శ్రీలంకను గెలిపించిన ‘పెరీరా’లు

28 Jun, 2018 04:57 IST|Sakshi

బ్రిడ్జ్‌టౌన్‌: వెస్టిండీస్‌ పర్యటనలో శ్రీలంక జట్టుకు ఎట్టకేలకు ఊరట లభించింది. తొలి టెస్టులో భారీ పరాజయం... రెండో మ్యాచ్‌లో బాల్‌ ట్యాంపరింగ్‌ వివాదం అనంతరం కీలకంగా మారిన మూడో టెస్టులో ఆ జట్టు నాలుగు వికెట్ల తేడాతో  విజయం సాధించింది. ఫలితంగా సిరీస్‌ను 1–1తో ‘డ్రా’గా ముగించింది. ఈ డే నైట్‌ టెస్టులో 144 పరుగుల లక్ష్యాన్ని లంక 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓవర్‌నైట్‌ స్కోరు 81/5తో మంగళవారం బరిలోకి దిగిన లంక ఒక వికెట్‌ కోల్పోయి మిగిలిన 63 పరుగులను సాధించింది.

నాలుగో రోజు తొలి ఓవర్లోనే కుశాల్‌ మెండిస్‌ (25)ను ఔట్‌ చేసి విండీస్‌ విజయంపై ఆశలు పెంచుకుంది. అయితే కుషాల్‌ పెరీరా (43 బంతుల్లో 28 నాటౌట్‌; 2 ఫోర్లు), దిల్‌రువాన్‌ పెరీరా (68 బంతుల్లో 23 నాటౌట్‌; 3 ఫోర్లు) కలిసి లంకను గెలిపించారు. వీరిద్దరు ఏడో వికెట్‌కు అభేద్యంగా 63 పరుగులు జోడించారు. వెస్టిండీస్‌లో అత్యంత ప్రతిష్టాత్మక మైదానంగా గుర్తింపు ఉన్న బార్బడోస్‌లోని కెన్సింగ్‌టన్‌ ఓవల్‌లో 1930 నుంచి ఇప్పటి వరకు 53 టెస్టులు జరగ్గా... ఒక ఉపఖండపు జట్టు టెస్టు గెలవడం ఇదే మొదటిసారి కావడం విశేషం.

మరిన్ని వార్తలు