సొంతగడ్డపై బోణీ కొట్టేనా!

29 Mar, 2019 16:04 IST|Sakshi

రెండో మ్యాచ్‌కు సిద్ధమైన సన్‌రైజర్స్‌  

నేడు రాజస్తాన్‌ రాయల్స్‌తో పోరు

 ఉప్పల్‌లో అభిమానులకు జోష్‌  

సాక్షి, హైదరాబాద్‌: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ గెలుపు బాట పట్టేందుకు సొంతగడ్డపై సమరానికి సిద్ధమైంది. ఐపీఎల్‌–12లో శుక్రవారం జరిగే పోరులో హైదరాబాద్‌ జట్టు... రాజస్తాన్‌ రాయల్స్‌తో తలపడుతుంది. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ స్టేడియం ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధమైంది. కోల్‌కతాలో ఆడిన మొదటి మ్యాచ్‌లో నైట్‌రైడర్స్‌పై భారీ స్కోరు చేసినా రైజర్స్‌ ఫలితం సాధించలేకపోయింది. మరోవైపు రాజస్తాన్‌ ‘మన్కడింగ్‌’ మాయలో పంజాబ్‌తో మ్యాచ్‌ను కోల్పోయింది. ఇప్పుడు ఇరు జట్లు బోణీ కొట్టాలనే లక్ష్యంతోనే బరిలోకి దిగుతున్నాయి. సొంత ప్రేక్షకుల మధ్య మ్యాచ్‌ జరుగనుండటంతో హైదరాబాదీల మద్దతుతో సన్‌రైజర్సే ఫేవరెట్‌గా కనబడుతోంది. పైగా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ ఫామ్‌లో ఉన్నాడు. నైట్‌రైడర్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో అదరగొట్టాడు. మరో ఓపెనర్‌ బెయిర్‌ స్టో కూడా రాణించాడు. ఈ ఓపెనింగ్‌ జోడీ వంద పైచిలుకు పరుగులు జోడించింది. విజయ్‌ శంకర్‌ భారీ షాట్లతో అలరించాడు. దీంతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బ్యాటింగ్‌ లైనప్‌ పటిష్టంగా ఉంది. నైట్‌రైడర్స్‌ ఏడుగురు బౌలర్లను బరిలోకి దించినా ఈ టాపార్డర్‌ను ఏమీ చేయలేకపోయింది. గాయం నుంచి కోలుకున్న కేన్‌ విలియమ్సన్‌ ఈ మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చాడు. దీంతో టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఆల్‌రౌండర్‌ షకీబుల్‌ హసన్‌ను తప్పించే అవకాశాలున్నాయి.  

బౌలింగే రైజ్‌ కావాలి...

గత మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్‌ బాగా ఆడారు. బౌలింగ్‌ వైఫల్యంతోనే హైదరాబాద్‌ మ్యాచ్‌ను చేజార్చుకుంది. ప్రధాన పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ సహా సిద్ధార్థ్‌ కౌల్, సందీప్‌ శర్మ అందరు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. స్పిన్‌ సంచలనం రషీద్‌ ఖాన్‌ ఒక్కడే 6.5 ఎకానమీ రేట్‌ నమోదు చేశాడు. మిగతా వారంతా సగటున 9, 10  చొప్పున పరుగులిచ్చారు. చిత్రంగా ఆ మ్యాచ్‌లో భువీ ఒక్క వికెట్‌ కూడా పడగొట్టలేకపోయాడు... ఇటు పరుగుల్ని కట్టడి చేయలేకపోయాడు. ఇప్పుడు హైదరాబాద్‌ గడ్డపై అతను తన పేస్‌కు పదును పెట్టాల్సిన సమయం వచ్చింది. అలాగే విజయ్‌ శంకర్‌కు బౌలింగ్‌ చేసే అవకాశమివ్వాలి. నైట్‌రైడర్స్‌ పోరులో అతను ఒక్క ఓవర్‌ కూడా వేయలేదు.

సూపర్‌ ఫామ్‌లో బట్లర్‌

గత సీజన్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ తరఫున జోస్‌ బట్లర్‌ అసాధారణ ఇన్నింగ్స్‌లు ఆడాడు. కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో అదే మెరుపు ఫామ్‌ను కొనసాగించాడు. పంజాబ్‌ బౌలర్, కెప్టెన్‌ అశ్విన్‌ ‘మన్కడింగ్‌’తో బట్లర్‌ ఇన్నింగ్స్‌తో పాటు రాయల్స్‌ విజయావకాశాలకూ తెరపడింది. లేదంటే రాజస్తాన్‌కు శుభారంభం దక్కేది. ఆ మ్యాచ్‌లో కెప్టెన్‌ రహానేతో పాటు, సంజూ శామ్సన్‌ మెరుగ్గానే ఆడారు. ఏడాది విరామం తర్వాత బరిలోకి దిగిన స్మిత్‌ వరల్డ్‌కప్‌కు ముందు తనను తాను పరీక్షించుకుంటున్నాడు. తొలి మ్యాచ్‌లో అతను 16 బంతుల్లో 20 పరుగులు చేశాడు.

క్రమంగా తన పరుగుల వేగాన్ని పెంచుకొని మెగాటోర్నీకల్లా పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలనుకుంటున్నాడు. సన్‌రైజర్స్‌లాగే బ్యాటింగ్‌ ఫర్వాలేదనిపించినా... పేలవమైన బౌలింగ్‌ రాజస్తాన్‌ను ఇబ్బంది పెట్టింది. ఆల్‌రౌండర్‌ స్టోక్స్‌ తన నిర్ణీత ఓవర్ల కోట పూర్తి చేసేసరికి 48 పరుగులిచ్చాడు. 2 వికెట్లు తీసినా పరుగుల్ని మాత్రం నిరోధించలేకపోయాడు. జైదేవ్‌ ఉనాద్కట్‌ అయితే 3 ఓవర్లే వేసి 44 పరుగులిచ్చాడు. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్‌ను ఎదుర్కోవాలంటే బౌలర్లు సత్తాచాటాలి.

మరిన్ని వార్తలు