తిరిగొస్తా.. గాయంపై శిఖర్‌ ధావన్‌ 

12 Jun, 2019 14:30 IST|Sakshi

లండన్ : గాయాలు తననేం చేయలేవని, తాను ఏం చేయాలనుకున్నానో అది చేస్తానని టీమిండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ స్పష్టం చేశాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌ సందర్భంగా ధావన్‌ ఎడమ బొటనవేలికి గాయమైన విషయం తెలిసిందే. ఆ గాయంతోనే శతకం బాదిన గబ్బర్‌కు మ్యాచ్‌ అనంతరం స్కానింగ్‌ నిర్వహించగా ‘హెయిర్‌లైన్‌ ఫ్రాక్చర్‌’గా తేలింది. అతని ఎడమ చేతి బొటనవేలు, చూపుడు వేలు మధ్యభాగంలో వెనుకవైపు గాయమైంది.  పూర్తిస్థాయి ఇతర పరీక్షల ఫలితాలు రాకపోవడంతో గాయం తీవ్రత ఎంత, ఎన్ని రోజుల్లో తగ్గవచ్చనే దానిపై స్పష్టత లేకపోయినా...తర్వాతి రెండు మ్యాచ్‌లలో అతను బరిలోకి దిగడని మాత్రం ఖాయమైపోయింది. అయితే ఈ గాయాలు తన పనిని అడ్డుకోలేవని డాక్టర్ రాహత్‌ ఇండోర్ Kabhi mehek ki tarah hum gulon se udte hain పద్యం ద్వారా తెలిపాడు. గాయం నుంచి కోలుకొని మైదానంలోకి అడుగుపెడ్తాననే తన ఉద్దేశాన్ని వెల్లడించాడు. గాయానికి సంబంధించిన ఫొటోలకు ఈ పద్యాన్ని క్యాప్షన్‌గా పేర్కొంటూ ట్వీట్‌ చేశాడు. ఈ ట్వీట్‌కు ముగ్దులైన భారత అభిమానులు.. గబ్బర్‌ను ఆకాశానికెత్తుతున్నారు. గాయమైనా సెంచరీ చేసిన హీరో అంటూ కొనియాడుతున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కామెంట్‌ చేస్తున్నారు. 

ఇక ధావన్‌కు బ్యాకప్‌గా రిషభ్‌ పంత్‌ ఇంగ్లండ్‌ బయలు దేరాడు. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికి విశ్వసనీయ సమాచారం మేరకు అతను ఈ రోజు జట్టులో చేరాడు. భారత జట్టు ఫిజియో ప్యాట్రిక్‌ ఫర్‌హర్ట్‌ కూడా ధావన్‌తో పాటు ఉండి ప్రత్యేక వైద్యులతో చర్చిస్తున్నాడు. గాయం ప్రమాదకరమైంది కాకుండా రెండు మ్యాచ్‌ల తర్వాతే అతను తిరిగొస్తే సమస్యే లేదు. అలా కాకుండా దురదృష్టవశాత్తూ ధావన్‌ దూరమైతే పంత్‌ సేవలు వినియోగించుకోవాలని భావిస్తోంది.

చదవండి : అయ్యో ధావన్‌..!

మరిన్ని వార్తలు