కాలి మెట్టెను నుదుట ధరించి...

8 Apr, 2018 01:36 IST|Sakshi

రెండేళ్ల క్రితం 19 ఏళ్ల ఆ కుర్రాడు రియో ఒలింపిక్స్‌ ట్రయల్స్‌ కోసం సన్నద్ధమవుతున్నాడు. అంతలో అమ్మ చనిపోయిందంటూ ఇంటినుంచి విషాద వార్త. ఆ దశలో అతను ఆటపై మనసును లగ్నం చేయలేకపోయాడు. ఫలితంగా ఒలింపిక్స్‌ అవకాశాలు దూరం! అయితే అలాంటి సమయంలోనూ ప్రపంచ వేదికపై పతకం గెలుస్తానంటూ అతను గతంలో అమ్మకు ఇచ్చిన మాటను మరచిపోలేదు. అందుకే తన లక్ష్యాన్ని నిరంతరం గుర్తుకు తెచ్చేలా అమ్మ జ్ఞాపకాలను తనతోనే ఉంచుకున్నాడు. ఆమె కాలి మెట్టెని తన నుదుటన పట్టీలా కట్టి పోటీల్లోకి అడుగు పెట్టాడు. దివి నుంచి అమ్మ ఆశీర్వాదంతో స్వర్ణం సాధించి ఆమెకు అంకితం ఇచ్చాడు.

ఇది సినిమాల్లో కనిపించే నాటకీయ సన్నివేశం కాదు... కష్టాలకు ఎదురొడ్డి విజేతగా నిలిచిన ఒక యువ ఆటగాడి వాస్తవ కథ. మన తెలుగు కుర్రాడు రాగాల వెంకట రాహుల్‌ విజయగాథ. బరువులెత్తే క్రమంలో సమస్యల భారాన్ని కూడా ఎత్తి పడేసిన ఈ వెయిట్‌లిఫ్టర్‌ నేడు సగర్వంగా కామన్వెల్త్‌ వేదికపై భారత జాతీయ గీతాన్ని వినిపించాడు. ఎన్నో ఏళ్లుగా తన ఊరు ‘స్టువర్ట్‌పురం’కు ఉన్న ఇమేజీని తుడిచేసే విధంగా కొత్త ‘బ్రాండ్‌’గా అతను తయారయ్యాడు.  యూత్, జూనియర్‌ స్థాయిల్లో విజయాలతో తన విలువేమిటో చూపించిన రాహుల్, ఇప్పుడు సరైన సమయంలో సరైన వేదికపై సత్తా చాటి భవిష్యత్తు తారగా అందరి దృష్టినీ ఆకర్షించాడు. 

సాక్షి క్రీడా విభాగం : కామన్వెల్త్‌ క్రీడల్లో రాహుల్‌ విజయం అనూహ్యమేమీ కాదు. గత ఏడాది ఇదే గోల్డ్‌కోస్ట్‌ వేదికగా జరిగిన కామన్వెల్త్‌ చాంపియన్‌షిప్‌లో కూడా అతను అగ్రస్థానంలో నిలిచాడు. అంతకుముందు రెండేళ్ల క్రితం ఇదే ఈవెంట్‌లో రజతం కూడా సాధించాడు. జూనియర్‌ స్థాయి విజయాలతో వేగంగా దూసుకుపోయిన తర్వాత జాతీయ సీనియర్‌ శిక్షణా శిబిరంలో చేరడంతో రాహుల్‌ ఆట మారిపోయింది. మున్ముందు ఒలింపిక్స్‌లో కూడా పతకం సాధించే అవకాశాలు ఉన్న మన లిఫ్టర్ల జాబితాలో రాహుల్‌ ఎప్పటి నుంచో ఉన్నాడు. ఇప్పుడు కామన్వెల్త్‌ పతకం అందులో తొలి అడుగు. ఎలాంటి హంగూ ఆర్భాటాలు, అండా దండా లేకుండా కేవలం తన శ్రమను, పట్టుదలను మాత్రమే నమ్ముకొని అతను ఈ స్థాయికి చేరడం విశేషం.  

సానబెట్టిన స్పోర్ట్స్‌ స్కూల్‌... 
గిరిజన కుటుంబం... సొంత ఊరి వాతావరణం చూస్తే ఎప్పుడైనా కుర్రాళ్లు దారి తప్పే ప్రమాదం... ఇలాంటి స్థితిలో క్రీడలు తమకు కొత్త దారి చూపిస్తాయని రాహుల్‌ తండ్రి మధు నమ్మారు. అందుకే అతడిని ఆటగాడిగా తీర్చిదిద్దేందుకు సర్వస్వం ధారబోశారు. యూనివర్సిటీ స్థాయి వరకు క్రీడల్లో పాల్గొన్న మధు తన కొడుకును హైదరాబాద్‌లోని ఏపీ స్పోర్ట్స్‌ స్కూల్‌లో చేర్చాలని ప్రయత్నించగా రాహుల్‌ ప్రవేశ పరీక్షలో విఫలమయ్యాడు. అయితే అప్పటికే తండ్రి నేర్పించిన ఆటతో రాష్ట్ర స్థాయిలో చక్కటి ప్రదర్శన చేసిన రాహుల్‌కు స్పోర్ట్స్‌ స్కూల్‌ కోచ్‌ మాణిక్యాల రావు నేరుగా స్కూల్‌లో ప్రవేశం కల్పించారు. ఇక అప్పటినుంచి రాహుల్‌ ఆటకు ఎదురు లేకుండా పోయింది. స్కూల్‌ శిక్షణలో అతను అద్భుతంగా ఎదిగాడు. స్కూల్‌గేమ్స్‌ నుంచి మొదలు పెడితే జాతీయ సబ్‌ జూనియర్, జూనియర్, యూత్, సీనియర్‌... ఇలా ప్రతీ చోటా అతను విజయాలు అందుకున్నాడు. వరుసగా ఆరు సార్లు జాతీయ జూనియర్‌ చాంపియన్‌గా నిలిచిన తర్వాత 2012లో జూనియర్‌/యూత్‌ కామన్వెల్త్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణంతో అతని అంతర్జాతీయ పతకాల బోణీ మొదలైంది.  

వెంటాడిన సమస్యలు... 
స్పోర్ట్స్‌ స్కూల్‌లో చదువు ముగిసిన తర్వాత రాహుల్‌కు ఆట కొనసాగించడంలో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. తీవ్రమైన ఆర్థిక సమస్యలతో పాటు సరైన సౌకర్యాలు, మార్గనిర్దేశనం లేక ఆటను మధ్యలోనే ఆపేసే పరిస్థితి వచ్చింది. వెయిట్‌లిఫ్టింగ్‌ కిట్‌ కోసం తండ్రి మధు ఎంత మందిని కలిసినా స్పందన లభించలేదు. ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి సహకారం లభించలేదు. పాత ఎక్విప్‌మెంట్‌తోనే తండ్రి శిక్షణను కొనసాగించారు. సరైన డైట్‌ కోసం, టోర్నీలకు వెళ్లేందుకు సొంత డబ్బులు ఖర్చు చేయాల్సి వచ్చినా ఆయన వెనుకంజ వేయలేదు. ఈ క్రమంలో తన రెండెకరాల పొలం, ఇల్లు కూడా మధు అమ్ముకున్నారు. పాటియాలాలోని ఎన్‌ఐఎస్‌లో చేరిన తర్వాత మాత్రమే పరిస్థితి మెరుగైంది. ఆ తర్వాత రైల్వేస్‌లో రాహుల్‌కు ఉద్యోగం రావడం కూడా అతని ఆర్థిక సమస్యలను కాస్త దూరం చేసింది. ‘కామన్వెల్త్‌లో పతకంతో చాలా గర్వంగా ఉంది. ఇలాంటి రోజు కోసమే ఎన్నో ఏళ్లుగా మేం కష్టపడ్డాం. భవిష్యత్తులో రాహుల్‌ దేశం తరఫున మరిన్ని విజయాలు సాధిస్తాడు. ఒలింపిక్స్‌లో పతకం గెలుచుకునే రోజు కోసం ఎదురు చూస్తున్నాం’ అని విజయానంతరం మధు ఉద్వేగంగా వ్యాఖ్యానించారు.  

తమ్ముడు, చెల్లి కూడా... 
రాహుల్‌ విజయాలతోనే తండ్రి మధు ఆగిపోలేదు. తన మరో కొడుకు వరుణ్, కూతురు మధుప్రియలను కూడా ఆయన వెయిట్‌ లిఫ్టర్లుగా తీర్చిదిద్దారు. ఇప్పటికే తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న వరుణ్‌ గత ఏడాది కామన్వెల్త్‌ చాంపియన్‌షిప్‌లో 77 కేజీల విభా గంలో స్వర్ణం గెలిచాడు. మున్ముందు అతను కూడా అన్న బాటలో అగ్రస్థాయికి చేరాలని పట్టుదలగా ఉన్నాడు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో పలు పతకాలు గెలుచుకున్న అనంతరం మధుప్రియ ఇప్పుడు చదువుపై దృష్టి పెట్టింది.   

మరిన్ని వార్తలు