'స్వర్ణ' శ్రేయసి..

12 Apr, 2018 01:34 IST|Sakshi
శ్రేయసి సింగ్‌

మహిళల డబుల్‌ ట్రాప్‌లో పసిడి పతకం నెగ్గిన భారత షూటర్‌

ఓంప్రకాశ్, అంకుర్‌ మిట్టల్‌లకు కాంస్యాలు

మరోసారి భారత షూటర్లు కచ్చితమైన గురితో అదరగొట్టారు. కామన్వెల్త్‌ గేమ్స్‌ షూటింగ్‌ ఈవెంట్‌లో మరో మూడు పతకాలు అందించారు. మహిళల డబుల్‌ ట్రాప్‌లో శ్రేయసి సింగ్‌ ‘షూట్‌ ఆఫ్‌’లో స్వర్ణం ఖాయం చేసుకోగా... పురుషుల 50 మీటర్ల పిస్టల్‌ విభాగంలో ఓంప్రకాశ్‌ మితర్వాల్‌... డబుల్‌ ట్రాప్‌ విభాగంలో అంకుర్‌ మిట్టల్‌ మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు. దాంతో ఏడో రోజు పోటీలు ముగిశాక భారత్‌ 12 స్వర్ణాలు, 4 రజతాలు, 8 కాంస్యాలతో కలిపి మొత్తం 24 పతకాలతో మూడో స్థానంలో కొనసాగుతోంది.  

గోల్డ్‌కోస్ట్‌: నాలుగేళ్ల క్రితం గ్లాస్గో కామన్వెల్త్‌ గేమ్స్‌లో నెగ్గిన 14 స్వర్ణాల సంఖ్యను గోల్డ్‌కోస్ట్‌లో ఈసారి భారత క్రీడాకారులు అధిగమించడం ఖాయమైంది. పోటీల తొలి రోజు మొదలైన పసిడి వేటను ఏడో రోజూ భారత క్రీడాకారులు కొనసాగించారు. తమపై పెట్టుకున్న అంచనాలు నిజం చేస్తూ మళ్లీ భారత షూటర్లు రాణించి మూడు పతకాలు సాధించారు. మహిళల డబుల్‌ ట్రాప్‌ ఈవెంట్‌లో ఢిల్లీకి చెందిన 26 ఏళ్ల శ్రేయసి సింగ్‌ విజేతగా నిలిచి పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. ఫైనల్లో నిర్ణీత 120 షాట్‌ల తర్వాత శ్రేయసి సింగ్, ఎమ్మా కాక్స్‌ (ఆస్ట్రేలియా) 96 పాయింట్లతో సమఉజ్జీగా నిలిచారు. విజేతను నిర్ణయించడానికి ‘షూట్‌ ఆఫ్‌’ను నిర్వహించారు. శ్రేయసి రెండు పాయింట్లు సాధించి స్వర్ణం ఖాయం చేసుకోగా... ఎమ్మా కాక్స్‌ ఒక పాయింటే స్కోరు చేసి రజతంతో సరిపెట్టుకుంది.

‘2014 గ్లాస్కో గేమ్స్‌లో రజతం లభించాక చాలా నిరాశకు లోనయ్యాను. ఈసారి కూడా ఫైనల్లో వెనుకబడటంతో స్వర్ణంపై ఆశలు వదులుకున్నాను. అయితే షూట్‌ ఆఫ్‌ రూపంలో స్వర్ణం నెగ్గే మరో అవకాశం రావడంతో దానిని సద్వినియోగం చేసుకున్నాను. ఈసారి ప్రదర్శనతో పూర్తి సంతృప్తిగా ఉన్నాను. ఈ స్వర్ణం నా కెరీర్‌లో మైలురాయి లాంటిది’ అని శ్రేయసి వ్యాఖ్యానించింది. పురుషుల 50 మీటర్ల పిస్టల్‌ ఈవెంట్‌లో ఫేవరెట్‌ జీతూ రాయ్‌ 105 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో నిలువగా... ఓంప్రకాశ్‌ 201.1 పాయింట్లు సాధించి కాంస్య పతకాన్ని గెల్చుకున్నాడు. పురుషుల డబుల్‌ ట్రాప్‌ ఫైనల్లో అంకుర్‌ మిట్టల్‌ 53 పాయింట్లతో కాంస్య పతకాన్ని సంపాదించాడు. భారత్‌కే చెందిన అసబ్‌ 43 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచాడు. 

అంకుర్‌ మిట్టల్‌ ,ఓంప్రకాశ్‌

మరిన్ని వార్తలు