విజయ్‌ శంకర్‌కే ఓటేసిన కోహ్లి!

29 Jun, 2019 20:28 IST|Sakshi

బర్మింగ్‌హామ్‌: వన్డే వరల్డ్‌కప్‌లో ఇప్పటివరకూ ఆశించిన స్థాయిలో రాణించడంలో విఫలమై విమర్శలు ఎదుర్కొంటున్న టీమిండియా ఆల్‌ రౌండర్‌ విజయ్‌ శంకర్‌కు అండగా నిలిచాడు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి. ఇప్పటివరకూ విజయ్‌ శంకర్‌ ఆడిన మ్యాచ్‌ల్లో విఫలమైన నేపథ్యంలో అతని స్థానంలో రిషభ్‌ పంత్‌ను వేసుకోవాలంటూ విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రి మ్యాచ్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన కోహ్లి.. విజయ్‌ శంకర్‌ నుంచి భారీ ఇన్నింగ్స్‌ చూసే అవకాశం దగ్గర్లోనే ఉందన్నాడు.  పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయ్‌ శంకర్‌ బౌలింగ్‌లో మెరిసినా అతనిపై విమర్శలు రావడం కొత్తగా అనిపిస్తుందన్నాడు. ఇక అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయ్‌ క్రీజ్‌లో పెద్దగా తడబడలేదని, కాకపోతే షాట్‌ సెలక్షన్‌లో లోపం వల్లే విఫలమయ్యాడని కోహ్లి వెనుకేసుకొచ్చాడు. వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో విజయ్‌ శంకర్‌ ఒక అద్భుతమైన బంతికి వెనుదిరిగాడన్నాడు.

దాంతో అతని బ్యాటింగ్‌లో జట్టు మేనేజ్‌మెంట్‌కు ఎటువంటి లోపాలు కనిపించలేదన్నాడు. ఏవో చిన్న కారణాలతో అతన్ని రిజర్వ్‌ బెంచ్‌కే పరిమితం చేయడం సరికాదన్నాడు. కచ్చితంగా విజయ్‌ శంకర్‌ నుంచి ఒక పెద్ద ఇన్నింగ్స్‌ చూస్తామనడంలో సందేహం లేదన్నాడు. వరుస విజయాలు సాధిస్తున్న సమయంలో తుది జట్టును మార్చడం అంత మంచి పద్ధతి కాదన్నాడు. అకాగా, ఆదివారం ఇంగ్లండ్‌తో పోరుకు సిద్ధమవుతున్న క్రమంలో విజయ్‌ శంకర్‌ తుది జట్టులో ఉంటాడని కోహ్లి సంకేతాలిచ్చాడు. దే సమయంలో వరల్డ్‌కప్‌లో తొలి మ్యాచ్‌ ఆడటం కోసం​ ఎదురుచూస్తున్న రిషబ్‌ పంత్‌ నిరీక్షించక తప్పదనే విషయం కోహ్లి చెప్పకనే చెప్పేశాడు.


 

మరిన్ని వార్తలు