పాక్‌తో ఆడకపోవడం న్యాయమైందే : కేంద్రమంత్రి

20 Feb, 2019 14:25 IST|Sakshi

న్యూఢిల్లీ : పాకిస్తాన్‌తో భారత్‌ క్రికెట్‌ సంబంధాలను తెంచుకోవాలని వ్యక్తమవుతున్న డిమాండ్‌ న్యాయబద్దమైందేనని కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ అభిప్రాయపడ్డారు. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో యావత్‌ భారత్‌.. పాకిస్తాన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పాక్‌తో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవద్దని, ఇంగ్లండ్‌ వేదికగా జరిగే ప్రపంచకప్‌లో పాక్‌తో జరిగే మ్యాచ్‌ ఆడవద్దనే డిమాండ్‌ వ్యక్తం అవుతోంది. రెండు పాయింట్లు పోయినా పర్లేదు కానీ.. ఉగ్రవాద ప్రేరేపిత దేశంతో ఆడే ముచ్చటే లేదని అభిమానులు బీసీసీఐని కోరుతున్నారు. టీమిండియా క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. 

ఈ డిమాండ్‌ సరైందేనని కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ తెలిపారు. ‘ప్రస్తుతానికి క్రికెట్‌పై నేను ఎలాంటి కామెంట్‌ చేయదల్చుకోలేదు. కానీ ఎవరైతే పాక్‌తో ఆడవద్దనే డిమాండ్‌ చేస్తున్నారో అది మాత్రం న్యాయమైన డిమాండే. పరిస్థితులు అంత సాధారణంగా లేవు. అదొక అంతర్జాతీయ టోర్నమెంట్‌. ఐసీసీ, మన భారత క్రికెట్‌ బోర్డు ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకుంటాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో నేనే అయితే పాక్‌ను పట్టించుకోవాల్సిన అవసరమే లేదంటాను. ఉగ్రదాడిపై ఇమ్రాన్‌ ఖాన్‌ కనీసం సంతాపం కూడా తెలియజేయలేదు.’ అని రవిశంకర్‌ ప్రసాద్‌ చెప్పుకొచ్చారు.

బీసీసీఐ మాత్రం కేంద్రప్రభుత్వ ఆదేశాల మేరకే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. ఇక భారత్‌-పాక్‌ జట్లు 2012-13 నుంచి ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడటం లేదు. కేవలం ఐసీసీ, ఆసియా కప్‌ లాంటి మెగా టోర్నీల్లో మాత్రమే తలపడుతున్నాయి. అయితే ఓ బీసీసీఐ సీనియర్‌ అధికారి మాత్రం ‘ప్రపంచకప్‌ లీగ్‌ దశలో ఆడం సరే... అదే ఏ సెమీస్‌లోనో, ఫైనల్లోనో ఆడాల్సి వస్తే మ్యాచ్‌ వదిలేసుకుంటామా? నిజానికి కార్గిల్‌ యుద్ధం తీవ్రంగా సాగుతున్న సమయంలో కూడా మనం 1999 వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌ ఆడలేదా’ అని ప్రశ్నించారు. 

మరిన్ని వార్తలు