ్చినపుడే అమ్మాయిలు క్రీడల్లో రాణిస్తారని అభిప్రాయపడ్డారు. చిన్నపుడు పీటీ ఉషను చూసి స్ఫూర్తి పొందానని.. ప్రస్తుతం పీవీ సింధు, సైనా నెహ్వాల్‌, దీపా కర్మాకర్‌ వంటి ఎంతో మంది క్రీడారంగంలో తమదైన ముద్ర వేస్తున్నారని ప్రశంసించారు. 

ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా.. ‘మహిళలు- నాయకత్వం’ అనే అంశం మీద గురువారం జరిగిన ప్యానల్‌ డిస్కషన్స్‌లో ఐక్యరాజ్యసమితి దక్షిణాసియా మహిళా గుడ్‌విల్‌ అంబాసిడర్‌ సానియా మీర్జా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘   నాకు ఎనిమిదేళ్ల వయస్సు ఉన్నప్పటి నుంచీ వింటున్నా. ఎండలో ఆడితే నల్లబడతావు. అప్పుడు నిన్నెవరూ పెళ్లి చేసుకోరు అంటూ బంధువులు నన్ను బెదిరించేవారు. ప్లీజ్‌... తల్లిదండ్రులు, చుట్టాలు, ఆంటీలు, అంకుళ్లు అందరికీ ఓ విఙ్ఞప్తి. ఇలాంటి మాటలు చెప్పి ఆడపిల్లల్ని వెనక్కిలాగకండి. చిన్నతనంలో ఇటువంటి మాటలు విన్నపుడు నిజంగానే వాళ్లు చెప్పినట్లు జరుగుతుందా అనే చిన్న సందేహం ఉండేది. తెల్లగా ఉంటేనే అందం.. అందం ఉంటేనే పెళ్లి అనే మాటలు చెప్పే సంస్కృతి పోవాలి. అమ్మాయిలకు ఆత్మవిశ్వాసమే నిజమైన అందం అని ప్రతీ ఒక్కరూ గుర్తించాలి అని విఙ్ఞప్తి చేశారు. 

మీ కొడుకు ఎక్కడ ఉన్నాడు?
‘ఒకానొక రోజు ముంబై ఎయిర్‌పోర్టులో ఉన్న సమయంలో ఓ వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు. మాతృత్వాన్ని బాగా ఆస్వాదిస్తున్నారా. తల్లిగా మీరు చాలా బాగున్నారు. మీతో ఒక ఫొటో తీసుకోవచ్చా అని అడిగాడు. నేను సరే అన్నాను. వెంటనే మీ కొడుకు ఎక్కడ తన ఫొటో కూడా కావాలి అన్నాడు. లేదు తను హైదరాబాద్‌లో ఉన్నాడని నేను చెప్పగానే.. తన ముఖంలో రంగులు మారిపోయాయి. అదేంటి మీ కొడుకు మీతో పాటే ఉండాలిగా అన్నాడు. నేను కూడా తనను అదే ప్రశ్న అడిగాను. తను ఇంటి దగ్గర ... నా భార్య దగ్గర ఉన్నాడు. అయినా నేను వెళ్లే ప్రతీ చోటుకు తనను తీసుకువెళ్లలేను అని సమాధానమిచ్చాడు. అపుడే అతడి మనస్తతత్వం ఏంటో నాకు పూర్తిగా అర్థమైంది’ అంటూ సానియా తనకు ఎదురైన అనుభవం గురించి చెప్పుకొచ్చారు. కాగా టెన్నిస్‌లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించిన సానియా... పాకిస్తాన్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఈ క్రీడాజంట గతేడాది ఇజహాన్‌ అనే మగపిల్లాడికి జన్మనిచ్చారు. ఈ నేపథ్యంలో సానియా కొంతకాలంగా ఆటకు విరామమిచ్చారు. 

మరిన్ని వార్తలు