అర్ష్‌దీప్‌, అవేశ్‌ అదుర్స్‌

18 Dec, 2023 01:29 IST|Sakshi

నిప్పులు చెరిగిన భారత పేస్‌ బౌలర్లు

తొలి వన్డేలో దక్షిణాఫ్రికాపై 8 వికెట్లతో భారత్‌ ఘనవిజయం

అర్ధ సెంచరీలతో రాణించిన సాయి సుదర్శన్, శ్రేయస్‌ అయ్యర్‌  

వాండరర్స్‌ వేదికపై ఆఖరి టి20లో ధనాధన్‌ మెరుపులతో సునాయాసంగా 200 పైచిలుకు పరుగులు చేసిన భారత్‌... తర్వాత సఫారీ మెడకు స్పిన్‌ ఉచ్చు బిగించి మ్యాచ్‌ గెలిచింది. సిరీస్‌ను సమం చేసింది. మారని వేదికపై మారిన ఫార్మాట్‌లో అలాంటి విజయంతోనే టీమిండియా వన్డే సిరీస్‌లో శుభారంభం  చేసింది. అయితే ఇందులో ముందు  దక్షిణాఫ్రికాను కుప్ప కూల్చేసి తర్వాత సులువైన లక్ష్యాన్ని టీమిండియా చకచకా ఛేదించేసింది. ఈ గెలుపుతో భారత్‌ మూడు వన్డేల సిరీస్‌లో 1–0తో ఆధిక్యం సంపాదించింది. రెండో వన్డే రేపు పోర్ట్‌ ఎలిజబెత్‌లో జరుగుతుంది.  

జొహన్నెస్‌బర్గ్‌: పేస్‌ బౌలర్లు అర్ష్ దీప్‌ సింగ్‌ (5/37), అవేశ్‌ ఖాన్‌ (4/27)ల అసాధారణ స్పెల్‌... అరంగేట్రం మ్యాచ్‌లోనే సాయి సుదర్శన్‌ (43 బంతుల్లో 55 నాటౌట్‌; 9 ఫోర్లు), సీనియర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (45 బంతుల్లో 52; 6 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధసెంచరీలు.. వెరసి దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో భారత్‌ 8 వికెట్ల తేడాతో గెలిచి శుభారంభం చేసింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న దక్షిణాఫ్రికా 27.3 ఓవర్లలో 116 పరుగులకే కుప్పకూలింది.

ఎనిమిదో వరుసలో బ్యాటింగ్‌కు దిగిన ఫెలుక్వాయో (49 బంతుల్లో 33; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్‌ స్కోరర్‌! అనంతరం భారత్‌ 16.4 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి 117 పరుగులు చేసి గెలిచింది. కెరీర్‌లోని తొలి మూడు వన్డేల్లో ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయిన అర్ష్ దీప్‌ తన నాలుగో వన్డేలో ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు గెల్చుకున్నాడు. అంతేకాకుండా దక్షిణాఫ్రికాపై వన్డేల్లో ఐదు వికెట్లు తీసిన తొలి భారత పేస్‌ బౌలర్‌గా అర్ష్ దీప్‌ గుర్తింపు పొందాడు.  

ఆ నలుగురితోనే... 
ముందు బౌలింగ్‌లో ఆ తర్వాత బ్యాటింగ్‌లో ఇద్దరిద్దరు చేసిన ప్రదర్శనతో టీమిండియా గర్జించింది. టాస్‌ గెలవగానే బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికాపై అర్ష్ దీప్‌ తన తొలిఓవర్‌ (ఇన్నింగ్స్‌ రెండో)లోనే చావుదెబ్బ తీశాడు. వరుస బంతుల్లో హెన్‌డ్రిక్స్‌ (0), డసెన్‌ (0)లను డకౌట్‌ చేశాడు.

అడపాదడపా ఫోర్లు, సిక్స్‌లు కొడుతున్న మరో ఓపెనర్‌ టోని డి జోర్జి (28; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు)ని కూడా అర్ష్ దీప్‌ అవుట్‌ చేయడంతో దక్షిణాఫ్రికా కుదేలైంది. ఆ తర్వాత పదో ఓవర్‌ ఆఖరి బంతికి క్లాసెన్‌ (6)నూ అతనే పెవిలియన్‌ చేర్చితే... 11వ ఓవర్‌ తొలి రెండు బంతుల్లో అవేశ్‌... మార్క్‌రమ్‌ (12), ముల్డర్‌ (0)లను పడగొట్టడంతో 52 పరుగులకే 6 వికెట్లను కోల్పోయింది. ఫెలుక్వాయో చేసిన ఆ కాస్త పోరాటంతో సఫారీ వంద పైచిలుకు స్కోరు చేయగలిగింది. 

సాయి, అయ్యర్‌ ఫిఫ్టీ–ఫిఫ్టీ 
రుతురాజ్‌ (5) విఫలమైనా... సాయి సుదర్శన్, శ్రేయస్‌ అయ్యర్‌ ఆతిథ్య బౌలర్లపై పరుగుల భరతం పట్టడంతో ఏ దశలోనూ భారత్‌కు ఇబ్బందే ఎదురవలేదు. ఇద్దరు బౌండరీలతో స్కోరు వేగాన్ని పెంచారు. ఈ క్రమంలోనే భారత్‌ 8.4 ఓవర్లో 50 పరుగుల్ని, 15.1 ఓవర్లో వంద పరుగుల్ని అధిగమించింది.

16వ ఓవర్లోనే సుదర్శన్‌ 41 బంతుల్లో... అయ్యర్‌ 44 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నారు. లక్ష్యానికి చేరువయ్యాక అయ్యర్‌ అవుటయ్యాడు. దీంతో రెండో వికెట్‌కు 88 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. తిలక్‌ వర్మ  (1 నాటౌట్‌)తో సాయి సుదర్శన్‌ మిగతా  లాంఛనాన్ని పూర్తి చేశాడు. 

253  భారత్‌ తరఫున వన్డేల్లో అరంగేట్రం చేసిన 253వ ప్లేయర్‌గా తమిళనాడుకు చెందిన 22 ఏళ్ల సాయి సుదర్శన్‌ గుర్తింపు పొందాడు. 

116  స్వదేశంలో వన్డేల్లో దక్షిణాఫ్రికా జట్టుకిదే అత్యల్ప స్కోరు. 2018లో సెంచూరియన్‌లో భారత్‌పైనే దక్షిణాఫ్రికా 118 పరుగులకు ఆలౌటైంది. 

17 భారత్‌ తరఫున అరంగేట్రం వన్డేలోనే అర్ధ సెంచరీ చేసిన 17వ ప్లేయర్‌గా సాయి సుదర్శన్‌ నిలిచాడు.

వన్డే మ్యాచ్‌లో ఇద్దరు భారత పేస్‌ బౌలర్లు నాలుగు అంత కంటే ఎక్కువ వికెట్ల చొప్పున తీయడం ఇది ఆరోసారి మాత్రమే.  

స్కోరు వివరాలు 
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌: హెన్‌డ్రిక్స్‌ (బి) అర్ష్ దీప్‌ 0; టోని (సి) రాహుల్‌ (బి) అర్ష్ దీప్‌ 28; డసెన్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) అర్ష్ దీప్‌ 0; మార్క్‌రమ్‌ (బి) అవేశ్‌ 12; క్లాసెన్‌ (బి) అర్ష్ దీప్‌ 6; మిల్లర్‌ (సి) రాహుల్‌ (బి) అవేశ్‌ 2; ముల్డర్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) అవేశ్‌ 0; ఫెలుక్వాయో (ఎల్బీడబ్ల్యూ) (బి) అర్ష్ దీప్‌ 33; కేశవ్‌ (సి) రుతురాజ్‌ (బి) అవేశ్‌ 4; బర్గర్‌ (బి) కుల్దీప్‌ 7; షమ్సీ (నాటౌట్‌) 11; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (27.3 ఓవర్లలో ఆలౌట్‌) 116. వికెట్ల పతనం: 1–3, 2–3, 3–42, 4–52, 5–52, 6–52, 7–58, 8–73, 9–101, 10–116. బౌలింగ్‌: ముకేశ్‌ 7–0–46–0, అర్ష్ దీప్‌ 10–0–37–5, అవేశ్‌ 8–3–27–4, కుల్దీప్‌ 2.3–0–3–1. 

భారత్‌ ఇన్నింగ్స్‌: రుతురాజ్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) ముల్డర్‌ 5; సాయి సుదర్శన్‌ (నాటౌట్‌) 55; అయ్యర్‌ (సి) మిల్లర్‌ (బి) ఫెలుక్వాయో 52; తిలక్‌వర్మ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (16.4 ఓవర్లలో 2 వికెట్లకు) 117. వికెట్ల పతనం: 1–23, 2–111. బౌలింగ్‌: బర్గర్‌ 5.4–1–35–0, ముల్డర్‌ 4–0–26–1, కేశవ్‌ 3–0–19–0, షమ్సీ 3–0–22–0, ఫెలుక్వాయో 1–0–15–1. 

>
మరిన్ని వార్తలు