ఆర్సీబీని తిడితే చంపేస్తా!

5 Apr, 2019 10:11 IST|Sakshi
డౌల్‌ సిమన్‌

కామెంటేటర్‌ను హెచ్చిరిస్తూ అభిమాని పోస్ట్‌

చిల్‌ బ్రో.. అని సమాధానమిచ్చిన వ్యాఖ్యాత

బెంగళూరు : రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్సీబీ) వరుస ఓటములతో ఆ జట్టు అభిమానులు అసహనం తారాస్థాయికి చేరింది. ఇప్పటికే కొందరు అభిమానులు ఆర్సీబీ అభిమానులుగా తట్టుకోలేకపోతున్నామని ట్రోలింగ్‌కు సిద్దపడగా.. మరికొందరు జట్టు కెప్టెన్‌నే మార్చాలని డిమాండ్‌ చేశారు. తాజాగా ఓ వీరాభిమాని అయితే కామెంటేటర్‌ను చంపుతాననే హెచ్చరించాడు. న్యూజిలాండ్‌ బౌలర్‌, ప్రముఖ కామెంటేటర్‌ సిమన్‌ డౌల్‌ ఆర్సీబీ ఆటతీరుపై విమర్శలు గుప్పించాడు. దీన్ని తట్టుకోలేకపోయిన ఓ అభిమాని ఆర్సీబీని విమర్శిస్తే చంపుతానని హెచ్చరిస్తూ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశాడు. ‘ఇతరుల గురించి మాట అనే ముందు ఒకసారి ఆలోచించు. ఆర్సీబీ వారి పరాజాయాన్ని అంగీకరించింది. మళ్లీ ఎప్పుడూ ఆర్సీబీని కామెంట్‌ చేయకు. కాదని విమర్శించావో చచ్చిపోతావు.’ అని పోస్ట్‌లో పేర్కొన్నాడు.

అయితే ఈ పోస్ట్‌పై సిమన్‌ డౌల్‌ స్పందించాడు. దీనికి సంబంధించిన స్క్రీన్‌ షాట్‌ను ట్విటర్‌లో షేర్‌ చేస్తూ.. ‘ఇది ఒక ఆట మాత్రమే. చిల్‌ ఔట్‌ బ్రో’ అంటూ సమాధానం ఇచ్చాడు. చాలా మంది చిన్న చిన్న విషయాలకు స్పందించవద్దని సిమన్‌ డౌల్‌కు సూచించడంతో అతను ఈ ట్వీట్‌ను తొలగించాడు. అయితే ఆ ఆర్సీబీ ఫ్యాన్‌.. డౌల్‌ ఏమన్నాడో చెప్పనప్పటికీ.. ఆర్సీబీపై వచ్చే విమర్శలు, ట్రోలింగ్‌ను తట్టుకోలేక ఈ పోస్ట్‌ పెట్టినట్లు తెలుస్తోంది. ఇక ఆర్సీబీ ఈ సీజన్‌లో ఆడిన 4 మ్యాచ్‌లు ఓడి గడ్డుకాలం ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.   

మరిన్ని వార్తలు