బ్రాడ్‌మన్‌ తర్వాత స్మిత్‌!

20 Dec, 2017 00:24 IST|Sakshi

ర్యాంకుల రేటింగ్స్‌లో ఆసీస్‌ కెప్టెన్‌దే రెండో స్థానం 

దుబాయ్‌: డాన్‌ బ్రాడ్‌మన్‌. దివంగత ఆస్ట్రేలియన్‌ దిగ్గజం. బ్యాటింగ్‌లో అయినా... రేటింగ్స్‌లో అయినా ఆయన తర్వాతే ఎవరైనా. కానీ ఇప్పుడు మాత్రం ఆసీస్‌ కెప్టెన్‌ స్టీవెన్‌ స్మిత్‌ రేటింగ్స్‌లో దూసుకెళ్తున్నాడు. తాజాగా ఐసీసీ విడుదల చేసిన టెస్ట్‌ బ్యాట్స్‌మెన్‌ ర్యాంకింగ్స్‌లో 945 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అత్యధిక రేటిం గ్‌ పాయింట్ల జాబితాలో అలనాటి దిగ్గజం తర్వాతి స్థానం స్మిత్‌దే కావడం విశేషం. ప్రస్తుత యాషెస్‌ సిరీస్‌లో అసాధారణ బ్యాటింగ్‌తో చెలరేగిన స్మిత్‌ ఆసీస్‌ను మరో రెండు మ్యాచ్‌లుండగానే విజేతగా నిలిపాడు. తాజా రేటింగ్‌ పాయింట్లతో అతను ఆల్‌టైమ్‌ గ్రే‘టెస్ట్‌’ బ్యాట్స్‌మెన్‌ జాబితాలో చేరిపోయాడు. ఇంగ్లండ్‌ గ్రేట్‌ లెన్‌ హటన్‌ (945) రికార్డును సమం చేసిన 28 ఏళ్ల స్మిత్‌... ఆస్ట్రేలియన్‌ ‘డాన్‌’కు కేవలం 16 పాయింట్ల దూరంలోనే ఉన్నాడు.

బ్రాడ్‌మన్‌ 961 పాయింట్లతో ఎవరూ చేరనంత ఎత్తులో ఉండగా... ఇప్పుడు స్మిత్‌ సెంచరీ, డబుల్‌ సెంచరీలతో ఆ పీఠం చేరేందుకు అడుగులు వేస్తున్నాడు. సగటుల్లోనూ స్మిత్‌ (62.32) బ్రాడ్‌మన్‌ (99.94) తర్వాతి స్థానంలో ఉన్నప్పటికీ నూటికి చేరువగా ఉన్న ఆ దిగ్గజాన్ని అందుకోవడం కష్టమే! అయితే సెంచరీల్లో మాత్రం యథేచ్చగా దూసుకెళ్తున్నాడు. కెరీర్‌లో 59 టెస్టుల్లో 22 సెంచరీలు చేసిన స్మిత్‌... ఇందులో కెప్టెనయ్యాక చేసినవే 14 ఉన్నాయి. సారథిగా 29 టెస్టుల్లోనే ఈ 14 సెంచరీలు చేయడం విశేషం.  

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు