World Cup 2023: పాకిస్తాన్‌ జట్టుకు ఏమైంది?.. వరల్డ్‌కప్‌లో చెత్త ప్రదర్శనకు కారణాలేంటి?

12 Nov, 2023 12:05 IST|Sakshi

పాకిస్తాన్‌ క్రికెట్ టీమ్‌.. వన్డే ప్రపంచకప్‌-2023 టైటిల్‌ ఫేవరేట్‌గా భారత గడ్డపై అడుగుపెట్టిన జట్లలో ఒకటి. కానీ అందరి అంచనాలను తలకిందలూ చేస్తూ లీగ్‌ దశలోనే పాకిస్తాన్‌ ఇంటిముఖం పట్టింది. తొమ్మిది మ్యాచ్‌ల్లో కేవలం నాలుగింట మాత్రమే విజయం సాధించి.. పాయింట్ల పట్టికలో ఐదో స్ధానంతో సరిపెట్టుకుంది.

శనివారం ఇంగ్లండ్‌ మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీలో పాక్‌ కథ ముగిసింది. దీంతో వరుసగా మూడో సారి వన్డే వరల్డ్‌కప్‌ సెమీఫైనల్స్‌కు చేరడంలో పాకిస్తాన్‌ విఫలమయ్యంది. గత ఆరు వరల్డ్‌కప్‌ ఎడిషన్‌లలో కేవలం ఒక్కసారి మాత్రమే సెమీస్‌కు పాక్‌ చేరింది. అయితే ఎన్నో అంచనాలతో ఈ మెగా టోర్నీలో బరిలోకి దిగిన పాకిస్తాన్‌.. సెమీస్‌కు చేరడంలో ఎందుకు విఫలమైందో ఓ లూక్కేద్దం.

ఫాస్ట్‌ బౌలింగ్‌ వైఫల్యం..
పాకిస్తాన్‌కు బ్యాటింగ్‌ కంటే బౌలింగే ఎక్కువ బలం. అటువంటి ఈ ఏడాది టోర్నీలో పాక్‌ బౌలర్లు తమ స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. ముఖ్యంగా పేసర్లు దారాళంగా పరుగులు సమర్పించకున్నారు. వరల్డ్‌ నెం1 బౌలర్‌ షాహీన్‌ అఫ్రిది ఆడపదడప వికెట్లు తీసినప్పటికీ.. పరుగులు కట్టడం చేయడంలో మాత్రం విఫలమయ్యాడు. అతడితో పాటు మరో వరల్డ్‌క్లాస్‌ ఫాస్ట్‌ బౌలర్‌ రవూఫ్‌ అయితే ఘోరంగా విఫలమయ్యాడు. ఈ టోర్నీలో 9 మ్యాచ్‌లు ఆడిన రవూఫ్‌ ఏకంగా 533 పరుగులిచ్చాడు. ఇక్కడే మనం అర్ధం చేసుకోవచ్చు రవూఫ్‌ బౌలింగ్‌ ప్రదర్శన ఎలా ఉందో. 

నసీమ్ షా గాయం..
నసీమ్‌ షా.. పాకిస్తాన్‌ పేస్‌ త్రయంలో ఒకడు. షాహీన్‌ అఫ్రిదితో కలిసి కొత్త బంతిని షేర్‌ చేసుకుంటాడు. పవర్‌ప్లేలో తన పేస్‌తో వికెట్లు పడగొట్టి తన జట్టుకు అద్భుతమైన ఆరంభాలను ఇచ్చేవాడు. అయితే ఈ మెగా టోర్నీకకి ముందు ఆసియాకప్‌లో నసీమ్‌ షా గాయపడ్డాడు. దీంతో అతడు వరల్డ్‌కప్‌కు దూరమయ్యాడు. అతడి లేని లోటు పాక్‌ జట్టులో సృష్టంగా కన్పించింది. నసీం షా స్ధానంలో వెటరన్‌ పేసర్‌ హసన్‌ అలీ వచ్చినప్పటికీ అంత ప్రభావం చూపలేకపోయాడు.

సరైన స్పిన్నర్‌ లేడు..
ఈ వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్‌ జట్టులో క్వాలిటి స్పిన్నర్‌ ఒక్కరు కూడా లేరు. మిగితా జట్లలో స్పిన్నర్లు బంతిని బొంగరంలా తిప్పితే.. పాక్‌ స్పిన్నర్లు మాత్రం భారీగా పరుగులు సమర్పించుకున్నారు. కీలకమైన మిడిల్‌ ఓవర్లలో పరుగులు లీక్‌ చేస్తూ తమ జట్టు ఓటమికి కారణమయ్యారు. పాకిస్తాన్‌ ప్రధాన స్పిన్నర్, వైస్‌ కెప్టెన్‌  షాదాబ్ ఖాన్ ప్రదర్శన కోసం అయితే ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు.  అతడు దారుణంగా విఫలమయ్యాడు. ఆరు మ్యాచ్‌లు ఆడి  6 కంటే ఎక్కువ ఎకానమీతో కేవలం రెండు వికెట్లు మాత్రమే తీయగలిగాడు. అతడితో పాటు నవాజ్‌ కూడా అంతంత ప్రదర్శన మాత్రమే కనబరిచాడు.

బాబర్‌ చెత్త కెప్టెన్సీ..
ఈ వరల్డ్‌కప్‌ నుంచి పాకిస్తాన్‌ ఇంటముఖం పట్టడానికి మరో కారణం బాబర్‌ ఆజం కెప్టెన్సీ అనే చెప్పాలి. 9 మ్యాచ్‌ల్లో కూడా బాబర్‌ కెప్టెన్సీ మార్క్‌ పెద్దగా కన్పించలేదు. జట్టులో మార్పులు కూడా సరిగ్గా చేయలేదు. టోర్నీ ఆరంభం నుంచే ఓపెనర్‌ ఇమామ్‌ ఉల్‌ హాక్‌ దారుణంగా విఫలమవుతున్నప్పటికీ అవకాశాలు ఇవ్వడం.. మరో సీనియర్‌ ఓపెనర్‌ ఫఖార్‌ జమాన్‌ పక్కన పెట్టడం వంటి తప్పిదాలను బాబర్‌ చేశాడు.

మ్యాచ్‌ మధ్యలో వ్యూహత్మకంగా వ్యవరించడంలో కూడా బాబర్‌ విఫలమయ్యాడు. క్లిష్టమైన పరిస్ధితుల్లో బాబర్‌ పూర్తిగా తేలిపోయాడు..వ్యక్తిగత ప్రదర్శన పరంగా కూడా బాబర్‌ తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. 9 మ్యాచ్‌ల్లో 320 పరుగులు మాత్రమే ఆజం చేశాడు.

ఇదేమి ఫీల్డింగ్‌ రా బాబు..
క్రికెట్‌లో పాకిస్తాన్‌ జట్టు మెరుగుపడాల్సిన అంశం ఏదైనా ఉందంటే ఫీల్డింగ్‌ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ మెగా టోర్నీలో ఫీల్డింగ్‌లో పాకిస్తాన్‌ పేలవ ప్రదర్శన కనబరిచింది. ముఖ్యంగా అఫ్గానిస్తాన్‌, ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో పేలవ ఫీల్డింగ్‌ కనబరిచిన పాక్‌.. అందుకు భారీ మూల్యం చెల్లంచకుంది.

ఆస్ట్రేలియా మ్యాచ్‌లో మొదటిలోనే డేవిడ్‌ వార్నర్‌కు అవకాశమివ్వడంతో అతడు భారీ శతకంతో చెలరేగాడు. ఇలా చెప్పుకుంటూ పోతే పాకిస్తాన్‌ ఫీల్డింగ్‌ కథలు ఎన్నో ఉన్నాయి.
చదవండి: ENG vs WI: వెస్టిండీస్‌ టూర్‌కు ఇంగ్లండ్‌ జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా జోస్‌ బట్లర్‌

మరిన్ని వార్తలు