కివీస్‌ రైజింగ్‌ స్టార్‌ రచిన్‌ రవీంద్రకు వింత అనుభవం

10 Nov, 2023 11:59 IST|Sakshi

భారత సంతతికి చెందిన న్యూజిలాండ్ రైజింగ్‌ క్రికెట్‌ స్టార్‌ రచిన్ రవీంద్రకు వింత అనుభవం ఎదురైంది. శ్రీలంకతో మ్యాచ్‌ ముగిసిన అనంతరం బెంగళూరులోని తన తాతయ్య ఇంటికి వెళ్లిన రచిన్‌కు అతని బామ్మ దిష్టి తీసి వింత అనుభూతిని కలిగించింది. 25 ఏళ్ల రచిన్‌ భారత సంతతికి చెందినవాడే అయినప్పటికీ న్యూజిలాండ్‌లోనే పుట్టి పెరిగడంతో ఈ తంతు మొత్తం కొత్తగా అనిపించింది. ఇది అతని ముఖంలో స్పష్టంగా కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోను బట్టి చూస్తే రచిన్‌ గ్రాండ్‌ పేరెంట్స్‌ సంప్రదాయ హిందూ కుటుంబానికి చెందిన వారుగా తెలుస్తుంది. 

కాగా, వన్డే వరల్డ్‌కప్‌-2023లో భాగంగా నిన్న బెంగళూరులోనే జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌.. శ్రీలంకను ఓడించి సెమీస్‌ బెర్త్‌ను దాదాపుగా ఖరారు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో రచిన్‌ 34 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 42 పరుగులతో పాటు రెండు వికెట్లు పడగొట్టి తన జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో భీకర ఫామ్‌లో ఉన్న రచిన్‌.. తన మొట్టమొదటి వరల్డ్‌కప్‌ ఎడిషన్‌లోనే పలు రికార్డులు బద్దలు కొట్టాడు. 

నిన్నటి మ్యాచ్‌లో రచిన్‌.. క్రికెట్‌ దిగ్గజం​ సచిన్‌ పేరిట ఉన్న ఓ వరల్డ్‌కప్‌ రికార్డును అధిగమించాడు. వరల్డ్‌కప్‌ సింగిల్‌ ఎడిషన్‌లో 25 ఏళ్ల వయసులోపు అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రచిన్‌ (565).. సచిన్‌ రికార్డును (523) బద్దలు కొట్టాడు. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడిన రచిన్‌ 3 సెంచరీలు, 2 హాఫ్‌ సెంచరీల సాయంతో 565 పరుగులు చేసి లీడింగ్‌ రన్‌ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఈ ఎడిషన్‌లో రచిన్‌ 7 వికెట్లు కూడా పడగొట్టాడు. 

మరిన్ని వార్తలు