మెరిసిన మనీష్‌ పాండే

23 Apr, 2019 21:41 IST|Sakshi

చెన్నై: ఐపీఎల్‌లో భాగంగా ఇక్కడ చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 176 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఒకవైపు డేవిడ్‌ వార్నర్‌(‌(57; 45 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) బాధ్యతాయుతంగా ఆడగా, మనీష్‌ పాండే(83 నాటౌట్‌; 49 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు) తన బ్యాటింగ్‌తో మురిపించడంతో సన్‌రైజర్స్‌ గౌరవప్రదమైన స్కోరు చేసింది.

టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌కు ఆదిలోనే షాక్‌ తగిలింది. ఓపెనర్‌ బెయిర్‌ స్టో పరుగులేమీ చేయకుండా పెవిలియన్‌ చేరాడు. ఆ తరుణంలో డేవిడ్‌ వార్నర్‌-మనీష్‌ పాండేల జోడి స్కోరు బోర్డును చక్కదిద్దింది. ఈ ఇద్దరూ 115 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును పటిష్ట స్థితికి చేర్చారు. ఈ క్రమంలోనే ముందుగా మనీష్‌ పాండే హాఫ్‌ సెంచరీ సాధించగా, కాసేపటికి వార్నర్‌ కూడా అర్థ శతకం నమోదు చేశాడు.  మనీష్‌ పాండే దూకుడుగా ఆడుతూ జట్టు స్కోరును పరుగులు పెట్టించాడు. అయితే జట్టు స్కోరు 120 పరుగుల వద్ద వార్నర్‌ రెండో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. అటు తర్వాత మనీష్‌ పాండేతో జత కలిసిన విజయ్‌ శంకర్‌(26; 20 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్‌) ఫర్వాలేదనిపించాడు. ఇక చివరి ఓవర్లలో చెన్నై కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో సన్‌రైజర్స్‌ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో హర్భజన్‌ రెండు వికెట్లు సాధించగా, దీపక్‌ చాహర్‌ వికెట్‌ తీశాడు.

మరిన్ని వార్తలు