వినేశ్‌ ఫోగట్‌కు రజతం 

2 Mar, 2018 01:04 IST|Sakshi
వినేశ్‌ ఫోగట్‌

ఆసియా రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ 

(బిష్కుక్‌) కిర్గిస్తాన్‌: ఆసియా రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారిణి వినేశ్‌ ఫోగట్‌ రజత పతకం సాధించింది. కామన్వెల్త్‌ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన వినేశ్‌ ఈ మెగా ఈవెంట్‌లో తృటిలో ఆ అవకాశాన్ని కోల్పోయింది. 50 కేజీల విభాగంలో పోటీ పడ్డ వినేశ్‌ ఫైనల్లో 2–3తో చున్‌ లీ (చైనా) చేతిలో ఓటమి పాలైంది. బౌట్‌ ప్రారంభంలో 0–1తో వెనుకబడ్డ వినేశ్‌ ఆ తర్వాత పుంజుకొని రెండు పాయింట్లు సాధించి ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. బౌట్‌ ముగియడానికి మరి కొన్ని క్షణాల ముందు చున్‌ లీ 2 కీలక పాయింట్లు సాధించడంతో వినేశ్‌ ఓటమి ఖాయమైంది. అంతకు ముందు జరిగిన సెమీస్‌లో యూకీ రై (జపాన్‌)పై వినేశ్‌ విజయం సాధించింది.

మరో భారత రెజ్లర్‌ సంగీత 59 కేజీల విభాగంలో కాంస్య పతకం చేజిక్కించుకుంది. ఫ్రీ స్టైల్‌ విభాగంలో సంగీత జీన్‌ ఉమ్‌ (కొరియా)పై గెలుపొంది కాంస్యం సొంతం చేసుకుంది. దీంతో ఆసియా రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత పతకాల సంఖ్య నాలుగుకు చేరింది. అంతకుముందు ఈ క్రీడల్లో భారత్‌కు చెందిన ఇద్దరు పురుష రెజ్లర్లు గ్రీకో–రోమన్‌ విభాగంలో కాంస్య పతకాలు సాధించారు. హర్‌ప్రీత్‌ సింగ్‌ (82 కేజీలు) 11–3తో ఖాశింబెకోవ్‌ (ఉజ్బెకిస్తాన్‌)పై; రాజేంద్ర కుమార్‌ (55 కేజీలు) 3–3తో మిరాఖ్‌మెడోవ్‌ (ఉజ్బెకిస్తాన్‌) పై గెలిచి కాంస్యాలు సొంతం చేసుకున్నారు.   

మరిన్ని వార్తలు