కోహ్లికి సాటెవ్వడూ!

13 Oct, 2018 09:35 IST|Sakshi
విరాట్‌ కోహ్లి

దుబాయ్‌ : టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి టెస్టుల్లో తన అగ్రస్థానాన్ని మరింత పదిల పరుచుకున్నాడు. కెరీర్‌లో అత్యధిక రేటింగ్‌ పాయింట్లు 936తో నంబర్‌ వన్‌ ర్యాంకులో కొనసాగుతున్నాడు. ఇంగ్లండ్‌తో  సౌథాంప్టన్‌ టెస్టు తర్వాత విరాట్‌ టెస్టుల్లో నెం1 ర్యాంకునందుకున్న విషయం తెలిసిందే. ఇక వెస్టిండీస్‌తో రాజ్‌కోట్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో కోహ్లి 139 పరుగులతో ఎవరికి అందనంత దూరం వెళ్లాడు. బాల్ ట్యాంపరింగ్‌ వివాదంతో నిషేదం ఎదుర్కొంటున్న ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ 919 పాయింట్లతో తరువాతి స్థానంలో కొనసాగగా.. 847 పాయింట్లతో మూడోస్థానంలో న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ నిలిచాడు. (చదవండి: విండీస్‌ నిలబడింది)

రాజ్‌కోట్‌ టెస్టులో ఐదు వికెట్లతో చెలరేగిన చైనామన్‌ బౌలర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ తన ర్యాంకును మెరుగు పరుచుకున్నాడు. ఏకంగా 16 స్థానాలు ఎగబాకి 57వ స్థానంలో నిలిచాడు. విండీస్‌పైనే అజేయ శతకం సాధించిన స్పిన్నర్‌ రవీంద్ర జడేజా బ్యాట్స్‌మెన్‌ ర్యాంకింగ్స్‌లో 6 స్థానాలు ముందుకెళ్లి 51వ ర్యాంకులో ఉన్నాడు. ఇక ఆల్‌రౌండర్‌ జాబితాలో అగ్రస్థానంలోని షకిబ్‌ అల్‌ హసన్‌ కన్నా మూడు పాయింట్లు తక్కువతో రెండో స్థానంలో నిలిచాడు. అరంగేట్రంలోనే అదరగొట్టి శతకం సాధించిన యువ పృథ్వీషా 73వ స్థానంతో ర్యాంకుల జాబితాలో ప్రవేశించాడు. ఆస్ట్రేలియా తరఫున టెస్టులో అరంగేట్రం చేసిన ఆరోన్ ఫించ్‌ 72వ ర్యాంకులో ఉన్నాడు. పాక్‌పై 85, 141 పరుగులు చేసిన కంగారూ ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖావాజా తొలిసారి టాప్‌-10లో స్థానం దక్కించుకున్నాడు. పదో స్థానంలో కొనసాగుతున్నాడు.

చదవండి: అభిమాని చర్యతో అవాక్కైన కోహ్లి

మరిన్ని వార్తలు