CWC 2023: గర్వపడుతున్నా.. క్రికెట్‌ ప్రపంచానికి మంచి సందేశం ఇచ్చాం.. ఇకపై: అఫ్గన్ కెప్టెన్‌

11 Nov, 2023 08:47 IST|Sakshi

ICC WC 2023- Afghanistan: వన్డే వరల్డ్‌కప్‌-2023లో తమ జట్టు ప్రదర్శన పట్ల అఫ్గనిస్తాన్‌ కెప్టెన్‌ హష్మతుల్లా షాహిది సంతోషం వ్యక్తం చేశాడు. ప్రతి మ్యాచ్‌లోనూ ఆఖరి దాకా పట్టుదలగా పోరాడిన తీరు అద్భుతమని ఆటగాళ్లను కొనియాడాడు. మెగా టోర్నీలో భాగం కావడం వల్ల ఎన్నో పాఠాలు నేర్చుకున్నామని.. తమ భవిష్యత్తుకు అవెంతో ఉపయోగపడతాయని పేర్కొన్నాడు.

భారత్‌ వేదికగా ప్రపంచకప్‌-2023లో ఆరంభంలో పరాజయాలు చవిచూసిన అఫ్గనిస్తాన్‌ డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇంగ్లండ్‌ను ఓడించి సంచలన విజయం అందుకుంది. ఆ తర్వాత పాకిస్తాన్‌పై గెలిచి చరిత్ర సృష్టించిన అఫ్గన్‌.. అనంతరం శ్రీలంక, నెదర్లాండ్స్‌ జట్లపై గెలిచింది.

తొలిసారి చాంపియన్స్‌ ట్రోఫీకి అర్హత
ఈ నేపథ్యంలో నాలుగు విజయాలతో ఎనిమిది పాయింట్లు ఖాతాలో వేసుకున్న హష్మతుల్లా బృందం.. బంగ్లాదేశ్‌- శ్రీలంక మ్యాచ్‌ ఫలితం తర్వాత చాంపియన్‌ ట్రోఫీ-2025 బెర్తును ఖరారు చేసుకుంది. ఈ క్రమంలో సెమీస్‌ రేసులో నిలిచిన అఫ్గనిస్తాన్‌.. లీగ్‌ దశలో తమ ఆఖరి మ్యాచ్‌లో సౌతాఫ్రికాతో తలపడింది.

అహ్మదాబాద్‌ వేదికగా శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన అఫ్గనిస్తాన్‌ తొలుత బ్యాటింగ్‌ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 244 పరుగులు సాధించింది. అయితే, సౌతాఫ్రికా బ్యాటర్‌ రాసీ వాన్‌డెర్‌ డసెన్‌ అద్భుత ఇన్నింగ్స్‌  కారణంగా ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది. 

A post shared by ICC (@icc)

వాళ్లు అద్భుతం
దీంతో పరాజయంతో ప్రపంచకప్‌ టోర్నీని ముగించింది. అయితే, ఇంతవరకు వరల్డ్‌కప్‌ చరిత్రలో తమకు సాధ్యం కాని విషయాలెన్నో ఈసారి చేసి చూపించింది అఫ్గనిస్తాన్‌ జట్టు. ముఖ్యంగా యువ ఓపెనర్‌ ఇబ్రహీం జద్రాన్‌ తొలిసారిగా వరల్డ్‌కప్‌లో అఫ్గన్‌ తరఫున సెంచరీ చేసి సత్తా చాటాడు.

మరోవైపు.. బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ అజ్మతుల్లా ఒమర్జాయ్‌ సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో 97(నాటౌట్‌) పరుగులు చేయడం విశేషం. ఇక జట్టును ముందుండి నడిపించిన కెప్టెన్‌ హష్మతుల్లా షాహిది బ్యాటర్‌గానూ రాణించాడు. టోర్నీలో మొత్తంలో 310 పరుగులు సాధించాడు.

లోపాలు, బలహీనతలపై చర్చించాం
ఈ నేపథ్యంలో ఐసీసీ ఈవెంట్లో తమ ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేసిన హష్మతుల్లా.. ‘‘టోర్నీ ఆసాంతం మా బ్యాటర్లు ఆడిన తీరు పట్ల నాకు గర్వంగా ఉంది. ఆరంభంలో గెలుపు కోసం అష్టకష్టాలు పడాల్సి వచ్చింది.

అయితే, లోపం ఎక్కడుంది.. మా బలహీనతలు ఏమిటన్న అంశంపై అందరం కూర్చుని చర్చించాం. దాని ఫలితమే ఈ విజయాలు. ఈ టోర్నీలో రాణించడం మాకు సానుకూలాంశం. మా స్పిన్‌ విభాగం పటిష్టమైందని అందరికీ తెలుసు. ఇప్పుడు బ్యాటర్లు కూడా మెరుగ్గా ఆడటం మరింత ఉత్సాహాన్నిస్తోంది. 

అదొక్కటే షాకింగ్‌
ఈ టోర్నీ ద్వారా మేము పెద్ద జట్లపై కూడా గెలవగలమని.. గెలుపు కోసం ఆఖరి వరకు పోరాడగలమనే సందేశాన్ని క్రికెట్‌ ప్రపంచానికి అందించాం. అయితే, ఆస్ట్రేలియా విషయంలో ఆఖరి వరకు మ్యాచ్‌ మా చేతిలో ఉన్నా అనూహ్య రీతిలో చేజారిపోయింది. 

అదొక్కటే మాకు ఇప్పటికీ షాకింగ్‌గా ఉంది అని పేర్కొన్నాడు. కాగా ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో అఫ్గన్‌ విజయంపై ధీమాగా ఉన్న తరుణంలో.. ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ అజేయ ద్విశతకంతో ఆసీస్‌ను గెలుపు తీరాలకు చేర్చాడు. దీంతో అఫ్గనిస్తాన్‌ సెమీస్‌ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించగా.. సౌతాఫ్రికా చేతిలో ఓటమితో ఇంటిబాట పట్టింది.

చదవండి: ICC: శ్రీలంక క్రికెట్‌ బోర్డుకు భారీ షాకిచ్చిన ఐసీసీ.. జింబాబ్వే తర్వాత..

A post shared by ICC (@icc)

మరిన్ని వార్తలు