‘నా సెమీస్‌ జట్టు ఇదే.. నువ్వు మారవు’

10 Jul, 2019 11:10 IST|Sakshi

టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా పట్ల భారత మాజీ క్రికెటర్‌, కామెంటేటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ ద్వేషపూరిత వైఖరి ప్రదర్శిస్తున్నాడంటూ జడ్డూ అభిమానులు దుమ్మెత్తిపోస్తున్నారు. నువ్వు మారవు సంజయ్‌ అంటూ మండిపడుతున్నారు. రవీంద్ర జడేజా వంటి బిట్స్‌ అండ్‌ పీసెస్‌ ఆటగాళ్లకు తాను అభిమానిని కాదని, అసలు తన దృష్టిలో అతడు ఆల్‌రౌండరే కాదంటూ సంజయ్‌ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అదే విధంగా ప్రపంచకప్‌లో భాగంగా శ్రీలంక మ్యాచ్‌లో మెండీస్‌ వికెట్‌ పడగొట్టినపుడు కూడా ‘జడేజా స్మార్ట్‌ గల్లీ క్రికెటర్‌’ అని వ్యాఖ్యానించాడు. వీటన్నింటికీ జడేజా కూడా కాస్త ఘాటుగానే సమాధానమిచ్చాడు. చెత్త వాగుడు ఆపితే బాగుంటుంది అంటూ హితవు పలికాడు.

ఇక అప్పటి నుంచి సోషల్‌ మీడియా వేదికగా సంజయ్‌ తీరుపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. తాజాగా మంగళవారం నాటి కీలక సెమీస్‌ మ్యాచ్‌ సందర్భంగా...‘పిచ్‌ పరిస్థితి, భారత్‌పై ప్రత్యర్థి ట్రాక్‌ రికార్డు ఆధారంగా.. సెమీస్‌ మ్యాచ్‌లో బరిలో దిగే నా అంచనా జట్టు ఇదే’ అని 11 మంది ఆటగాళ్ల  జాబితాను ట్వీట్‌ చేశాడు. ఇందులో జడేజా పేరు ప్రస్తావించలేదు. అయితే ఈ ట్వీట్‌కు ముందు న్యూజిలాండ్‌పై భారత స్పిన్నర్ల గణంకాలను పేర్కొంటూ కేదార్‌ జట్టులోకి వస్తాడని, పిచ్‌ టర్న్‌ కాకపోవతే జడేజా ఆడుతాడని అభిప్రాయపడ్డాడు. తీరా తాను ప్రకటించిన జట్టులో జడేజా పేరు లేకపోవడంతో అతని ఫ్యాన్స్‌కు చిర్రెత్తుకొచ్చింది. 

‘పిచ్‌ అంతగా టర్న్‌ అవకపోతే జడేజా ఆడుతాడు. చహల్‌ స్థానంలో కుల్దీప్‌ ఉంటాడు అని చెప్పావు. మరి అకస్మాత్తుగా ఏమైంది. మాట మీద నిలబడే తత్త్వం లేదా? కారణం లేకుండా జడ్డూను విమర్శించడం తప్ప వేరే పని లేదా. ఇది సెమీస్‌ మ్యాచ్‌. కాబట్టి భారత జాతి మొత్తం ఆటగాళ్లందరికీ అండగా ఉంటుంది. నీ ట్రాక్‌ రికార్డు తెలిసిన వారెవరూ నీ మాటలు పట్టించుకోరు. అయినా నువ్వెప్పటికీ మారవు’ అంటూ సంజయ్‌ను ట్రోల్‌ చేస్తున్నారు.

కాగా మంగళవారం మాంచెస్టర్‌లో జరిగిన సెమీస్‌ మ్యాచ్‌లో షమీని పక్కన పెట్టిన టీమిండియా అతడి స్థానంలో భువీని తీసుకున్న సంగతి తెలిసిందే. అదే విధంగా రవీంద్ర జడేజా కూడా జట్టుతో చేరాడు. ఈ క్రమంలో సెమీస్‌ వంటి కీలక మ్యాచ్‌ల్లో లోయర్‌ ఆర్డర్‌ బ్యాటింగ్‌ బలంగా ఉండాలనే ఉద్దేశంతోనే భువీ, జడేజాలను జట్టులోకి తీసుకున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక సెమీస్‌ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మెన్‌ హెన్రీ నికోలస్‌(28)ను జడేజా అద్భుత బంతితో క్లీన్‌బౌల్డ్‌ చేసిన సంగతి తెలిసిందే.

జడేజా బంతికి నికోలస్‌ దిమ్మతిరిగింది

మరిన్ని వార్తలు