ఏదొక మ్యాచ్ లో విఫలమైనంత మాత్రాన...: కార్తీక్

23 Oct, 2017 14:22 IST|Sakshi

ముంబై:గత కొంత కాలంగా టీమిండియా జట్టులో కీలక స్పిన్నర్లుగా మారిపోయిన యజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్ లను దినేశ్ కార్తీక్ వెనుకేసుకొచ్చాడు. కొన్ని సిరీస్ ల నుంచి వారిద్దరూ అద్భుతమైన బౌలింగ్ అదరగొడుతున్నారంటూ కొనియాడిన కార్తీక్.. న్యూజిలాండ్ తో తొలి వన్డే వారికి ఒక సవాల్ వంటిదని అభిప్రాయపడ్డాడు.

'న్యూజిలాండ్ తో తొలి వన్డే చాహల్, కుల్దీప్ లు మరింత రాటుదేలడానికి కచ్చితంగా సహకరిస్తుంది. ఈ తరహా గేమ్ ల వల్ల వారు మానసికంగా మరింత ధృఢంగా తయారవుతారు. ప్రధానంగా ఒత్తిడి నెలకొన్న సమయంలో బౌలింగ్ ఎలా చేయాలనేది వారికి తెలుస్తుంది. నిన్నటి మ్యాచ్ జరిగిన వాంఖేడ్ స్టేడియం కుల్దీప్, చాహల్ కు ఏమాత్రం అనుకూలించలేదు. అలా అని వారి నైపుణ్యాన్ని మనం తక్కువ చేయలేం. గత సిరీస్ ల్లో కుల్దీప్-చాహల్ జోడి ప్రదర్శనను చూశాం. వారు అద్భుతంగా రాణించారు. ఏదొక మ్యాచ్ లో విఫలమైనంత మాత్రాన వారిని చెత్త బౌలర్లగా పరిగణించకూడదు. భవిష్యత్తు మ్యాచ్ ల్లో వారిద్దరూ మానసికంగా మరింత రాటుదేలతారు'అని కార్తీక్ పేర్కొన్నాడు.
 

మరిన్ని వార్తలు