టీమిండియా కొత్త కొత్తగా..

15 Sep, 2019 14:36 IST|Sakshi

ధర్మశాల: దక్షిణాఫ్రికాతో ఆరంభం కానున్న ద్వైపాక్షిక సిరీస్‌లో టీమిండియా కొత్త జెర్సీలో దర్శనమివ్వనుంది. కొన్ని రోజుల క్రితం స్వదేశీ ఆన్‌లైన్‌ ఎడ్యుకేషనల్‌ సంస్థ బైజాస్‌తో ఒప్పందం చేసుకున్న నేపథ్యంలో ఇక నుంచి భారత క్రికెటర్ల జెర్సీలపై కొత్త లోగో పేరు కనిపించనుంది. ఈ రోజు దక్షిణాఫ్రికాతో ప్రారంభమయ్యే తొలి టీ20 నుంచి కొత్త లోగోతో టీమిండియా ఆటగాళ్లు కనిపించనున్నారు. అంతకుముందు దిగ్గజ మొబైల్‌ సంస్థ ఒప్పో.. టీమిండియా స్పాన్సర్‌గా వ్యవహరిస్తే ఇప్పుడు ఆ స్థానంలో బైజూస్‌ వచ్చి చేరింది.  ఒప్పోతో కటీఫ్‌ అనంతరం బైజూస్‌తో ఒప్పందం చేసుకుంది భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు. ఇది 2019, సెప్టెంబర్‌ 5 వ తేదీ నుంచి 2022 మార్చి 31 వరకూ అమల్లో ఉండనుంది.

సఫారీలతో ఈరోజు ఆరంభమయ్యే టీ20 సిరీస్‌లో భాగంగా శనివారం భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మలతో పాటు ప్రధాన కోచ్‌ రవిశాస్త్రిలు బైజూస్‌ లోగో ఉన్న జెర్సీలతో మీడియాకు ఫోజిచ్చారు.ఇటీవల వెస్టిండీస్‌ పర్యటనను దిగ్విజయంగా ముగించిన టీమిండియా.. సఫారీలతో స్వదేశంలో జరుగుతున్న సిరీస్‌లో కూడా అదే ఫామ్‌ను కొనసాగించాలని యోచిస్తోంది. ఇప్పటివరకూ సఫారీలతో స్వదేశీ టీ20 సిరీస్‌ను టీమిండియా చేజిక్కించుకోలేదు. దాంతో ఈ మూడు టీ20ల సిరీస్‌ను గెలుచుకోవాలనే కృతనిశ్చయంతో టీమిండియా బరిలోకి దిగుతోంది. ఈ సిరీస్‌లో టీమిండియానే ఫేవరెట్‌గా పోరుకు సిద్ధమైంది. దక్షిణాఫ్రికా జట్టుకు కీలక ఆటగాళ్లు దూరం కావడం భారత్‌కు కలిసొచ్చే అంశం.

>
మరిన్ని వార్తలు