'ఐదు సార్లు వదిలేస్తే సెంచరీ సాధించా'

16 Jun, 2020 08:32 IST|Sakshi

మెల్‌బోర్న్‌ : భారత్‌తో 2016–17 సిరీస్‌లో భాగంగా పుణేలో జరిగిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో స్టీవ్‌ స్మిత్‌   అద్భుత సెంచరీ (109) సాధించాడు. స్పిన్‌కు భీకరంగా అనుకూలిస్తూ బంతి గిరగిరా తిరిగిన పిచ్‌పై మన ఆటగాళ్లు రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి ఒకే ఒక అర్ధ సెంచరీ నమోదు చేశారు. ఇలాంటి చోట స్మిత్‌ సాధించిన శతకం భారత గడ్డపై విదేశీ ఆటగాళ్లు చేసిన అత్యుత్తమ ప్రదర్శనల్లో ఒకటిగా నిలిచిపోయింది. ఆసీస్‌ 333 పరుగులతో గెలిచిన ఈ మ్యాచ్‌లో తన ఇన్నింగ్స్‌ గురించి స్మిత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దాని గొప్పతనం గురించి చెప్పమంటే జారవిడిచిన క్యాచ్‌లే కారణమని వెల్లడించాడు.

‘అదృష్టం కలిసొచ్చింది. నేను ఇచ్చిన క్యాచ్‌లను భారత ఆటగాళ్లు ఐదు సార్లు వదిలేశారు. అంటే ఒక్కోదానికి లెక్క వేసుకుంటే ఐదు సార్లు 20 పరుగుల చొప్పున చేశానంతే’ అని స్మిత్‌ ఇన్‌స్టాగ్రామ్‌ చాట్‌లో అభిమానికి బదులిచ్చాడు. ఈ చాట్‌లో భారత క్రికెటర్ల గురించి కూడా అతను తన అభిప్రాయాలు వెల్లడించాడు. ప్రస్తుత ప్రపంచ క్రికెట్‌లో రవీంద్ర జడేజా అత్యుత్తమ ఫీల్డర్‌ అని స్మిత్‌ ప్రశంసించాడు. కేఎల్‌ రాహుల్‌ ఆట తనకు బాగా నచ్చుతుందన్న ఈ స్టార్‌ బ్యాట్స్‌మన్, పాక్‌ బౌలర్‌ మొహమ్మద్‌ ఆమిర్‌ను ఎదుర్కోవడంలో తాను ఇబ్బంది పడతానని వెల్లడించాడు. ధోనిని దిగ్గజంగా అభివర్ణించిన స్మిత్‌... కోహ్లిని ‘ఒక అద్భుతం’గా ప్రశంసించాడు. ఈ ఏడాది చివర్లో సొంతగడ్డపై భారత్‌తో జరిగే సిరీస్‌ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని ఈ వరల్డ్‌ నంబర్‌వన్‌ బ్యాట్స్‌మన్‌ అన్నాడు.    

మరిన్ని వార్తలు